V6 News

తమిళనాట బలపడుతున్న త్రిముఖ పోరు.. టీవీకే విజయ్ ‘పవర్ షేరింగ్’ ఫార్ములా వర్కౌట్ అవుతుందా..?

తమిళనాట బలపడుతున్న త్రిముఖ పోరు.. టీవీకే విజయ్ ‘పవర్ షేరింగ్’ ఫార్ములా వర్కౌట్ అవుతుందా..?

గతంలో ఉమ్మడి మద్రాస్ రాష్ట్రంగా పేరుపొందిన తమిళనాడు .. భారతదేశంలో అత్యంత  పురాతన ఎన్నికల చరిత్ర కలిగిన రాష్ట్రాలలో ఒకటి. కలకత్తా, బొంబాయిలతోపాటు  బ్రిటిష్ వారి పాలనా కాలంలో ఎన్నికలు నిర్వహించిన తొలి ప్రాంతాలలో మద్రాస్ రాష్ట్రం కూడా ఒకటి.  ప్రస్తుత  ఆంధ్రప్రదేశ్,  కేరళ, కర్నాటకలోని  కొన్ని ప్రాంతీయ భాగాలు ఒకప్పుడు మద్రాస్ రాష్ట్రంలో కలిసి ఉండేవి.  నిజాం పాలనలో ఉన్న  హైదరాబాద్ వంటి  సంస్థానాల  మాదిరిగా  కాకుండా మద్రాస్  నేరుగా బ్రిటిష్ వారి పాలనలో ఉండేది.  మద్రాస్  రాష్ట్రం స్వాతంత్ర్యానికి ముందే  ఒక విలక్షణమైన రాజకీయ సంస్కృతిని రూపొందించింది. విభిన్న రాజకీయ పార్టీల ఆవిర్భావానికి దారితీసింది.

1967 వరకు మద్రాస్  రాష్ట్రంలో  కాంగ్రెస్  పార్టీ ఆ రాష్ట్ర రాజకీయాలను శాసించింది.  అయితే, 1967 నుంచి  ప్రాంతీయ  ద్రవిడ పార్టీలు పూర్తిస్థాయిలో పట్టు సాధించి అధికారాన్ని చేపట్టాయి.  అప్పటి నుంచి ద్రవిడ మున్నేట్ర కజగం (డీఎంకే),  ఆల్​ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం ( ఏఐఏడీఎంకే ) పార్టీలు తమిళనాడును ఏకరీతిగా ఒకదాని  తర్వాత  ఒకటి  పరిపాలిస్తున్నాయి.

1967 నుంచి 2016 వరకు  తమిళనాడు ముఖ్యమంత్రి పదవిని అధిష్టించినవారి పేర్లను పరిశీలిస్తే.. కరుణానిధి, ఎంజీఆర్, జయలలిత ఈ  ముగ్గురు మాత్రమే ముఖ్యమంత్రులుగా  ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ  క్రమక్రమంగా తన ఆధిపత్య  స్థానాన్ని కోల్పోయింది. దేశ రాజకీయాల్లో చక్రం తిప్పిన కాంగ్రెస్​పార్టీ  నేడు ఈ ద్రవిడ పార్టీలలో ఒకదానికి  మిత్రపక్షంగా మాత్రమే  పనిచేస్తోంది.

ప్రభుత్వంలో మిత్రపక్షాలకు చోటు లేదు
1967 నుంచి తమిళనాడులో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా.. అది మిత్రపక్షాలతో మంత్రి పదవులను పంచుకోవడం చాలా అరుదు.  ఈ  పకడ్బందీ  వ్యూహం  తమిళనాడులో  బలమైన మూడో  రాజకీయ శక్తిని ఎదగకుండా నిరోధించింది.  కేంద్రంలో అధికార బీజేపీ,  ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్​ పార్టీల పరిస్థితి కూడా ద్రవిడ పార్టీల ముంగిట  నామమాత్రంగా ఉన్నాయి.  కాంగ్రెస్  తన  ఓట్ల వాటాను సుమారు 8 శాతం వద్ద కొనసాగిస్తోంది.  మరోవైపు బీజేపీ  క్రమంగా తన ఉనికిని విస్తరిస్తోంది.  తీవ్రమైన పోటీదారుగా మారడానికి సుమారు 15 శాతం  ఓట్లను సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది.  కానీ, ద్రవిడ పార్టీలను అధిగమించి ప్రధాన రాజకీయ పక్షంగా ఎదగడానికి సమయం పట్టవచ్చు.

భాషా రాజకీయాలు తగ్గుముఖం
తమిళనాడులో  తమిళం  వర్సెస్  హిందీ చర్చ ఇప్పటికీ ఉంది.  కానీ,  ఆధునికత, చలనశీలత,  ఆర్థిక మార్పులు భాషా రాజకీయాల తీవ్రతను  తగ్గించాయి. ఉచిత  పథకాలు  కీలకంగా  మారడంతోపాటు  పాలనపై  ప్రజల్లో అంచనాలు పెరిగాయి.  భారీ సంక్షేమ పథకాల కారణంగా తమిళనాడు ‘అన్నీ ఉచితంగా ఇచ్చే రాష్ట్రం’గా  పేరు సంపాదించింది. 

అయినప్పటికీ,  భారీ ఉచిత  పథకాలు  అమలుచేసిన తర్వాత కూడా  అధికార  పార్టీలు సాధారణంగా  ఎన్నికలలో ఓడిపోతున్నాయి, ఇది  ఓటర్లు  సుపరిపాలనను  కూడా  కోరుకుంటున్నారని  రుజువు చేస్తోంది.  2016లో జయలలిత  వరుసగా రెండోసారి  అధికారంలోకి రావడం ఒక మినహాయింపుగా చెప్పాలి. కానీ, అదికూడా  ప్రతిపక్షం అరుదైన రీతిలో చీలిపోయిన సందర్భంలో  జయలలిత  వరుసగా  రెండోసారి అధికారంలోకి  రావడం  జరిగింది.

టీవీకే విజయ్ అరంగేట్రం
తమిళనాడులో  సినీ నటుడు  విజయ్​ నేతృత్వంలో ఆవిర్భవించిన కొత్త పార్టీ టీవీకే  అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.  ఇది  ఓ కొత్త  రాజకీయ  ఆలోచనను  ప్రవేశపెట్టింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే  మిత్రపక్షాలతో అధికారాన్ని పంచుకుంటామని టీవీకే  తెలిపింది. ‘పవర్​ షేరింగ్​’ ఇది సంప్రదాయ డీఎంకే-,  ఏఐఏడీఎంకే ఆధిపత్య శైలిని సవాలు చేసే రాజకీయం. తమిళనాడులో మైనారిటీల రాజకీయాలు తమవంతు పాత్రను పోషిస్తాయి. ముస్లింలు,  క్రైస్తవులు అనేక ప్రాంతాలలో  ఏకీకృత  ఓటు సమూహాలను  ఏర్పరుస్తారు. 

కేంద్ర ప్రభుత్వాలలో కీలక పదవులు
దశాబ్దాలుగా తమిళనాడుకు చెందిన  ద్రవిడ పార్టీలు కేంద్ర ప్రభుత్వాలలో కీలక పదవులను నిర్వహించాయి. అయితే,  2014 తర్వాత  కేంద్ర మంత్రివర్గంలో తమిళనాడు   పరిమిత మంత్రివర్గ ఉనికిని కలిగి ఉంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తమిళనాడులో  వ్యక్తిగతంగా  ప్రజాదరణను పొందారు, ముఖ్యంగా మౌలిక సదుపాయాలు,  అభివృద్ధి  కార్యకలాపాల ద్వారా  ప్రధాని మోదీ  తమిళనాడుతో కనెక్ట్ అవ్వడానికి ప్రయత్నాలు చేశారు. ఈక్రమంలో  పాక్షికంగా విజయం సాధించారు. అయినప్పటికీ,  తమిళనాడులో  బీజేపీ  గ్రోత్​ నెమ్మదిగా కొనసాగుతోంది.  పొత్తులపై  బీజేపీ ఆధారపడుతోంది.

2026 అసెంబ్లీ ఎన్నికల్లో త్రిముఖ పోటీ
2026  అసెంబ్లీ  ఎన్నికలలో డీఎంకే  కూటమి, ఏడీఎంకే-– బీజేపీ కూటమి,  మూడో పక్షమైన విజయ్ టీవీకే పార్టీ మధ్య త్రిముఖ పోటీ జరిగే అవకాశం ఉంది.  డీఎంకే  కూటమి 2021 అసెంబ్లీ ఎన్నికలలో,  2024 పార్లమెంట్ ఎన్నికలలో  భారీ విజయాలు సాధించింది.  కానీ, ఆ తర్వాత తమిళనాడు రాజకీయాల్లో మార్పు వచ్చింది.  అయితే, తమిళనాట త్రిముఖ పోటీ  అధికార డీఎంకేకు ప్రయోజనం చేకూర్చవచ్చు, కానీ,  ప్రభుత్వ వ్యతిరేకత  కూడా గణనీయంగా ఉంది.  చాలా పార్టీలలోని  నాయకులు దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉన్నారు.  అధికార మార్పు కోసం  ప్రజలలో  ఒక భావన ఉంది.  టీవీకే  కచ్చితంగా  జనాలను  ఆకర్షించే శక్తి ఉన్న పార్టీ.

టీవీకే  తన మిత్రపక్షాల కోసం చాలా షరతులు విధించింది, దానివల్ల విజయ్​కి ఏ పెద్ద పార్టీ కూడా మిత్రపక్షంగా లభించదనిపిస్తోంది.  టీవీకే  డీఎంకేకు వ్యతిరేకంగా బలమైన వైఖరిని కలిగి ఉంది.  టీవీకే  బీజేపీ లేకుండా ఏడీఎంకేను మిత్రపక్షంగా కోరుకుంటోంది.  కానీ  ఏడీఎంకే  బీజేపీని వదిలి వెళ్ళలేదు. అందువల్ల, త్రిముఖ పోటీ జరిగే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది. ఏడీఎంకే తన పాత పార్టీ నాయకులందరితో కలిసి పనిచేయడానికి అంగీకరిస్తే,   ఏడీఎంకే,   బీజేపీ మంచి పోటీ ఇవ్వగలవు.  ఏడీఎంకేలో ఐక్యతను తీసుకురావడానికి హోంమంత్రి అమిత్ షా ఒత్తిడి చేస్తారా అనేది చూడాలి.

తమిళనాడు రాజకీయాల్లో నాయకత్వ లోపం
తమిళనాడు ఒకప్పుడు  రాజాజీ,  కె. కామరాజ్,  సి.ఎన్. అన్నాదురై వంటి  మహామహులను అందించింది.  వీరు సరళత,  నిజాయితీలకు ప్రతీకగా జాతీయస్థాయిలో  గుర్తుండిపోయే నాయకులు.  ఆ  తర్వాత  ముఖ్యమంత్రులైన  ఎం.జి. రామచంద్రన్,  కరుణానిధి,  జయలలిత  అత్యంత  ప్రభావశీలురు.  కానీ, వారి వారసత్వం జాతీయ  నాయకులనుగానీ లేదా బలమైన వారసులనుగానీ సృష్టించలేదు.  గతానికి భిన్నంగా నేడు ఏ ప్రధాన తమిళనాడు నాయకుడికీ  జాతీయస్థాయిలో గుర్తింపు లేదు. 2026 అసెంబ్లీ  ఎన్నికలు   సమీపిస్తున్న  తరుణంలో  తమిళనాడు.. సంప్రదాయం, మార్పుల మధ్య ఒక కూడలిలో నిలబడి ఉంది.  

యాదృచ్ఛికంగా  గత  45 సంవత్సరాలుగా  నాయకులు  మారకపోవడమే కాదు.  ఈ  నాయకులందరికీ రాజకీయ వంశాలు,  పదవులు  చేపట్టిన ఆశావహులైన పిల్లలు కూడా ఉన్నారు.  తమిళనాడు  ఫలితాలను  దేశ ప్రజలు చాలా  జాగ్రత్తగా  గమనిస్తారు.  డీఎంకే  అధినేత స్టాలిన్  ఓడిపోతే  అది  ఇండియా  కూటమికి  పెద్ద  ఎదురుదెబ్బ అవుతుంది. అన్నాడిఎంకే  ప్రభుత్వం ఏర్పాటు చేస్తే  బీజేపీకి జాతీయస్థాయిలో ప్రోత్సాహం లభిస్తుంది. స్టాలిన్ కూడా తీవ్రమైన రాజకీయ సవాళ్లను ఎదుర్కొంటారు. ఒకవేళ డీఎంకే  ఓడిపోతే  తమిళనాడు  ఇకపై  ద్రవిడ వాదానికి కట్టుబడి లేదని అర్థం.

ప్రస్తుత రాజకీయ పరిణామ క్రమం
తమిళనాడు రాజకీయాల్లో  రెండు ద్రవిడ పార్టీల ఆధిపత్యం కొనసాగుతోంది. డీఎంకే,  ఏఐఏడీఎంకే  తమిళనాడు రాజకీయాలకు రెండు కీలక  మూలస్తంభాలుగా మారాయి. అయితే,  ఈ రెండు పార్టీలలో  ఏదీ  సాధారణంగా  ప్రతి అసెంబ్లీ  ఎన్నికల్లో  సొంతంగా అధికారాన్ని చేపట్టడానికి  కావాల్సిన మెజారిటీ  సీట్లను  గెలుచుకోవు.   ప్రతి ఎన్నికలో  పొత్తులు  తమిళనాడు  రాజకీయాల్లో  నిర్ణయాత్మక  పాత్ర  పోషిస్తాయి.  డీఎంకే,  ఏఐఏడీఎంకే  మధ్య  చిన్న ఓటు బ్యాంకులుగల  మిత్రపక్షాల కోసం నిరంతర అన్వేషణ జరుగుతుంటుంది.

డా. పెంటపాటి పుల్లారావు, పొలిటికల్ ఎనలిస్ట్