మావోయిస్టుల వారోత్సవాలపై పోలీసుల నిఘా

మావోయిస్టుల వారోత్సవాలపై పోలీసుల నిఘా
  • నేటి నుంచి వేడుకలకు పిలుపునిచ్చిన మావోయిస్టులు
  • అడవులను జల్లెడపడుతున్న పోలీసులు, సీఆర్ పీఎఫ్, గ్రేహౌండ్స్ బలగాలు
  • దండకారణ్యంలో బేస్ క్యాంపులకు ప్రత్యేక బలగాల తరలింపు

భద్రాచలం, వెలుగు : పీపుల్స్  లిబరేషన్‍  గెరిల్లా ఆర్మీ (పీఎల్‍జీఏ) ఏర్పడి 23 ఏళ్లు అయిన సందర్భంగా వారోత్సవాలు నిర్వహించాలని మావోయిస్టు పార్టీ పిలుపునిచ్చింది. 2000 డిసెంబరు 2న కరీంనగర్  జిల్లా కొయ్యూరు అడవుల్లో జరిగిన ఎన్ కౌంటర్ లో నాటి పీపుల్స్ వార్ సెంట్రల్  కమిటీ సభ్యులు నల్లా ఆదిరెడ్డి, ఎర్రంరెడ్డి సంతోష్​ రెడ్డి, శీలం నరేశ్  అమరులయ్యారు. వారిని స్మరించుకుంటూ పీఎల్‍జీఏను స్థాపించారు. డిసెంబరు 2 అంటే మావోయిస్టులకు చిరస్థాయిలో నిలిచే రోజు. అందుకే పీఎల్‍జీఏను బలోపేతం చేసేందుకు పార్టీ ప్రతీ సంవత్సరం అనేక కార్యక్రమాలు నిర్వహిస్తోంది. సాయుధ దళాలతో పాటు సంప్రదాయ బాణాలు, విల్లంబులు, కత్తులతో కూడిన 38 వేల మంది జన్‍మిలీషియా సభ్యులతో పీఎల్‍జీఏ పార్టీలోని సెంట్రల్  మిలటరీ కమిషన్‍కు అనుసంధానంగా పనిచేస్తోంది. కొత్త సభ్యులతో ఏటా పీఎల్‍జీఏను బలోపేతం చేస్తున్నారు. తెలంగాణ, ఆంధ్రా, ఒడిశా, ఛత్తీస్‍గఢ్  రాష్ట్రాల్లో విస్తరించిన దండకారణ్యం కేంద్రంగా పీఎల్‍జీఏ కార్యకలాపాలు నిర్వహిస్తోంది.

అష్ట దిగ్బంధం చేసిన పోలీసులు

పీఎల్‍జీఏ వారోత్సవాల నేపథ్యంలో మావోయిస్టులు గ్రామగ్రామాన ప్రచారానికి శ్రీకారం చుట్టారు. యువతను పీఎల్‍జీఏలోకి చేర్చుకునేందుకు వారు పల్లెల్లో వినూత్నంగా ప్రచారం చేస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కరపత్రాలు విడుదల చేశారు. అటవీ ప్రాంతాల్లో వాల్ పోస్టర్లు అతికించారు. పోలీసుల కూంబింగ్‍లను దాటుకుని యాక్షన్ టీంలు తెలంగాణ రాష్ట్రంలోకి ప్రవేశించి పీఎల్‍జీఏపై విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నాయి. శబరి-చర్ల ఏరియా కమిటీ కార్యదర్శి అరుణతో పాటు భద్రాద్రి కొత్తగూడెం-, తూర్పు గోదావరి జిల్లాల కార్యదర్శి ఆజాద్  పీఎల్‍జీఏ వారోత్సవాలను విజయవంతం చేయాలని లేఖ విడుదల చేశారు. ఇటీవల చర్ల మండలం పూసుగుప్ప అడవుల్లో ధాన్యం లారీని మావోయిస్టులు దహనం చేశారు. ఇదే మండలంలో చినమిడిసిలేరు ప్రాంతంలో మావోయిస్టులు అమర్చిన మందుపాతరను చర్ల పోలీసులు గుర్తించి దాన్ని శుక్రవారం నిర్వీర్యం చేశారు. దుమ్ముగూడెం మండలానికి చెందిన వ్యాపారులను మావోయిస్టులు ఆపి బేస్​ క్యాంపులకు నిత్యావసర సరుకులు సరఫరా చేయొద్దంటూ హెచ్చరించారు.

దీంతో పోలీసులు గోదావరి తీరంపై డేగకన్ను వేశారు. తెలంగాణ, -ఛత్తీస్​గఢ్​ సరిహద్దుల్లో హెలికాప్టర్లను సిద్ధం చేశారు. ఏరియల్  సర్వే కూడా నిర్వహిస్తున్నారు. అడవిలో సీఆర్‍పీఎఫ్‍, గ్రేహౌండ్స్ బలగాలు కూంబింగ్  ఆపరేషన్లు చేపట్టాయి. నిఘా వర్గాల సమాచారాన్ని క్రోడీకరించుకుని ఆపరేషన్  గ్రీన్‍హంట్‍, ఆపరేషన్ సమాధాన్‍లో భాగంగా దండకారణ్యంలో ఏర్పాటు చేసిన బేస్‌ క్యాంపులకు ప్రత్యేక బలగాలను తరలించారు. ఏ దారిలో వచ్చినా నక్సల్స్ ను ప్రతిఘటించేందుకు వీలుగా దండకారణ్యాన్ని అష్టదిగ్బంధం చేశారు. అలాగే పట్టణాల్లో కూడా లాడ్జీలు, అనుమానిత ప్రాంతాల్లో పోలీసులు సోదాలు నిర్వహిస్తున్నారు. సరిహద్దుల్లో వాహన తనిఖీలు ముమ్మరం చేశారు. వివిధ రాజకీయ పార్టీల నేతలను ఈనెల 8 వరకు బయటకు వెళ్లవద్దంటూ హెచ్చరించారు. ఆర్టీసీ కూడా రాత్రి వేళల్లో తిరిగే బస్సులను రద్దు చేసింది. వాజేడు, వెంకటాపురం, చర్ల, ఆంధ్రాలోని చింతూరు, మోతుగూడెం, సీలేరు, విశాఖ, ఘాట్ రోడ్డులోని రాజమండ్రి, ఛత్తీస్‍గఢ్‍కు వెళ్లే బస్సులను నిలిపివేశారు. పీఎల్‍జీఏ వారోత్సవాలను అడ్డుకునేందుకు పోలీసులు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు.