
- నలుగురు అరెస్ట్, సూర్యాపేటలో ఘటన
చివ్వె౦ల, వెలుగు : పురాతన బంగారు నాణేలను అమ్ముతామంటూ ఓ వ్యాపారి నుంచి రూ. 20 లక్షలు తీసుకున్న వారిని పోలీసులు అరెస్ట్ చేశారు. కేసుకు సంబంధించిన వివరాలను సూర్యాపేట డీఎస్పీ ప్రసన్నకుమార్ సోమవారం వెల్లడించారు. సూర్యాపేట మున్సిపాలిటీ పరిధిలోని దురాజ్‌పల్లి తెల్లబండ కాలనీకి చెందిన పసుపుల గణేశ్, ఓర్సు చంటి కలిసి నిమ్మనగోటి వెంకటేశ్వర్లు అనే వ్యాపారికి చెందిన హోటల్ నిర్మాణంలో పనిచేశారు.
వెంకటేశ్వర్లు వద్ద చాలా డబ్బులు ఉన్నాయని గ్రహించిన వారు తమ ఫ్రెండ్స్ వెంకన్న, పసుపుల సత్యంతో కలిసి డబ్బులను కొట్టేసేందుకు ప్లాన్ చేశారు. ఇందులో భాగంగా వెంకటేశ్వర్లును కలిసి తమకు లంకెబిందెలు దొరికాయని, వాటిలో కిలోల కొద్దీ పురాతన బంగారు నాణేలు ఉన్నాయని, తక్కువ ధరకే అమ్ముతామని నమ్మించి రూ. 20 లక్షలకు బేరం కుదుర్చుకున్నారు. ఈ నెల 10న రూ. 5 లక్షలు, తర్వాతి రోజు మరో రూ. 15 లక్షలు తీసుకున్నారు.
బంగారం కోసం వ్యాపారి ప్రశ్నించడంతో గుర్తు తెలియని వ్యక్తులు తమపై దాడి చేసి డబ్బులు ఎత్తుకెళ్లారని చెప్పారు. వారిపై అనుమానం వచ్చిన వ్యాపారి వెంకటేశ్వర్లు ఈ నెల 20న చివ్వెంల పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో గణేష్, చంటి, వెంకన్న, సత్యంను అదుపులోకి తీసుకొని రూ.13.5 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. వీరికి సహకరించిన నవీన్, శ్రీను, గోపమ్మ, లక్ష్మి, అంజలి పరారీలో ఉన్నారని డీఎస్పీ ప్రసన్నకుమార్ తెలిపారు.