
పోలీస్స్టేషన్.. ఈ మాట వింటే చాలు చాలా మందికి భయమేస్తుంది. చీకటి గదుల లాకప్లు, ఖాకీ డ్రెస్సులో గంభీరంగా ఉండే పోలీసులను చూస్తే దడ పుట్టేస్తుంది. కానీ, ఇకపై పోలీస్స్టేషన్లకు వెళితే మాత్రం మొహంపై నవ్వు నాట్యం చేస్తుంది. అంతా ఆ పోలీస్స్టేషన్లలోని కార్టూన్ల మహిమ! అవును, జనాల్లో పోలీస్స్టేషన్ అనే భయాన్ని పోగొట్టేందుకు కేరళ పోలీస్ డిపార్ట్మెంట్ ఈ పనిని భుజాన వేసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 481 పోలీస్స్టేషన్ల గోడలపై కార్టూన్లు వేయించేందుకు నిర్ణయించింది.
రెండు నెలల్లో అన్ని పోలీస్స్టేషన్ల గోడలపై కార్టూన్లను వేసే ప్రోగ్రామ్ను కేరళ డీజీపీ లోక్నాథ్ బెహరా మంగళవారం ప్రారంభించారు. ఇప్పటికే ఫోర్ట్, వలియథురా, కోవలం, వంచియూర్, మ్యూజియం, పెరూరకడ పోలీస్స్టేషన్లలో ఏర్పాటు చేసేందుకు కార్టూన్లూ అందాయి. నవ్వు తెప్పించేవే కాకుండా సమాజానికి అవసరమయ్యే యాంటీ కరప్షన్, హ్యుమానిటీ వంటి వాటినీ కార్టూన్ల రూపంలో చెప్పనుంది. ఆసక్తి ఉన్న వారు ఎవరైనా కార్టూన్లు వేసి పంపించొచ్చని బెహరా చెప్పారు.