రూల్స్ బ్రేక్​ చేస్తే యాక్షన్!

రూల్స్ బ్రేక్​ చేస్తే యాక్షన్!
  •     నంబర్ ప్లేట్​ లేకుంటే వెహికల్ సీజ్​ ​ 
  •     బైక్ ​నంబర్ ​ట్యాంపర్ ​చేస్తే ఎఫ్ఐఆర్​
  •     మైనర్లకు వాహనమిస్తే పేరెంట్స్​పై కేసు
  •     ఖమ్మం జిల్లాలో సీరియస్​గా ట్రాఫిక్​ పోలీసుల నజర్​

ఖమ్మం, వెలుగు: జిల్లాలో ట్రాఫిక్​ రూల్స్​ కు విరుద్ధంగా వ్యవహరించే వారిపై పోలీసులు సీరియస్​గా నజర్​ పెట్టారు. డ్రైవింగ్ లైసెన్స్​ లేకపోవడం, వాహనాలకు నంబర్ ప్లేట్ తొలగించడం, నంబర్​ ప్లేట్ లోని నంబర్లను ట్యాంపర్​ చేయడం, కంపెనీ నుంచి వచ్చిన సైలెన్సర్లను తొలగించి ఎక్కువ సౌండ్​ వచ్చే సైలెన్సర్లను బిగించడం వంటి ఉల్లంఘనలను గుర్తించి వారికి జరిమానా విధిస్తున్నారు. కార్లకు బ్లాక్​ ఫిల్మ్​లను తొలగిస్తున్నారు. యూత్​ ఎక్కువగా రాత్రి వేళల్లో ఎక్కువ సౌండ్​ చేస్తూ రోడ్లపై బైక్​లతో చక్కర్లు కొడుతూ న్యూసెన్స్​ చేయడంతోపాటు జనాన్ని ఇబ్బంది పెడుతున్నారన్న ఫిర్యాదులు వస్తుండడంతో ఖమ్మం నగరంలో పోలీసులు తనిఖీలు చేస్తున్నారు.

కంపెనీ నుంచి వచ్చిన సైలెన్సర్ల స్థానంలో వేరేవి బిగిస్తే చర్యలు తీసుకుంటామని బైక్​ మెకానిక్​లను  హెచ్చరించారు. వీటితో పాటు ర్యాష్, ట్రిపుల్, మైనర్​ డ్రైవింగ్, మద్యం తాగి వాహనాలు నడుతుపున్న వారిపైన కఠిన చర్యలు తీసుకుంటున్నారు. మైనర్లకు వాహనాలిస్తే వారి తల్లిదండ్రులపై కూడా కేసులు నమోదు చేస్తామని హెచ్చరిస్తున్నారు.

వాహనదారులు కావాలని చేస్తున్న పనులు.. 

వాహనాలకు నంబర్​ ప్లేట్ లేకపోవడం వల్ల ఏదైనా నేరాలు, రోడ్డు ప్రమాదాలు జరిగిన సమయంలో ఆ వాహనదారులను గుర్తించడం పోలీసులకు కష్టంగా మారుతోంది. చలాన్లు పడకుండా ఉండేందుకు నంబర్​ ట్యాంపర్​ చేయడం, చైన్​ స్నాచింగ్, దొంగతనాలు చేసిన సమయంలో వెహికల్ నంబర్ ప్లేట్లు మారుస్తున్నారు. ఉద్దేశపూర్వకంగా వాహనాల నంబర్​ ట్యాంపర్​ చేయడం, తప్పుడు నంబర్లు వేసుకొని తిరిగే వాళ్లపై ఎఫ్​ఐఆర్​ నమోదు చేసి కోర్టులో డిపాజిట్ చేస్తున్నారు. ఐదు నెలల్లో నంబర్​ ప్లేట్ లేని సుమారు వెయ్యి వాహనాలను పట్టుకొని, జరిమానా లు విధించారు. డివైడర్లు ఉన్న దగ్గర వాహనాలు రాంగ్ రూట్​లో రావడంతో రోడ్డు ప్రమాదాలు జరుగుతుండడంతో, అలాంటి వారిపైనా కేసులు నమోదు చేస్తున్నారు.

స్పెషల్​  డ్రైవ్.. 

ఖమ్మం నగరంలోని వివిధ జంక్షన్లలో శుక్రవారం ట్రాఫిక్ పోలీసులు స్పెషల్​ డ్రైవ్​ నిర్వహించారు. పోలీస్ కమిషనర్ సునీల్ దత్ ఆదేశాల మేరకు నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న 60 టూ వీలర్లను సీజ్​ చేసి జరిమానా విధించారు. లైసెన్స్​ లేకుండా వాహనాలను నడుపుతున్న వారిని, నంబర్​ప్లేట్​లేకుండా తిరుగుతున్న వాహనాలను సీజ్​చేశారు. తర్వాత వారికి కౌన్సిలింగ్ నిర్వహించి నంబర్ ప్లేట్ తీసుకొని వచ్చిన వారికి వాహనాలను తిరిగి అప్పగించారు.

స్టైల్, వెరైటీ, ఫ్యాషన్ పేర్లతో తమ బైక్లకు కంపెనీ ఇచ్చిన సైలెన్సర్లను మార్చి న్యూసెన్స్ క్రియేట్ చేసే వారిపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు ట్రాఫిక్​ ఏసీపీ సాధుల సారంగపాణి తెలిపారు. ఇప్పటి వరకు 110  రాయల్​ ఎన్​ ఫీల్డ్ వాహనాల సైలెన్సర్లను మార్చినట్టు గుర్తించి వాటికి మళ్లీ పాత సైలెన్సర్​ బిగించినట్టు చెప్పారు. ఇటీవల సైలెన్సర్స్ అమ్మే షాపులు, సైలెన్సర్స్ బిగించే మెకానిక్ షాపుల యజమానులకు కౌన్సిలింగ్ నిర్వహించినట్లు చెప్పారు. సైలెన్సర్ల నుంచి వచ్చే శబ్దాలతో తోటి వాహనదారులు, స్థానికులు భయభ్రాంతులకు గురవుతున్నారని, కొన్ని సయయాల్లో కంట్రోల్ తప్పి ప్రమాదాలకు గురవుతున్నారని తెలిపారు. అలాంటి పరిస్థితులను కల్పించే వాహనదారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు.