ఓట్ల శాతంపై ఎవరి లెక్క వాళ్లదే .. 40 శాతం వచ్చిన పార్టీకే మ్యాజిక్ ఫిగర్ చాన్స్​

ఓట్ల శాతంపై ఎవరి లెక్క వాళ్లదే .. 40 శాతం వచ్చిన పార్టీకే మ్యాజిక్ ఫిగర్ చాన్స్​
  • ఆ మార్క్​ను చేరుకునేందుకు మూడు పార్టీల వ్యూహాలు
  • గత ఎన్నికల ఓట్ల పర్సంటేజీని, ప్రజల మూడ్​ను లెక్క గడ్తూ ముందుకు
  • దళితులు, మైనార్టీలు, మహిళలు, రైతులు, నిరుద్యోగులపై ఫోకస్​
  • కీలకంగా మారనున్న ఆయా వర్గాల ఓట్ల షేర్​

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. బీఆర్​ఎస్​, కాంగ్రెస్​, బీజేపీ మధ్య  ట్రయాంగిల్​ పోరులో.. ఓట్ల పర్సంటేజీ కీలకంగా కనిపిస్తుంది. పైగా హంగ్​ వచ్చే చాన్స్​ ఉందని సర్వేలు చెప్తుండటంతో పార్టీలు దీనిపైనే ఫోకస్​ పెట్టాయి. గతంలో.. ముఖ్యంగా 2018 అసెంబ్లీ ఎన్నికలప్పుడు, ఆ తర్వాత జరిగిన లోక్​సభ ఎన్నికల్లో, అసెంబ్లీ ఉప ఎన్నికల్లో, లోకల్ బాడీ ఎన్నికల్లో వచ్చిన ఓట్ల శాతాన్ని.. ప్రస్తుతం ఉన్న మూడ్​ను  లెక్క గడుతూ, అందుకు తగ్గట్టుగా మూడు ప్రధాన పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. 

రాష్ట్రంలో ఏదైనా ఒక పార్టీకి కనీసం 40 శాతం ఓట్లు వస్తేనే ఎవరి మద్దతు లేకుండానే ఆ పార్టీ అధికారంలోకి  వచ్చే చాన్స్​ ఉంటుంది.  దీంతో  వర్గాలు, కులాలు, ప్రాంతాల వారీగా ఓట్ల పర్సంటేజీపై పార్టీలు లెక్కలు కడుతున్నాయి. సర్వే రిపోర్టులతో పాటు ఎవరి బలం ఎంత ఉందనేదానిపై వివరాలు సేకరిస్తున్నాయి. కొన్నిచోట్ల బలంగా ఉండి ఓటు షేర్​ పెరిగితే కుదరదని.. బలహీనంగా ఉన్న ప్రాంతాల్లోనూ బలం పెంచుకునే విధంగా యాక్టివిటీస్​ పెంచుతున్నాయి. ఓట్ల శాతం పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. 

అప్పటికీ ఇప్పటికీ మారిన మూడ్​

తెలంగాణ ఏర్పడిన తర్వాత ఇప్పటి దాకా రెండు సార్లు అసెంబ్లీ ఎన్నికలు జరగగా.. ఈసారి జరగనున్నవి మూడో ఎన్నికలు.  2018 ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ 46.87శాతం ఓట్లు సాధించింది. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్‌ 28.43 శాతం, బీజేపీకి 6.98 శాతం ఓట్లు పోలయ్యాయి. అయితే ఈసారి పరిస్థితులు మారిపోయాయి. గతంలో బీఆర్​ఎస్​కు గంపగుత్తగా పడిన దళిత, మైనార్టీ ఓట్లు ప్రస్తుత ఎన్నికల్లో భారీగా చీలే అవకాశం ఉందని, టీఎస్​పీఎస్సీ పేపర్ల లీకు వంటి వాటితో నిరుద్యోగులు, యువత అధికార పార్టీపై ఆగ్రహంతో ఉన్నారనే చర్చ పొలిటికల్ సర్కిల్స్​లో జరుగుతున్నది. 

ఈ మూడు వర్గాల ఓట్లు ఇంకోవైపు మళ్లితే తమ ఓట్ల పర్సంటేజీ పడిపోతుందని బీఆర్​ఎస్​ నేతలు కొంత ఆందోళన చెందుతున్నారు. దీన్ని ఏ రకంగా భర్తీ చేసుకోవాలనే దానిపై తర్జనభర్జన పడుతున్నారు. గతంలో కంటే 18 శాతం ఎక్కువ  ఓట్లు సాధించుకుంటే.. అధికారంలోకి రావొచ్చని కాంగ్రెస్​ భావిస్తున్నది. ఆరు గ్యారంటీలతో మహిళలు, రైతులు, దళితులు, యువతను తమ వైపు తిప్పుకునేందుకు ప్రయత్నిస్తున్నది. 

పైగా బీఆర్​ఎస్  బీసీలకు ఇచ్చిన సీట్లు.. అందులో ఏయే వర్గాల వారికి ఇచ్చారు ? ముదిరాజ్​ లకు స్థానం కల్పించకపోవడం వంటి వాటిని ఓటు షేర్​ను పెంచుకునే అస్త్రాలుగా కాంగ్రెస్​ పావులు కదుపుతున్నది. ఇక, 2018 ఎన్నికల్లో రెండు అసెంబ్లీ స్థానాలకే పరిమితమైనప్పటికీ.. ఆ వెంటనే 2019 లోక్​సభ ఎన్నికల్లో ఏకంగా 4 లోక్​సభ స్థానాలను బీజేపీ గెలుచుకుంది. ఆ తర్వాత జరిగిన అసెంబ్లీ ఉప ఎన్నికలు, జీహెచ్​ఎంసీ ఎన్నికల్లో ఓటు షేర్​ను భారీగా  పెంచుకుంది. ఇటీవల ప్రధానమంత్రి మోదీ ఒక్క రోజు తేడాతోనే మహబూబ్​నగర్​లో, నిజామాబాద్​లో సభలు పెట్టడం.. పసుపు రైతుల కల ‘పసుపు బోర్డు’ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించడం, సమ్మక్క–సారక్క పేరిట గిరిజన యూనివర్సిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించడం బీజేపీలో జోష్​ను తెచ్చింది. 

గ్రాఫ్​ కిందికి.. మీదికి..

2014లో జరిగిన ఎన్నికల్లో ఇప్పటి బీఆర్‌ఎస్, అప్పటి టీఆర్‌ఎస్‌ 63 సీట్లు గెలుచుకుంది. ఆ తర్వాత 2019లో సాధారణ అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉండగా.. 2018లో అసెంబ్లీ రద్దు చేసి కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లారు. అప్పుడు 87 సీట్లు గెలుచుకుని మళ్లీ అధికారంలోకి వచ్చారు. 2018లో కాంగ్రెస్, టీడీపీ, తెలంగాణ జనసమితి, సీపీఐ కలిసి ప్రజాకూటమిగా ఏర్పడి 22 స్థానాలు దక్కించుకున్నాయి. ఎంఐఎం 7, ఇండిపెండెంట్లు 2 , బీజేపీ ఒక సీటు మాత్రమే గెలుచుకుంది. 2018లో బీఆర్​ఎస్​కు 46.87 శాతం ఓట్లు వస్తే,లోక్​సభ ఎన్నికల్లో 41.29 శాతం ఓట్లు వచ్చాయి. 

జీహెచ్​ఎంసీ (35.77శాతం), దుబ్బాక, గ్రాడ్యుయేట్స్​ ఎమ్మెల్సీ, హుజూరాబాద్​ బైపోల్స్.. సహా దాదాపు ప్రతి ఎన్నికలో ఓటు పర్సెంటేజీ బీఆర్​ఎస్​కు తగ్గుతూ వచ్చింది. 2018 ఎన్నికల్లో బీజేపీకి 6.98 శాతం ఓట్లు వస్తే.. లోక్​సభ ఎన్నికల్లో 19.45 శాతం వచ్చాయి. జీహెచ్​ఎంసీ (35.57 శాతం), ఉప ఎన్నికల్లో ఓట్ల శాతం  పెరుగుతూ వచ్చింది. కాంగ్రెస్​కు 2018 ఎన్నికల్లో 28.43 శాతం ఓట్లు వస్తే.. లోక్​సభ ఎన్నికల్లో 29.48 శాతం ఓట్లు పోలయ్యాయి. తర్వాత జరిగిన జీహెచ్​ఎంసీ (6.64శాతం), బై పోల్స్​లో ఓట్ల శాతం తగ్గుతూ వచ్చింది. అయితే.. ఇప్పుడు ఎన్నికల్లో మాత్రం మూడు పార్టీలు నువ్వా నేనా అన్నట్లు పోటీ పడుతున్నాయి. గత ఎన్నికల్లో వచ్చిన ఓట్ల శాతాన్ని లెక్కగట్టుకుంటూ.. దాన్ని మరింత పెంచుకొని మ్యాజిక్​ ఫిగర్​ను దాటేందుకు ప్రయత్నిస్తున్నాయి.