అస్సాం పోలీస్ ప్రశ్నాపత్రం లీకేజీ కేసులో రూ. 5.28 కోట్లు స్వాధీనం

అస్సాం పోలీస్ ప్రశ్నాపత్రం లీకేజీ కేసులో రూ. 5.28 కోట్లు స్వాధీనం

అస్సాం పోలీసు నియామక కుంభకోణానికి సంబంధించి రూ. 5.28 కోట్లకు పైగా నగదును స్వాధీనం చేసుకోవడంతో పాటు మరో ఎనిమిది మందిని అరెస్టు చేసినట్లు డీజీపీ భాస్కర్ జ్యోతి మహంత శనివారం తెలిపారు. దాంతో ఇప్పటివరకు ఈ కేసుకు సంబంధించి అరెస్టయిన వారి సంఖ్య 45కి చేరిందని ఆయన తెలిపారు. పోలీసు నియామక ప్రశ్నపత్రం లీక్‌లో ప్రధాన నిందితుడిని పట్టుకునేందుకు గత కొన్ని రోజులుగా పలు జిల్లాల్లో దాడులు జరిగాయని ఆయన తెలిపారు.

‘ప్రశ్నాపత్రాన్ని లీక్ చేసిన వ్యక్తిని కనుగొనడమే మా ప్రధాన లక్ష్యం. ఆ విషయంలో ఎవరినీ వదిలిపెట్టం. ఇప్పటివరకు నమోదైన ఐదు కేసుల్లో 45 మందిని అరెస్టు చేశాం. గడిచిన 24 గంటల్లో బొంగైగావ్ నుంచి 3.4 కోట్లు, బార్పేట నుంచి 1.7 కోట్లు, చిరాంగ్ నుంచి 3 లక్షలు, మరియు మరో ప్రదేశం నుంచి 15 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నాం’ అని డీజీపీ తెలిపారు.

ఈ కేసు దర్యాప్తు గురించి అదనపు పోలీసు జనరల్ (లా అండ్ ఆర్డర్) జ్ఞానేంద్ర ప్రతాప్ సింగ్ మాట్లాడుతూ.. ‘గత 20 రోజులుగా ఈ కేసును పరిశీలిస్తున్నాం. ప్రశ్నపత్రం ఎలా లీక్ అయ్యిందనే దానిపై లోతుగా దర్యాప్తు చేస్తున్నాం. అస్సాం పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో పనిచేసే వారేవరైనా ఈ చర్యకు పాల్పడ్డారా లేక మరేదైనా కుట్ర ఉందా అని దర్యాప్తు చేస్తున్నాం. ఈ కేసులో సహనం అతిపెద్ద ధర్మం’ అని ఆయన అన్నారు.

దర్యాప్తులో భాగంగా భారీ మొత్తంలో పత్రాలు, డిజిటల్ ఆధారాలు సేకరించినట్లు సీఐడీ ఇన్‌స్పెక్టర్ జనరల్ సురేంద్ర కుమార్ తెలిపారు. ఈ కేసుకు సంబంధించిన చార్జిషీట్లను 90 రోజుల వ్యవధిలో దాఖలు చేయడానికి ప్రయత్నిస్తున్నామని ఆయన తెలిపారు. కేసు దర్యాప్తు వేగవంతం చేయడానికి మరో ఇద్దరు అధికారులను దర్యాప్తు బృందంలో చేర్చుకున్నామని.. దాంతో ముగ్గురు డిఎస్పీలు, ముగ్గురు ఇన్స్పెక్టర్లు మరియు పలువురు సాంకేతిక నిపుణులు ఈ కేసు మీద పనిచేస్తున్నారని ఆయన తెలిపారు. సాక్ష్యాలను సేకరించే విషయంలో తాము చాలా మంచి పురోగతి సాధించామని.. ఇప్పటికే 10 మంది మేజిస్ట్రేట్ ముందు స్టేట్మెంట్ ఇచ్చారని ఆయన చెప్పారు.

పోలీసు రిక్రూట్‌మెంట్ ఎగ్జామినేషన్ పేపర్ లీక్ కేసులో ప్రధాన నిందితుడైన అస్సాం రిటైర్డ్ డీఐజీ పికె దత్తాను బుధవారం అరెస్టు చేసి ఆరు రోజుల పాటు పోలీసు కస్టడీకి రిమాండ్ చేశారు. అంతేకాకుండా పికె దత్తా యాజమాన్యంలోని రెండు భార్గవ్ హోటళ్ల లైసెన్సులను రద్దు చేయాలని కోరుతూ సీఐడీ సంబంధిత అధికారికి లేఖ రాసినట్లు సురేంద్ర కుమార్ చెప్పారు.

రాష్ట్రవ్యాప్తంగా 597 పోస్టులకు 154 కేంద్రాల్లో సెప్టెంబర్ 20న పరీక్ష రాసేందుకు సుమారు 66,000 మంది అభ్యర్థులు తమ అడ్మిట్ కార్డులను డౌన్‌లోడ్ చేసుకున్నారు. కాగా.. ప్రశ్నపత్రం సోషల్ మీడియాలో లీక్ అయినట్లు తేలడంతో పరీక్ష ప్రారంభమైన కొద్దిసేపటికే రద్దు చేయబడింది. ప్రశ్నాపత్రం లీక్‌కు నైతిక బాధ్యత వహిస్తూ రాష్ట్ర స్థాయి పోలీసు రిక్రూట్‌మెంట్ బోర్డు (ఎస్‌ఎల్‌పిఆర్‌బి) చైర్మన్ ప్రదీప్ కుమార్ సెప్టెంబర్ 27న రాజీనామా చేశారు. ఈ రాతపరీక్షను నవంబర్ 22న రీ షెడ్యూల్ చేశారు.

For More News..

తనను తానే కిడ్నాప్ చేసుకున్న బాలుడు.. తండ్రికి ఫోన్ చేసి రూ. 10 లక్షలు డిమాండ్

పాయింట్ బ్లాంక్‌లో గన్ పెట్టి 17 ఏళ్ల యువతిపై సామూహిక అత్యాచారం

తెలంగాణలో కొత్తగా 1,717 కరోనా కేసులు

డీజీపీకి రాని ఎమ్మెల్యే సీటు కానిస్టేబుల్‌కు వచ్చింది