యువతిని కారుతో ఢీకొట్టి లాక్కెళ్లిన ఘటనలో కీలక విషయాలు

యువతిని కారుతో ఢీకొట్టి లాక్కెళ్లిన ఘటనలో కీలక విషయాలు

న్యూఢిల్లీ: యువతిని కారుతో ఢీకొట్టి లాక్కెళ్లిన ఘటనలో పోలీసులు కీలక విషయాలు వెల్లడించారు. మృతురాలు అంజలి సింగ్​పై అత్యాచారం జరగలేదని ప్రకటించారు. మౌలానా ఆజాద్ మెడికల్ కాలేజీ బోర్డ్ ఆఫ్ డాక్టర్ల టీం.. పోస్టుమార్టం పూర్తి చేసి ప్రైమరీ రిపోర్టును పోలీసులకు సబ్మిట్ చేసింది. అంజలి సింగ్ ప్రైవేట్ పార్ట్స్​పై ఎలాంటి గాయాల్లేవని పోలీసులు తెలిపారు. మరిన్ని టెస్ట్​ల కోసం జీన్ ప్యాంట్ ముక్కలతో పాటు బాడీ శాంపిల్స్ సేకరించి భద్రపర్చినట్టు వివరించారు. కూతురుపై అత్యాచారం జరిగిందని మృతురాలి తల్లి చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదన్నారు. డెడ్​బాడీ కారు కింద ఇరుక్కుపోవడంతోనే బట్టలు చినిగిపోయాయని తెలిపారు. తల, వెన్నెముక, ఎడమ తొడ ఎముక, మోకాళ్లకు గాయాలు కావడంతో అంజలి షాక్​కు గురైందని, చాలా రక్తం పోవడంతో ఆమె చనిపోయిందని స్పెషల్ కమిషనర్​ సాగర్​ ప్రకటించారు. కాగా, భారీ పోలీసు బందోబస్తు మధ్య ఆమె అంత్యక్రియలు మంగళవారం ముగిశాయి. అంజలి అంతిమ యాత్రలో వేలాది మంది ప్రజలు పాల్గొన్నారు.

భయంతో పారిపోయా: నిధి, అంజలి ఫ్రెండ్

అంజలి సింగ్ వెంట ఆమె ఫ్రెండ్ నిధి కూడా ఉన్నట్టు పోలీసులు తాజాగా గుర్తించారు. అంజలి వచ్చిన రూట్​ను పరిశీలించగా ఈ విషయం వెలుగులోకొచ్చింది. నిధిని ట్రేస్ చేసి పోలీసులు ఆమె స్టేట్​మెంట్ రికార్డు చేశారు. ఆ తర్వాత కోర్టులో హాజరుపర్చారు. ‘యాక్సిడెంట్ తర్వాత భయపడ్డా. అంజలిని కాపాడాలని ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. అప్పటికే ఆ కారు అంజలిని ఈడ్చుకెళ్లిపోయింది. ఇదంతా చూసి భయపడ్డా. అందుకే పోలీసులకు చెప్పలేదు”అని నిధి కోర్టుకు వివరించింది.