ఊరిపేరు మార్పుపై మహారాష్ట్రలో పొలిటికల్ ఫైట్

ఊరిపేరు మార్పుపై మహారాష్ట్రలో పొలిటికల్ ఫైట్

ఔరంగాబాదా..? శంభాజీ నగరా?

మహారాష్ట్రలోని చారిత్రక నగరం ఔరంగాబాద్ పేరు మార్పు ప్రతిపాదన అధికార కూటమిలో కుమ్ములాటలకు తెరతీసింది. మహారాష్ట్ర మరాఠా యుద్ధ వీరుడు ‘ధర్మవీర్’ శంభాజీ మహారాజ్ పేరుతో ‘శంభాజీ నగర్’గా మార్చాలని శివసేన భావిస్తోంది. దాదాపు మూడు దశాబ్ధాలుగా తమ ఎజెండాలో భాగంగా ఉన్న ఔరంగాబాద్ పేరు మార్పు విషయంలో శివసేన ముందుకు వెళ్లేందుకు చూస్తోంది. అయితే రాష్ట్ర ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న కాంగ్రెస్ దీనిని ప్రతిఘటిస్తోంది. మరో భాగస్వామ్య పక్షం ఎన్సీపీ మాత్రం ఈ విషయంపై సైలెంట్​గా ఉంది.

హిందూ జాతీయవాద పార్టీగా 1966లో శివసేన ఆవిర్భవించింది. మొదట్లో ముంబైకే పరిమితమైన ఈ పార్టీ.. 1980వ దశకంలో తన రాజకీయ పరిధిని విస్తరించుకొంటూ మహారాష్ట్రలో బలమైన శక్తిగా ఎదిగింది. 1988 ఎన్నికల్లో ఔరంగాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో విజయం సాధించింది. ఆ ఏడాది మే 8న జరిగిన విజయోత్సవ ర్యాలీలో పాల్గొన్న శివసేన వ్యవస్థాపకుడు బాలాసాహెబ్ థాక్రే.. ఈ సిటీ పేరును ‘శంభాజీ నగర్’గా మారుస్తున్నట్లు ప్రకటించారు.  అప్పటి నుంచి ఈ అంశం రాజకీయంగా వేడి పుట్టిస్తోంది. 1995లో ఈ నగరం పేరును శంభాజీ నగర్​గా మారుస్తూ కౌన్సిల్ తీర్మానం  చేసింది. దీనిపై ప్రజాభిప్రాయం కోరుతూ  శివసేన–  బీజేపీ ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది. ఇటీవల మరోసారి శివసేన ఆ విషయాన్ని తెరపైకి తేవడంతో రాజకీయ రగడ మొదలైంది. ఆ పార్టీతో పొత్తులో ఉన్న కాంగ్రెస్ ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తుండడంతో కూటమి ప్రభుత్వంలో వివాదాలు మొదలయ్యాయి.

మొదటి నుంచీ కాంగ్రెస్ వ్యతిరేకమే

ఔరంగాబాద్ పేరు మార్పును కాంగ్రెస్ మొదటి నుంచీ వ్యతిరేకిస్తోంది. 1995లో కౌన్సిల్ తీసుకున్న నిర్ణయంపై నాటి కాంగ్రెస్ కార్పొరేటర్ ముస్తాక్ అహ్మద్ హైకోర్టులో సవాల్ చేశారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం పేరు మార్పు ప్రతిపాదనపై ఎటువంటి నిర్ణయం తీసుకోలేదన్న కారణంతో కోర్టు ఆ పిటిషన్​ను కొట్టేసింది. ప్రస్తుతం ఎన్సీపీలో ఉన్న ముస్తాక్ ఆ తర్వాత సుప్రీంకు వెళ్లారు. ఔరంగాబాద్ పేరు మార్పు తీర్మానంపై స్టే తెచ్చారు. 1999లో మహారాష్ట్రలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్–ఎన్సీపీ ప్రభుత్వం సిటీ పేరు మార్పు కమిటీ రద్దుతోపాటు ప్రతిపాదనలనే వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించింది. ఔరంగాబాద్ పేరును మార్చే ప్రతిపాదనను తమ పార్టీ వ్యతిరేకిస్తుందని మహారాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ బాలాసాహెబ్ థోరట్ ఇటీవలే స్పష్టం చేశారు. శివసేన–ఎన్సీపీ–కాంగ్రెస్ కూటమి ప్రభుత్వం ఏర్పడే సమయంలో చేసుకున్న తమ కామన్ మినిమమ్ ప్రోగ్రామ్​లో ఈ ప్రతిపాదన లేదన్నారు. పేర్ల మార్పుపై తమ పార్టీకి నమ్మకం లేదని, దీని వల్ల సామాన్య ప్రజలకు ఎటువంటి ఉపయోగం లేదని, పేరు మార్చేస్తే అభివృద్ధి జరిగిపోదని అన్నారు.

చర్చలతో సాధ్యమని నమ్ముతున్న శివసేన

శివసేన పార్టీ మాత్రం ఔరంగాబాద్ పేరు మార్పుపై వెనక్కి వెళ్లేది లేదంటోంది. ఈ విషయంలో మహా వికాస్ అఘాడీ కూటమిలోని పార్టీల మధ్య ఎటువంటి చీలిక లేదని, కలసి కూర్చొని చర్చల ద్వారా దీన్ని పరిష్కరించుకుంటామని చెబుతోంది. దీనిపై శివసేన సీనియర్ నేత, రాజ్యసభ ఎంపీ సంజయ్ రౌత్ మాట్లాడుతూ ‘ఈ సిటీ పేరు మార్పు డిమాండ్​ను బాలాసాహెబ్ థాక్రే చేశారు. ఔరంగాబాద్ పేరును ఆయన శంభాజీనగర్​గా మార్చారు. దీనికి సంబంధించి ఇక పేపర్ వర్క్ మాత్రమే మిగిలి ఉంది’ అని ప్రకటించారు. ఇంకోవైపు పేరు మార్పును వ్యతిరేకిస్తున్న కాంగ్రెస్​కు వ్యతిరేకంగా మరాఠా కమ్యూనిటీకి చెందిన వ్యక్తులు ఔరంగాబాద్​లో ఆందోళన చేపట్టారు. పేరు మార్చడంపై కాంగ్రెస్ వ్యతిరేకత కొత్తది కాదని, దీనిపై సంకీర్ణ ప్రభుత్వంలో విభేదాలు ఉన్నాయని బీజేపీ ఎత్తి చూపుతోంది. ‘ఈ నగరం పేరు మార్చడం మాకు రాజకీయ అంశం కాదు. విశ్వాసానికి సంబంధించినది. ఈ విషయమై శివసేన – కాంగ్రెస్ మధ్య నెలకొన్న వివాదంతో మాకు సంబంధం లేదు. బాలాసాహెబ్ చేసిన ఈ డిమాండ్​కు మద్దతుగా నిలబడాల్సిన బాధ్యత శివసేనదే’ అని ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు చంద్రకాంత్ పాటిల్ స్పష్టం చేశారు.

పట్టు నిలుపుకోవడం కోసం..

2011 జనాభా లెక్కల సేకరణ ప్రకారం 11.75 లక్షల మంది జనాభా ఉన్న ఔరంగాబాద్​లో 51 శాతం మంది హిందువులు, 31.8 శాతం మంది ముస్లింలు ఉన్నారు. 2019 లోక్ సభ ఎన్నికలలో గతంలో నాలుగు సార్లు గెలుపొందిన శివసేన అభ్యర్థి చంద్రకాంత్ ఖైరేను ఓడించి ఎంఐఎం అభ్యర్థి ఇంతియాజ్ జలీల్ గెలుపొందారు. దీంతో ఈ ప్రాంతంపై తమ పట్టు నిలుపుకోవడం కోసం సిటీ పేరు మార్చడం శివసేనకు సవాల్​గా మారింది. ఇటీవల జరిగిన శాసన మండలి, స్థానిక సంస్థల ఎన్నికల్లో చెప్పుకోదగిన ఫలితాలు సాధించలేకపోయిన బీజేపీ ఈ అంశంపై అధికార కూటమిని ఇరకాటంలో పెట్టేందుకు ప్రయత్నం చేస్తోంది. అధికారం కోసం కాంగ్రెస్, ఎన్సీపీలతో చేతులు కలిపిన శివసేన తన హిందూ జాతీయవాదానికి నీళ్లొదిలేసిందని విమర్శలు చేస్తోంది.

ఎవరి ఈక్వేషన్లు వారివి..

ఔరంగాబాద్ పేరు మార్పుకోసం బీజేపీ సైతం గట్టిగా పట్టుబట్టలేకపోతోంది. బీజేపీ మిత్ర పక్షమైన రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియాకు ఈ సిటీలో  ముస్లింలు, దళితుల మద్దతు బలంగా ఉంది. దీంతో పేరు మార్పును ఆ పార్టీ వ్యతిరేకిస్తోంది. అందుకే ఔరంగాబాద్ ఎయిర్​పోర్టుకు ‘శంభాజీ మహారాజ్’ పేరు పెట్టాలని కోరుతూ గత ఏడాది మార్చిలోనే మహారాష్ట్ర కేబినెట్ సిఫార్స్ చేసినా ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం నుంచి స్పందన లేదు. అయితే ప్రస్తుత వివాదం ద్వారా శివసేన హిందూత్వ నినాదం బలహీనమైనదిగా ప్రొజెక్ట్ చేయాలన్నదే బీజేపీ లక్ష్యం. మరోవైపు ఈ సిటీ పేరు మారిస్తే ఇప్పటికే ముస్లిం ఓటర్లలో చీలిక తీసుకు వస్తున్న ఎంఐఎం ఇంకా తన బలాన్ని పెంచుకుంటుందని కాంగ్రెస్ భయపడుతోంది. ఇక శివసేన, కాంగ్రెస్ మధ్య ఎంతగా దూరం పెరిగితే కూటమి ప్రభుత్వంపై తమ పట్టు అంతగా పెరుగుతుందని ఎన్సీపీ భావిస్తోంది. అందుకే ఈ విషయంపై ఎటువంటి సీరియస్ కామెంట్లు చేసేందుకు ఎన్సీపీ సిద్ధంగా లేదు.

ఇదీ చారిత్రక నేపథ్యం

నిజాం షాహీ రాజవంశస్తుడైన మాలిక్ అంబర్ 1610లో నిర్మించిన నగరం కాల గమనంలో ఔరంగాబాద్​గా మారింది. మాలిక్ తర్వాతి కాలంలో మొఘల్ రాజు  ఔరంగజేబు ఈ నగరాన్ని రాజధానిగా చేసుకొని పాలించాడు. అతడి పేరు మీదనే ఈ సిటీకి ఆ పేరు వచ్చిందని చరిత్ర చెబుతోంది. అయితే ఛత్రపతి శివాజీ మహారాజ్ తర్వాత మరాఠా సామ్రాజ్యాన్ని పాలించిన ఆయన పెద్ద కుమారుడు శంభాజీ మహారాజ్ అమరుడైనది ఇక్కడే కాబట్టి ఆయన పేరు పెట్టాలని శివసేన ఎప్పటి నుంచో పోరాడుతోంది. తిరుగులేని యుద్ధ వీరుడిగా పేరున్న శంభాజీని ఔరంగజేబు కుట్రలతో మట్టుబెట్టాడు. సంగమేశ్వరం దగ్గర జరిగిన యుద్ధంలో శంభాజీని కుతంత్రాలతో బంధించాడు. ఆ తర్వాత ఔరంగాబాద్ తీసుకెళ్లి జైలులో పెట్టాడు. మరాఠా సామ్రాజ్యాన్ని తనకు అప్పగించి, ఇస్లాంలో చేరితే వదిలేస్తానని చెప్పాడు. తను ప్రాణాలతో ఉండగా అది జరగని పని అంటూ శంభాజీ శివుడిని కీర్తించాడు. దీంతో ఆయనను 40 రోజుల పాటు చిత్ర హింసలు పెట్టి దారుణంగా చంపాడు. ఎంత హింసించినా శంభాజీ తాను నమ్మిన ధర్మం కోసం వీరుడిలా నిలిచాడు. ఈ చారిత్రక నేపథ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఔరంగాబాద్ పేరు మార్చాలని శివసేన దాదాపు మూడు దశాబ్దాలుగా ప్రయత్నిస్తోంది.-చలసాని నరేంద్ర, సీనియర్ జర్నలిస్ట్.

ఇవీ చదవండి..

పతంగులు ఎందుకు ఎగరేస్తరో తెలుసా?

జాక్‌మా కంపెనీలను జాతీయం చేసే యోచనలో చైనా

సంక్రాంతి వేడుకంతా రైతుదే