బీఆర్ఎస్కు వ్యతిరేకంగా కాంగ్రెస్ ప్రచారం.. కార్లను తీసుకెళ్లిన పోలీసులు

బీఆర్ఎస్కు వ్యతిరేకంగా కాంగ్రెస్ ప్రచారం..  కార్లను తీసుకెళ్లిన పోలీసులు

బీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ తయారు చేయించిన ప్రచార రథాల(కార్లు)ను పోలీసులు తీసుకెళ్లారు. హైదరాబాద్​ గాంధీభవన్ ఆవరణలో ఉన్న ప్రచార రథాలను పోలీసులు తీసుకెళ్లారు. దీన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా తప్పుపడుతోంది. పోలీసుల తీరును పీసీసీ వైస్ ప్రెసిడెంట్ చామల కిరణ్ కుమార్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. 

చామల కిరణ్ కుమార్ ఏమన్నారంటే...?

శనివారం రాత్రి 7 గంటల తర్వాత దాదాపు 50 నుంచి 60 మంది పోలీసులు గాంధీభవన్ లోపలికి వచ్చి.. తమ పార్టీ ప్రచార రథాలను తీసుకెళ్లారని తెలంగాణ పీసీసీ వైస్ ప్రెసిడెంట్ చామల కిరణ్ కుమార్ చెప్పారు. తమ పార్టీ బీఆర్ఎస్ వైఫల్యాలు, స్కామ్ లపై మూడు కార్లను తయారు చేయించిందని, వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని కాంగ్రెస్ నిర్ణయించిందని చెప్పారు. కాంగ్రెస్ తయారు చేయించిన మూడు కార్లు ప్రజల్లోకి వెళ్తే.. తమకు ఎక్కడ చెడ్డ పేరు వస్తుందనే భయంతో కేసీఆర్ ప్రభుత్వం పోలీసులపై ఒత్తిడి పెంచి.. వాహనాలను తీసుకెళ్లిందని చెప్పారు.

ఈ విషయంపై రాష్ట్ర ప్రజలందరూ ఆలోచించాలని కోరారు. ఎన్నికల వేళ ప్రచారం చేసుకునే అవకాశం అన్ని పార్టీలకు ఉంటుందన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం ప్రతిపక్షాల పని అని చెప్పారు. రాబోయే రోజుల్లో నియంత ప్రభుత్వానికి ప్రజలే బుద్ది చెబుతారని అన్నారు. ఆదివారం (నవంబర్ 5వ తేదీన) పోలీసు ఉన్నతాధికారులను కలిసి ఈ ఘటనకు సంబంధించిన వాస్తవాలను తెలుసుకుంటామని చెప్పారు. 

తెలంగాణ అసెంబ్లీ ఎలక్షన్స్ దగ్గర పడుతున్న కొద్దీ రాజకీయ పార్టీల ప్రచారాలు మరింత ఊపందుకున్నాయి. పొలిటికల్ పార్టీల మధ్య డైలాగ్ వార్స్ పేలుతున్నాయి. ఒకరిపై మరొకరు మాటల తూటాలు పేల్చుకుంటున్నారు. అంతేకాదు.. సోషల్​ మీడియానూ బాగా ఉపయోగించుకుంటున్నారు. జనాల్లోకి వెళ్లేందుకు, ప్రత్యర్థిని కట్టడి చేసేందుకు వినూత్నంగా ప్రచారం చేస్తున్నారు. తాజాగా కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ ను ఓడించేందుకు వ్యూహాత్మకంగా ముందుకెళ్తోంది. ఇందులో భాగంగానే.. కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా ప్రచారం ఉధృతం చేసింది.

కేసీఆర్ తన హయాంలో అనేక అవినీతి, అక్రమాలకు పాల్పడ్డారంటూ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ శుక్రవారం(నవంబర్ 3వ తేదీన) గాంధీభవన్ లో 'బై బై కేసీఆర్' ప్రచారాన్ని ప్రారంభించింది. ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో అవినీతికి పాల్పడ్డారని ఆరోపిస్తూ కాంగ్రెస్ నాయకులు కారును ప్రత్యేకంగా అలంకరించి దానిపై 'బై-బై కేసీఆర్' అంటూ రాసి ఉంచారు.  

పదేండ్ల అహంకారంపై తిరగబడుదాం 
పదేండ్ల పంక్చర్ ప్రభుత్వాన్ని తరిమికొడదాం

అని కారు వెనుక  భాగంలో రాసి ఉంచారు. అంతేకాదు.. కేసీఆర్ తెలంగాణను ముంచిండు.. 5 లక్షల కోట్లు అప్పును మోపిండు అని రాసి ఉంచారు.