అధిక వడ్డీ వసూళ్లపై పోలీసుల నజర్ .. తనిఖీల్లో జిల్లా వ్యాప్తంగా 14 మందిపై కేసులు

అధిక వడ్డీ వసూళ్లపై  పోలీసుల నజర్ .. తనిఖీల్లో జిల్లా వ్యాప్తంగా 14 మందిపై కేసులు
  • ఫైనాన్సులు నడిపే వారి ఆఫీసులు, ఇండ్లల్లో ఏకకాలంలో దాడులు

కామారెడ్డి, వెలుగు: అధిక వడ్డీలతో  ప్రజల నడ్డి విరుస్తున్న ఫైనాన్స్​వ్యాపారులపై పోలీసులు సీరియస్​గా నజర్ ​పెట్టారు. జిల్లావ్యాప్తంగా అన్నీ పోలీస్ స్టేషన్ల పరిధిలో ఏకకాలంలో దాడులు నిర్వహించి, కేసులు నమోదు చేశారు. ప్రజల ఆర్థిక అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఫైనాన్స్​ వ్యాపారులు అధిక వడ్డీ వసూలు చేస్తున్నారు. నిర్ణీత గడువులోగా అప్పు తిరిగి చెల్లించకపోతే రెండింతలు, మూడింతల విలువైన ఆస్తులను తమ పేరుపై రిజిస్ట్రేషన్​ చేయించుకుంటున్నారు. 

ఇటీవల కాలంలో జిల్లాలో ఫైనాన్స్ ​వ్యాపారుల వేధింపులు, మోసాలపై జిల్లా ఎస్పీకి సమాచారం అందింది. వివిధ వర్గాల ద్వారా సమాచారం సేకరించిన ఎస్పీ సింధూశర్మ ఫైనాన్సులపై దాడులకు ఆదేశించారు. దీంతో జిల్లా పోలీస్ ​యంత్రాంగం దాడులు నిర్వహించి రికార్డులను సీజ్ ​చేశారు. 14 మందిపై కేసులు నమోదు చేశారు. 184 ప్రామిసరీ నోట్లు, 12  చెక్​బుక్​లు, భూమి, ఇండ్లు, ఇండ్ల స్థలాల మార్టిగేజ్ ​పేపర్లను సైతం స్వాధీనం చేసుకున్నారు. ఫైనాన్స్​వ్యాపారులపై పోలీసులు ఆకస్మికంగా తనిఖీలు చేయడం జిల్లాలో చర్చనీయాంశమైంది.

వందల సంఖ్యలో వ్యాపారులు

జిల్లాలో రిజిస్టరైన ఫైనాన్సుల పదుల సంఖ్యలో ఉండగా, వందలాది మంది పర్మిషన్లు లేకుండానే వడ్డీ వ్యాపారం, ఫైనాన్స్​ దందా చేస్తున్నారు. ప్రజల అవసరాలను ఆసరాగా  చేసుకొని ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారు. అధిక వడ్డీలు వసూలు చేయడం, కుదువబెట్టిన ఆస్తులను తమ పేరుపై రిజిస్ట్రేషన్​ చేసుకుంటున్నారు. అప్పులను క్లియర్​ చేసినా తాకట్టు పెట్టిన ప్రాపర్టీస్​ను ఇవ్వడానికి ఇబ్బందులు పెడుతున్నారు. 

కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్సువాడ, లింగంపేట, భిక్కనూరు, గాంధారి, పిట్లం, బిచ్కుంద ఏరియాల్లో వడ్డీ వ్యాపారం దందా యథేచ్ఛగా సాగుతోంది.  కామారెడ్డి టౌన్ లో కొందరు వ్యాపారులు అప్పు ఇచ్చేటప్పుడు నూటికి   రూపాయి, రెండు రూపాయలు చెప్పి చివరకు 3 రూపాయల కంటే ఎక్కువే వడ్డీ వసూలు చేస్తున్నారు. గడువులోగా అప్పు చెల్లించకపోతే తక్కువ మొత్తానికే వారి ఆస్తులను స్వాధీనం చేసుకుంటున్నారు. వడ్డీ వ్యాపారుల వలలో చిక్కిన పలువురు బాధితులు విలవిలలాడుతున్నారు. పరిస్థితుల ప్రభావంతో తమ సమస్యను బయటకు చెప్పుకునేందుకు ఇబ్బందులు పడుతున్నారు.

ఎస్పీ స్పెషల్​ ఫోకస్​

కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన ఓ ఫైనాన్స్​వ్యాపారి ఆస్తులను తాకట్టు పెట్టుకొని అప్పులిస్తాడు. మిత్తి రెండింతలు, మూడింతలు చేసి ఆస్తులను తిరిగి ఇవ్వడానికి ఇబ్బందులు పెట్టేవాడు. గతంలో పోలీసులకు ఫిర్యాదులు చేసినా పట్టించుకున్న దాఖలాలు లేవు. సదరు వ్యక్తిపై గతంలో పోలీసులకు కంప్లైంట్స్​కూడా చేశారు. ఇటీవల ఓ వ్యక్తి నేరుగా ఎస్పీకి ఫిర్యాదు చేయడంతో ఆమె సీరియస్​గా తీసుకొని కబ్జా కేసు నమోదు చేసి సదరు వ్యక్తిని అరెస్ట్​చేశారు.  

ప్రజలను ఇబ్బందులు పెడితే చర్యలు

వడ్డీ వ్యాపారం పేరుతో ప్రజలను ఇబ్బందులు పెడితే ఊరుకోం. అమాయకులను మోసం చేయడం సరికాదు. ప్రజల ఆర్థిక అవసరాలను ఆసరాగా చేసుకొని ఇబ్బందులు పెట్టే వ్యాపారులపై కఠినంగా వ్యవహరిస్తాం. జిల్లావ్యాప్తంగా 14 మందిపై కేసు నమోదు చేశాం.

సింధూశర్మ, ఎస్పీ, కామారెడ్డి