ప్రజాస్వామ్యానికి వారసత్వ రాజకీయాలే పెద్ద శత్రువు

ప్రజాస్వామ్యానికి వారసత్వ రాజకీయాలే  పెద్ద శత్రువు

న్యూఢిల్లీ: వారసత్వ రాజకీయాలు ప్రజాస్వామ్యానికి పెద్ద శత్రువుగా మారాయని ప్రధాని మోడీ అన్నారు. స్వామి వివేకానంద జయంతి సందర్భంగా నిర్వహించిన సెకండ్ నేషనల్ యూత్ పార్లమెంట్‌‌లో మోడీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా దేశ రాజకీయాలు, ప్రజాస్వామ్యం, యువత గురించి ఆయన పలు వ్యాఖ్యలు చేశారు. యువత రాజకీయాల్లోకి రావాలని పిలుపునిచ్చారు.

‘వారసత్వ రాజకీయాల్లో దేశానికి ప్రాముఖ్యం తక్కువగా ఇస్తారు. ఎంతసేపూ తాము, తమ కుటుంబీకుల గురించే ఆలోచిస్తారు. ప్రజలు ఇప్పుడు నిజాయితీతో కూడిన రాజకీయాలను ఆదరిస్తున్నారు. కానీ వారసత్వ రాజకీయ మహమ్మారి ఇంకా మనల్ని వీడిపోలేదు. దేశ రాజకీయాల్లో కొత్త రక్తం రావాల్సిన అవసరం ఉంది. యువత పాలిటిక్స్‌‌లో రావాలి. సానుకూల మార్పులు తీసుకురావడానికి ఇదే సరైన తరుణం. కొత్త తరం (యువత) పాలిటిక్స్‌‌లోకి రానంత వరకు వారసత్వ నేతలు రాజకీయాలను భ్రష్టు పట్టించడాన్ని ఆపబోరు. ఇంటి పేర్లు చెప్పి ఎన్నికల్లో గెలవడాన్ని చూస్తున్నాం. కొందరు తమ కుటుంబీకులను కాపాడుకోవడానికి, వాళ్లకు లబ్ధి చేకూర్చడానికే రాజకీయాలు చేస్తున్నారు’ అని మోడీ పేర్కొన్నారు.