సోషల్​ మీడియాపై పోలీసుల అత్యుత్సాహం

సోషల్​ మీడియాపై పోలీసుల అత్యుత్సాహం
  •    సర్కారుపై ట్రోలింగ్ పెరగడంతో రంగంలోకి ప్రభుత్వ పెద్దలు
  •     పోలీసులతో కంట్రోల్  చేయించే ప్రయత్నం
  •     వ్యతిరేకంగా పోస్టులు పెట్టినవాళ్లతోపాటు అడ్మిన్లపైనా కేసులు

వెలుగు, నెట్​వర్క్ : సోషల్ మీడియాలో బీఆర్ఎస్ సర్కారుపై ట్రోలింగ్​పెరగడంతో ప్రభుత్వం రంగంలోకి దిగింది. సర్కారుకు వ్యతిరేకంగా పోస్టులు పెట్టిన వారితో పాటు అడ్మిన్లపైనా పోలీసులతో ప్రభుత్వం కేసులు నమోదు చేయిస్తున్నది. తనకు వ్యతిరేకంగా పోస్టులు పెట్టకుండా పోలీసులతో కంట్రల్  చేయిస్తున్నది. ఎలక్షన్​ కోడ్​ పేరిట రంగంలోకి దిగిన పోలీసులు గ్రూప్  అడ్మిన్లతో ఊరూరా సమావేశాలు పెడుతున్నారు. ప్రభుత్వాన్ని, అధికార పార్టీ లీడర్లను కించపరుస్తూ పోస్టులు పెడితే కేసులు పెట్టాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు. 

ఇంత వరకు బాగానే ఉన్నా రాష్ట్ర సర్కారు, రూలింగ్​ పార్టీ లీడర్లపై విమర్శలు చేసేవారినే లక్ష్యంగా చేసుకొని బెదిరింపులకు పాల్పడుతున్నారని, మాట వినని వాళ్లపై కేసులు పెడ్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. అలాగే ఎన్నికల కోడ్​ పేరుతో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని, కేవలం రూలింగ్​ పార్టీ నేతలు చేసిన ఫిర్యాదులకే స్పందిస్తున్నారని ప్రతిపక్ష లీడర్లు వాపోతున్నారు. తామిచ్చే  ఫిర్యాదులను బుట్టదాఖలు చేస్తున్నారని మండిపడుతున్నారు. 

హోరెత్తుతున్న ప్రచారం

అసెంబ్లీ ఎన్నికలు దగ్గర సమీపిస్తుండడంతో  రాజకీయ పార్టీలన్నీ సోషల్​ మీడియా వేదికగా ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. ముఖ్యంగా గ్రామాలు, వార్డులు, కులాలవారీగా ఉన్న వాట్సాప్​ గ్రూపుల్లో  ‘సెకనుకో  పోస్టు.. నిమిషానికో  కౌంటర్’ అన్నట్లుగా పార్టీలు, వారి మద్దతుదారులు చెలరేగిపోతున్నారు. తమ పార్టీ సోషల్​ మీడియా వింగ్​ల నుంచి వస్తున్న పోస్టులకు తమ సొంత కామెంట్లను జోడించి జనాల్లోకి వదులుతున్నారు. 

తమ హయాంలో జరిగిన అభివృద్ధి, సంక్షేమం గురించి బీఆర్ఎస్  వాళ్లు​చెప్పుకుంటుంటే.. ప్రభుత్వ వైఫల్యాలను ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీ, బీఎస్పీ, ఇతర పార్టీలు, వాళ్ల మద్దతుదారులు ఎండగడ్తున్నారు. దీంతో ప్రతిపక్షాల ముప్పేట దాడిని తట్టుకోవడం బీఆర్ఎస్  నేతలకు కష్టమవుతున్నది. దీంతో పోలీసులను ప్రభుత్వం రంగంలోకి దింపింది. 

రూలింగ్ ​పార్టీకే సపోర్ట్

 సోషల్​ మీడియాలో అధికార పార్టీ లీడర్లు ప్రతిపక్షాలపై, ప్రతిపక్షాల లీడర్లు అధికార పార్టీ నేతలపై దుమ్మెత్తిపోసుకుంటున్నారు. విమర్శలు, ప్రతివిమర్శలు, ఆరోపణలు, ప్రత్యారోపణలతో హోరెత్తిస్తున్నారు. ఇవి శ్రుతి మించి ఒకరిపై ఒకరు పోలీస్​స్టేషన్లలో ఫిర్యాదులు ఇచ్చుకునేదాకా వెళ్తున్నారు. అయితే, రూలింగ్​పా ర్టీ వాళ్లను కాదని, ప్రతిపక్షాల కార్యకర్తలు, మద్దతుదారులను మాత్రమే పోలీసులు టార్గెట్​ చేస్తున్నారని ఆయా పార్టీల నేతలు ఆరోపిస్తున్నారు. ఇటీవల సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం పెద్ద చీకోడు గ్రామానికి చెందిన ఒక వాట్సాప్  గ్రూపులో సీఎం కేసీఆర్ ను కించపరుస్తూ అనిల్  అనే యువకుడు పోస్టు పెట్టారని గ్రామ బీఆర్ఎస్  కార్యకర్తలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

దీంతో రంగంలోకి దిగిన పోలీసులు.. ఆ పోస్టు చేసిన పున్నం రాజుతో పాటు వాట్సాప్ గ్రూప్  అడ్మిన్  అనిల్ పైనా  కేసు నమోదు చేశారు. అలాగే సూర్యాపేట జిల్లా పెన్ పహాడ్ మండలంలో ఒక సామాజికవర్గానికి చెందిన సోషల్ మీడియా గ్రూపులో మంత్రి జగదీశ్  రెడ్డికి వ్యతిరేకంగా పోస్ట్  చేశారని  పది మందిని పెన్ పహాడ్  పోలీస్ స్టేషన్ కు పిలిపించి రోజంతా స్టేషన్ లోనే ఉంచారు. ఇంకోసారి ఇలాంటి పోస్టులు పెడితే కేసు నమోదు చేస్తామని పోలీసులు హెచ్చరించి పంపారు. ఇదే నియోజకవర్గంలో ఓ బీఆర్ఎస్  నేత ఫిర్యాదుతో నలుగురు వ్యక్తులపై పోలీసులు కేసు పెట్టారు. 

ALSO READ : రూల్స్‌‌‌‌ పాటిస్తూ నామినేషన్‌‌‌‌ వేయాలి : ఇలా త్రిపాఠి

ఇదే విషయంపై తాము ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోవడం లేదని బీజేపీ, కాంగ్రెస్​  నేతలు వాపోతున్నారు. ప్రభుత్వానికి, అధికార పార్టీ లీడర్ల విషయంలో ఒకలా, తమ విషయంలో ఒకలా పోలీసుల తీరు ఉందని ప్రతిపక్ష లీడర్లు మండిపడుతున్నారు. ఎవరు ఫిర్యాదు చేసినా పోలీసులు నిష్పక్షపాతంగా పనిచేయాలని హితవు పలికారు.