
హైదరాబాద్, వెలుగు: ఎలక్షన్ కోడ్ అమలుపై పోలీసులు స్పెషల్ ఫోకస్ పెట్టారు. ప్రచారాలు, సభలు, సమావేశాలప్పుడు ఎలక్షన్ కమిషన్(ఈసీ) నిబంధనలు పాటించనోళ్లపై కేసులు పెడుతున్నారు. ఇందుకు అభ్యర్థుల వెంట ఇద్దరు కానిస్టేబుల్స్‌తో పాటు షాడో టీమ్స్ ఏర్పాటు చేశారు. ఇంటలిజెన్స్, స్పెషల్ బ్రాంచ్ కానిస్టేబుల్స్‌తో నిఘా పెట్టారు. బుధవారంతో నామినేషన్స్ ఉపసంహరణ ముగిసిన తర్వాత ప్రధాన పార్టీల అభ్యర్థులను, వారి అనుచరులను నీడలా ఫాలో చేస్తున్నారు.
ఇందుకోసం గ్రేటర్ హైదరాబాద్‌లోని 3 కమిషనరేట్ల పరిధిలో 120 షాడో టీమ్స్ పనిచేస్తున్నాయి. ఒక్కో టీమ్‌లో ఇద్దరు కానిస్టేబుల్స్.. అభ్యర్థులను నిరంతరం ఫాలో చేస్తూ కార్యకర్తలతో కలిసి ప్రచారాలు, రోడ్ షోల్లో పాల్గొంటున్నారు. ఎప్పటికప్పుడు రిపోర్ట్‌ను స్థానిక డీసీపీలు, రిటర్నింగ్‌ఆఫీసర్, ఈసీకి ఆన్‌లైన్‌లో పంపిస్తున్నారు. ఉల్లంఘించేవాళ్లపై కేసులు పెడుతున్నారు.
సీక్రెట్ ఆపరేషన్
ఎమ్మెల్యే అభ్యర్థుల ప్రచారంలో కార్యకర్తలతో పాటు పోలీసులు కూడా కలిసిపోతున్నారు. నియోజకవర్గాల పార్టీ ఆఫీసులలో రాత్రీపగలు మఫ్టీలో తిరుగుతున్నారు. అభ్యర్థుల ప్రోగ్రామ్స్ వివరాలతో పాటు డబ్బుల పంపిణీ, ఓటర్లను ప్రలోభపెట్టేందుకు ఇస్తున్న గిఫ్ట్‌లను గుర్తించి ఈసీకి సమాచారం చేరవేస్తున్నారు. స్థానిక బూత్ లెవల్ కార్యకర్తల వివరాలను సేకరిస్తున్నారు. డబ్బు పంపిణీకి ఎక్కువగా అవకాశాలు ఉన్న ప్రాంతాలను గుర్తించి రిపోర్ట్ సిద్ధం చేస్తున్నారు.
ప్రచార రథాలు, జెండాలు, రోడ్‌షోలు, ఇంటింటి ప్రచారం ఇలా అభ్యర్థులు పాల్గొనే ప్రతి కార్యక్రమానికి సంబంధించిన పూర్తి సమాచారం పోలీసులు సేకరిస్తున్నారు. వివాదాస్పద కామెంట్లు, గొడవలను రికార్డ్ చేస్తున్నారు. నేతల రోజువారీ ఖర్చులను తెలుసుకుంటున్నారు. హవాలా క్యాష్ ట్రాన్స్ పోర్ట్ కు సంబంధించిన వివరాలపైనా నిఘా వేశారు. ప్రచారాల్లో న్యూసెన్స్ కు పాల్పడేవారిపైనా కేసులు ఫైల్ చేస్తున్నారు. ఇలా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినప్పటి నుంచి 43 కేసులు పెట్టారు.