
హైదరాబాద్, వెలుగు : హైదరాబాద్ సిటీ దాటి పోటీ చేయక పోయినా.. మజ్లిస్ పార్టీకి ఈ సారి కష్టకాలమేనని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఓల్డ్ సిటీ పరిధిలోని చార్మినార్, చాంద్రాయణగుట్ట, యాకత్‌పురా, బహదూర్‌పురా, మలక్‌పేట, నాంపల్లి, కార్వాన్ నియోజకవర్గాల్లో మజ్లిస్ గత కొన్నేండ్లుగా గెలుస్తూ వస్తోంది. గతంలో నాలుగు సీట్లకే పరిమితమైన ఆ పార్టీ.. ఏడు సీట్లకు విస్తరించింది. తాజాగా తొమ్మిది సీట్లకు విస్తరించాలని ప్రయత్నిస్తోంది.
గెలిచిన స్థానాలతో పాటు ఈసారి జూబ్లీహిల్స్, రాజేంద్రనగర్ నియోజకవర్గాల్లో తన అభ్యర్థులను బరిలోకి దించింది. అయితే, మజ్లిస్ సీట్లపై కన్నేసి.. మైనార్టీలకు ప్రత్యేక డిక్లరేషన్ ప్రకటించిన కాంగ్రెస్ పార్టీతో పాటు మరో మైనార్టీ పార్టీ నుంచి ఈ సారి గట్టి పోటీ ఎదుర్కొక తప్పదని పొలిటికల్ ఎనలిస్ట్‌లు పేర్కొంటున్నారు. ప్రధానంగా ఇప్పటి వరకు గెలుస్తూ వస్తున్న యాకత్‌పుర, నాంపల్లి, మలక్‌పేట నియోజకవర్గాలతో పాటు ఈ సారి కొత్తగా పోటీ చేస్తున్న జూబ్లీహిల్స్, రాజేంద్రనగర్ నియోజకవర్గాల్లోనూ మజ్లిస్‌కు ప్రతికూల పరిస్థితులు తప్పవని, అక్కడ విజయం అంత వీజీ కాదని స్పష్టమవుతోంది.
పలుచోట్ల బలమైన ప్రత్యర్థులు
ప్రస్తుత ఎంఐఎం సిట్టింగ్ స్థానాలు కార్వాన్, మలక్‌పేటలో కాంగ్రెస్, బీజేపీతో పాటు బీఆర్ఎస్ నుంచీ బలమైన అభ్యర్థులు ఉన్నారు. అక్కడ మైనార్టీ ఓట్లతో పాటు మిగతా పార్టీలకూ పట్టు ఉంది. దీంతో మజ్లిస్ పార్టీ గెలుపు కోసం ఎక్సర్‌సైజ్ ను ఈ సారి మరింత పెంచింది. నాంపల్లిలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నుంచి గట్టి ప్రతిఘటన ఎదురయ్యే అవకాశం ఉంది. దీంతో ఇక్కడ మజ్లిస్ పార్టీ గెలవడం అంత ఈజీ కాదని ఎక్స్‌పర్ట్స్ అంటున్నారు.
యాకత్‌పురలోనూ ఎంబీటీ నుంచి గట్టిపోటీ ఎదురు కానుంది. ఇక కొత్తగా పోటీ చేస్తున్న జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ గట్టి అభ్యర్థిని బరిలోకి దించడంతో అక్కడ ఫలితం ఆశించే పరిస్థితి లేదు. అదే విధంగా రాజేంద్రనగర్‌లో అన్ని పార్టీల అభ్యర్థులు బలమైన వారే కావడంతో మజ్లిస్ నాలుగో స్థానానికి పరిమితమయ్యే అవకాశం లేకపోలేదని ఎక్స్‌పర్ట్స్ అంటున్నరు. ఈ నేపథ్యంలో కొత్తగా పోటీ చేసే సీట్ల మాట ఎటున్నా.. ఇప్పటి వరకు ఉన్న సీట్లను కూడా కాపాడుకోవడం కష్టమేనని తెలుస్తోంది.
కాంగ్రెస్ పై దూకుడు పెంచిన ఎంఐఎం
మజ్లిస్ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి గట్టి పోటీ ఎదురవడం, అదే విధంగా రాష్ట్రంలో తమ మిత్రపక్షమైన బీఆర్‌ఎస్‌కు దీటుగా కాంగ్రెస్ పార్టీ దూకుడు పెంచిన నేపథ్యంలో మజ్లిస్ పార్టీ స్వరం పెంచింది. కాంగ్రెస్‌కు కళ్లెం వేసేందుకు ఆ పార్టీ అధినేత అసుదుద్దీన్ ఒవైసీ కాంగ్రెస్‌ను టార్గెట్ చేస్తూ విమర్శలు చేస్తున్నారు. ఒక వైపు రాహుల్ గాంధీపై, మరోవైపు రేవంత్‌రెడ్డి పై విమర్శలు గుప్పిస్తున్నారు. రాహుల్‌ను దమ్ముంటే తనపై హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో పోటీ చేయాలని సవాల్ విసురుతున్నారు. అదే విధంగా పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిని ఆర్‌ఎస్‌ఎస్ అంటూ టార్గెట్‌చేసి విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో మజ్లిస్ ఉన్న స్థానాలు నిలుపుకుంటుందో.. లేదో.. మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.