- సీపీ సాయి చైతన్య
ఎడపల్లి, వెలుగు: యువతను చెడు వ్యసనాలకు దూరం చేసి, క్రీడల వైపు మళ్లించేందుకు పోలీస్ శాఖ క్రీడా పోటీలను నిర్వహిస్తోందని సీపీ సాయి చైతన్య అన్నారు. సోమవారం ఎడపల్లి మండలంలోని జానకంపేట్ సమీపంలోని జిల్లా పోలీసు శిక్షణ కేంద్రంలో బోధన్ సబ్ డివిజన్ పోలీసులు వారం రోజులుగా నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్ ముగింపు కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం లో భాగంగా బోధన్ రూరల్, ఎడపల్లి, రెంజల్ పోలీస్ స్టేషన్ల ఆధ్వర్యంలో యువత కోసం ఇటువంటి టోర్నమెంట్ నిర్వహించడం అభినందనీయమన్నారు.
విజేతగా నిలిచిన సాలూర మండల క్రికెట్ జట్టుకు రూ.25 వేల నగదు బహుమతి, రెండో స్థానంలో నిలిచిన పోలీస్ టీంకు రూ.12,500 నగదు బహుమతితో పాటు ప్రైజులు అందజేశారు. పోలీస్ అమరవీరుల వారోత్సవాల సందర్భంగా నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో గెలిచిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. బోధన్ ఏసీపీ శ్రీనివాస్, బోధన్ రూరల్ సీఐ విజయ్ బాబు, బోధన్ సీఐ వెంకట్ నారాయణ, రుద్రూర్ సీఐ కృష్ణ, ఎడపల్లి ఎస్సై రమా, బోధన్ రూరల్ ఎస్సై మచ్చేందర్ రెడ్డి, రెంజల్ ఎస్సై చంద్ర మోహన్, కోటగిరి ఎస్సై సునీల్, 26 జట్ల క్రీడాకారులు, యువత బోధన్ సబ్ డివిజన్‌కు చెందిన పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
