యూరియా కోసం అదే బారులు.. రైతుపై చేయి చేసుకున్న పోలీసు అధికారి

యూరియా కోసం అదే బారులు.. రైతుపై చేయి చేసుకున్న పోలీసు అధికారి

కోహెడ, చేర్యాల, వెలుగు: మండల కేంద్రంలోని పీఏసీఎస్ కు సోమవారం సాయంత్రం యూరియా బ్యాగులు వచ్చాయని తెలిసి రాత్రి నుంచే రైతులు చెప్పులను క్యూలైన్​లో పెట్టారు. శనిగరం, సముద్రాల గ్రామాల్లో సైతం రైతులు యూరియా కోసం తీవ్ర ఇబ్బందులు పడ్డారు. టోకెన్లు ఇచ్చి అధికారులు పంపిణీ చేశారు. మండలానికి 2243 యూరియా బ్యాగులు రాగా 2వేల మంది రైతులకు పంపిణీ చేసినట్లు ఏవో సతీశ్​తెలిపారు. హుస్నాబాద్​లో యూరియా కోసం రైతులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. రైతులకు సరిపడా యూరియాను అందించాలని కోరుతున్నారు.

చేర్యాలలో పోలీస్​ బందోబస్తు మధ్య యూరియా బ్యాగులను పంపిణీ చేశారు. బ్యాగులు కొన్ని మాత్రమే ఉన్నాయన్న సమాచారంతో  రైతు వేదిక వద్దకు రైతులు భారీగా తరలివచ్చారు. శనివారం అధికారులకు ఇచ్చిన పాసుపుస్తకాలు, ఆధార్​ కార్డుల జిరాక్స్​లు బయట దర్శనమివ్వడంతో ఆందోళనకు గురయ్యారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన వ్యవసాయ శాఖ అధికారులపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్ఐ నవీన్​ సిబ్బందితో వచ్చి రైతులను క్యూ లైన్​లో నిల్చోబెట్టారు.అనంతరం యూరియా పంపిణీ చేశారు. మెదక్​జిల్లా శివ్వంపేటలో రైతులు యూరియా కోసం మండల కేంద్రంలోని సొసైటీ  ముందు కిలోమీటర్ వరకు క్యూ లైన్ లో నిల్చున్నారు.  పోలీస్ బందోబస్తు మధ్య అధికారులు యూరియా పంపిణీ చేశారు. పనులు వదులుకొని రోజు యూరియా కోసం పడిగాపులు కాస్తున్నామని సరిపోను యూరియా ఇవ్వడం లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

రైతుపై చేయి చేసుకున్న పోలీసు అధికారి 

సిద్దిపేట, వెలుగు: యూరియా కోసం వచ్చిన రైతుపై పోలీసు అధికారి చేయి చేసుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సిద్దిపేటలోని ఇంటి గ్రేటెడ్ మార్కెట్ వద్ద  సోమవారం యూరియా పంపిణీ సందర్భంగా బూరుగుపల్లి కి చెందిన డేవిడ్ పై పోలీసు అధికారి చేయి చేసుకున్నాడు. యురియా టోకెన్ తీసుకొని బస్తాలు తీసుకోవడానికి వెళ్తుండగా అడ్డుకొని అతడిపై చేయి చేసుకున్నాడు. ఈ  వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో సదరు పోలీసు అధికారిపై చర్య తీసుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.