లాక్ డౌన్ లో ఆర్మీ క‌ల్న‌ల్ బిడ్డ‌ పెళ్లి: పోలీసులు త‌ల్లిదండ్రులుగా మారి క‌న్యాదానం

లాక్ డౌన్ లో ఆర్మీ క‌ల్న‌ల్ బిడ్డ‌ పెళ్లి: పోలీసులు త‌ల్లిదండ్రులుగా మారి క‌న్యాదానం

పెళ్లి కొడుకు సాఫ్ట్ వేర్ ఉద్యోగి.. పేరు ఆదిత్య బిస్త్. పెళ్లి కుమార్తె డాక్ట‌ర్.. ఆమె పేరు నేహా కుశ్వాహ‌. ఇద్ద‌రూ మ‌హారాష్ట్ర‌లోని పుణేలో ఉంటారు. అమ్మాయి తండ్రి నాగ్ పూర్ లో, అబ్బాయి తండ్రి డెహ్రాడూన్ లో ఆర్మీలో క‌ల్నల్ ర్యాంక్ అధికారులుగా సేవ‌లు అందిస్తున్నారు. వారిద్ద‌రి పిల్ల‌ల‌కు పెళ్లి చేయాల‌నుకున్నారు. వారికి ఫిబ్ర‌వ‌రి 14న నిశ్చితార్థం కూడా చేశారు. మే 2న పెళ్లి ముహూర్తం ఫిక్స్ చేశారు. డెహ్రాడూన్ లో వారి వివాహం వైభ‌వంగా చేయాల‌నుకున్నారు. కానీ క‌రోనా లాక్ డౌన్ కార‌ణంగా వ‌ధూవ‌రులిద్ద‌రూ పుణేలోనే చిక్కుకుపోయారు. అయితే వారిద్ద‌రూ ఒకే చోట ఉండ‌డంతో పెళ్లి అనుకున్న ముహూర్తానికే చేయాల‌ని త‌ల్లిదండ్రులు భావించారు. ఇందు కోసం పోలీసుల సాయం కోరారు. దేశ ర‌క్ష‌ణ‌లో ఉన్న ఆర్మీ అధికారుల అభ్య‌ర్థ‌న‌తో తామే ఆ పిల్ల‌ల త‌ల్లిదండ్రులుగా మారి.. సంప్ర‌దాయం ప్ర‌కారం పెళ్లి తంతు జ‌రిపారు పోలీసులు.

పెళ్లి కొడుకు కాళ్లు క‌డిగి క‌న్యాదానం చేసిన పోలీసులు

పెళ్లి కొడుకు ఆదిత్య తండ్రి పుణేలోని హ‌ద‌ప్సార్ ఏరియా పోలీస్ స్టేష‌న్ అసిస్టెంట్ ఇన్ స్పెక్ట‌ర్ ప్ర‌సాద్ లోన‌రేకు ఏప్రిల్ 26న‌ ఫోన్ చేసి.. లాక్ డౌన్ కార‌ణంగా ఎక్క‌డివాళ్లు అక్క‌డే ఇరుక్కుపోయామ‌ని, త‌మ పిల్ల‌ల పెళ్లి జ‌రిపించాల‌ని కోరారు. దీంతో ఈ విష‌యాన్ని పుణే క‌మిష‌న‌ర్ దృష్టికి తీసుకెళ్లడంతో ఆర్మీ అధికారుల రిక్వెస్ట్ కు ఉన్న‌తాధికారులు ఓకే చేశారు. డీసీపీ బావ‌చే స‌హా 12 మంది పోలీసు అధికారులు ద‌గ్గ‌రుండి ఆదిత్య, నేహాల పెళ్లిని శ‌ని‌వారం చేశారు. పెళ్లికి పంతులుతో స‌హా ఫొటో గ్రాఫ‌ర్లను ఏర్పాటు చేశారు. పెళ్లికొడుకు, పెళ్లికూతురు త‌ల్లిదండ్రులు, అమ్మాయి సోద‌రి వీడియో కాల్ ద్వారా వివాహాన్ని చూశారు.

సంప్ర‌దాయం ప్ర‌కారం అమ్మాయి త‌ల్లిదండ్రులు పెళ్లికొడుకు కాళ్లు క‌డిగి క‌న్యాదానం చేయాలి. దీంతో పోలీస్ ఇన్ స్పెక్ట‌ర్ మ‌నోజ్ పాటిల్, ఆయ‌న భార్య అశ్విని.. పెళ్లికూతురి త‌ల్లిదండ్రులుగా మారి కాన్యాదానం చేశారు. పోలీసుల స‌మ‌క్షంలో త‌మ పెళ్లి సంప్ర‌దాయబ‌ద్ధంగా జ‌ర‌గ‌డం చాలా సంతోషంగా ఉంద‌ని చెబుతున్నారు న‌వ వ‌ధూవ‌రులు ఆనంద్, నేహా.