ఇందూరులో హోరాహోరీ?

ఇందూరులో హోరాహోరీ?
 • హ్యాట్రిక్ ​ఆశల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు
 • ఈసారి చాన్స్​ ఇచ్చేది లేదంటున్న ప్రతిపక్షాలు
 • ఆర్మూర్​ అసెంబ్లీ వైపు ఎంపీ అర్వింద్ చూపు
 • హామీలుగానే పసుపు బోర్డు, చెరుకు ఫ్యాక్టరీ, సీడ్ సెంటర్
 • అన్ని పార్టీల్లోనూ అంతర్గత పోరు 

నిజామాబాద్, వెలుగు: ముందస్తు ఎన్నికల ప్రచారంతో నిజామాబాద్​ జిల్లాలో  పొలిటికల్ హీట్ పెరిగింది. సిట్టింగ్​ఎమ్మెల్యేలు మూడోసారి కూడా విజయం సాధించి హ్యాట్రిక్​ కొట్టాలని చూస్తుంటే.. ఈసారి చాన్స్​ ఇచ్చేదే లేదని ప్రతిపక్షాలు ధీమాగా చెప్తున్నాయి. జిల్లాలో నిజామాబాద్ అర్బన్, రూరల్, బోధన్, ఆర్మూర్, బాల్కొండ  అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. 2014, 2019 రెండు ఎన్నికల్లోనూ ఐదు స్థానాల్లో బీఆర్ఎస్​ విజయం సాధించింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో పెద్దగా ప్రభావం చూపలేకపోయిన బీజేపీ 2019 మేలో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో   నిజామాబాద్​ ఎంపీ స్థానాన్ని గెలుచుకుంది. అర్వింద్​ చేతిలో ఏకంగా  సీఎం కేసీఆర్​ కూతురు కవిత ఓడిపోవడం సంచలనం సృష్టించింది. ఇదే ఊపుతో ఉమ్మడి నిజామాబాద్​ జిల్లాపై ఫోకస్​ పెట్టిన బీజేపీ ఈ నాలుగేండ్లలో అనూహ్యరీతిలో బలం పుంజుకుంది.  నాలుగేండ్లుగా ఇందూరు రాజకీయాలు కవిత వర్సెస్​ అర్వింద్​ అన్నట్లు సాగుతుండగా,  రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో మెజార్టీ అసెంబ్లీ స్థానాలు కైవసం చేసుకోవాలనే లక్ష్యంతో  ఈ ఇద్దరు లీడర్లు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక టీపీసీసీ లో కీలకంగా ఉన్న  ఇద్దరు నేతలు మధు యాష్కీ, మహేశ్ గౌడ్, మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి జిల్లాలో పార్టీకి పూర్వ వైభవం కోసం కార్యాచరణ  రెడీ చేస్తున్నారు.

ప్రతిపక్షాల నుంచి గట్టి పోటీ

ఎన్నికల్లో బీఆర్ఎస్​కు గట్టిపోటీ ఇచ్చేందుకు ప్రతిపక్షాలు రెడీ అయ్యాయి. ఎన్నికల్లో సీఎం కేసీఆర్​ జిల్లాకు ఇచ్చిన  హామీలను   ప్రతిపక్షాలు తమ అస్త్రాలుగా మలుచుకుంటున్నాయి.   100 రోజుల్లో  నిజాం షుగర్ ఫ్యాక్టరీ పునరుద్ధరణ , రైతులకు మద్దతు ధర , పంటల నష్టపరిహారం చెల్లింపుల్లో  జాప్యం  వల్ల రైతులు  అసంతృప్తితో ఉన్నారు. ఈ ఆంశాల మీద   బీజేపీ, కాంగ్రెస్ ఫోకస్​ పెడుతున్నాయి. తెలంగాణ ఉద్యమకారులకు పార్టీలో, పదవుల్లో స్థానం కల్పించి  అసంతృప్తిని చల్లార్చాలని  గులాబీ లీడర్లు ప్రయత్నిస్తున్నారు. ఇక బీఆర్​ఎస్​లోకి వెళ్లిన నేతలను వెనక్కు తీసుకొచ్చేందుకు ‘ఘర్ వాపసీ’ దిశగా కాంగ్రెస్ అడుగులు వేస్తోంది.  ‘పల్లె గోస.. బీజేపీ భరోసా’ పేరుతో బీజేపీ లీడర్లు ప్రజల్లోకి వెళ్తున్నారు. బాల్కొండ అసెంబ్లీలో 7 మండలాల్లో బీజేపీ నేత డాక్టర్ మల్లికార్జున్ రెడ్డి 15 రోజులపాటు 222 కి.మీ. ‘జనంతో బీజేపీ’ పేరిట పాదయాత్ర చేశారు.  నిజామాబాద్ అర్బన్ లో ప్రజా సమస్యలపై ధన్ పాల్ సూర్యనారాయణ చురుగ్గా పోరాడుతున్నారు.

అర్బన్ లో బిసీ మంత్రం

అర్బన్ నియోజకవర్గంలో  మున్నూరు కాపు, పద్మశాలి, ముస్లిం మైనార్టీల ప్రాబల్యం ఎక్కువగా ఉంది. రెండుసార్లు ఆర్యవైశ్య సామాజిక వర్గానికి చెందిన గణేశ్ గుప్త గెలిచారు. ఒకే  సామాజికవర్గానికి ప్రాధాన్యత ఇస్తున్నారని పార్టీ శ్రేణులు ఆయనపై  అసంతృప్తితో  ఉన్నాయి. ఈసారి బీసీలకు అవకాశం ఇవ్వాలంటూ  బిసీ సంఘాలు కార్యాచరణ చేపట్టాయి. మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత పోటీకి ఆసక్తి చూపుతున్నారు. ఏ పార్టీ  టికెట్ తోనైనా ఇక్కడే పోటీ చేయాలని ఆమె ప్రయత్నిస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది.  సీఎం కూతురు, ఎమ్మెల్సీ కవిత ఈసారి ఎమ్మెల్యేగా పోటీ చేస్తారని అంటున్నారు.   బీజేపీ నుంచి ధన్ పాల్ సూర్యనారాయణ, మాజీ ఎమ్మెల్యే యెండెల లక్ష్మీనారాయణ, బీజేపీ జిల్లా ప్రెసిడెంట్ బస్వా లక్ష్మీనర్సయ్య టికెట్ కోసం ప్రయత్నిస్తున్నారు.  కాంగ్రెస్ నుంచి మహేశ్ గౌడ్, తాహెర్ బిన్ హందాన్, అర్బన్ ప్రెసిడెంట్ కేశ వేణు, పద్మశాలి సామాజిక వర్గానికి చెందిన మాజీ విప్ అనిల్ పార్టీ టికెట్ ఆశిస్తున్నారు. 

సిట్టింగ్​ ఎమ్మెల్యే స్థానం మారతారా?

నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్  ఈసారి పోటీ నుంచి తప్పుకుని.. తన కొడుకు జగన్​కు అవకాశం ఇవ్వాలని భావించారు.  ఈ ప్రపోజల్​ను  హైకమాండ్ ​తిరస్కరించిందని తెలుస్తోంది.  దీంతో ఆయనే మళ్లీ పోటీకి  రెడీ అవుతున్నారు. 1999లో  ఆర్మూర్ నుంచి,  2004లో   బాన్స్ వాడ నుంచి,  2014, 2018 లో నిజామాబాద్​ రూరల్ నుంచి  గెలిచారు. ఈ సారి కూడా ఆయన నియోజకవర్గాన్ని మార్చుకోవాలని భావిస్తున్నట్టు ప్రచారంలో ఉంది.   బీఆర్ఎస్​ నుంచి మాజీ ఎమ్మెల్సీ అరికెల నర్సారెడ్డి, మాజీ ఎంపీ కేశ్ పల్లి గంగారెడ్డి మనువరాలు కావ్య రెడ్డి టికెట్ ఆశిస్తున్నారు. కాంగ్రెస్ నుంచి మాజీ ఎమ్మెల్సీ భూపతి రెడ్డి, నగేశ్ రెడ్డి, బాడ్సి శేఖర్ గౌడ్ టికెట్ కోసం ప్రయత్నిస్తున్నారు. బీజేపీ నుంచి దినేశ్,  ఎంపీపీ గద్దె భూమన్న టికెట్​ఆశిస్తున్నారు. మున్నూరు కాపు సామాజికవర్గం ప్రభావం ఉన్న రూరల్ లో పోటీ చేసేందుకు మాజీ ఎమ్మెల్యే యెండెల లక్ష్మీ నారాయణ కూడా ఆసక్తి కనబరుస్తున్నారు. 

ఆర్మూర్​లో పొలిటికల్​ హీట్​

నిజామాబాద్ సిట్టింగ్ ఎంపీ ధర్మపురి అర్వింద్ ఆర్మూర్ అసెంబ్లీ స్థానంలో పోటీకి సై అనడంతో ఆర్మూర్ లో పొలిటికల్ హీట్ పెరిగింది. ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, జడ్పీ చైర్మన్​ మధ్య వర్గపోరు నడుస్తోంది. గులాబీ పార్టీ నుంచి జడ్పీ చైర్మన్ విఠల్ రావు టికెట్ కోసం ప్రయత్నిస్తున్నారు. ఎంపీ అర్వింద్ పోటీ అంశం బీజేపీ హైకమాండ్​నిర్ణయంపై ఆధారపడి ఉంది. బీజేపీ నుంచి వినయ్ రెడ్డి, అల్జాపూర్ శ్రీనివాస్, పల్లె గంగారెడ్డి టికెట్ కోసం ప్రయత్నిస్తున్నారు.  గత ఎన్నికల్లో 20 వేల ఓట్లు సాధించిన తనకే చాన్స్ ఇస్తారనే ధీమాతో వినయ్ రెడ్డి ఉన్నారు. కాంగ్రెస్ నుంచి మాజీ మంత్రి సంతోష్ రెడ్డి కొడుకు  శ్రీనివాస్ రెడ్డి, మహేశ్ గౌడ్, బీఎస్పీ నుంచి  మహతి రమేష్ టికెట్ ఆశిస్తున్నారు.  ఈ స్థానంలో  మున్నూరుకాపు,   గురడి కాపు ఓటర్లే కీలకం.  పసుపు, ఎర్రజొన్న, మొక్కజొన్న రైతులు ఎన్నికల్లో కీ రోల్​  పోషిస్తారు. 

బోధన్ బీఆర్ఎస్​లో వర్గపోరు

నిజాం షుగర్ ఫ్యాక్టరీ తెరవకపోవడంతో స్థానికులు అసంతృప్తితో ఉన్నారు. బోధన్​ అభివృద్ధిని నిర్లక్ష్యం చేస్తున్నారన్న అభిప్రాయం సైతం ప్రజల్లో ఉంది. ఇటీవల ​ఎమ్మెల్యే షకీల్ ఆమేర్ ‘మన ఊరు మన ఎమ్మెల్యే’ పాదయాత్రలో గ్రామాల్లో ఆయనను పలుచోట్ల నిలదీశారు.  బీఆర్​ఎస్​ నుంచి  మున్సిపల్ చైర్ పర్సన్ భర్త శరత్ రెడ్డి, మల్కాజ్ గిరి ఎమ్మెల్యే అల్వాల్ హన్మంత్ రావు కొడుకు టికెట్  కోసం ప్రయత్నిస్తున్నారు. గత ఎన్నికల్లో తక్కువ ఓట్ల తేడాతో ఓడిపోయిన సుదర్శన్ రెడ్డి కాంగ్రెస్ నుంచి పోటీకి సిద్ధమయ్యారు. కెప్టెన్​ కరుణాకర్​ రెడ్డి సైతం టికెట్​ కోసం ప్రయత్నిస్తున్నారు. బీజేపీ నుంచి రైస్ మిల్లర్ల సంఘం ఆలిండియా ప్రధాన కార్యదర్శి మోహన్ రెడ్డి, సీనియర్ నేత మేడపాటి ప్రకాశ్ రెడ్డి టికెట్​ఆశిస్తున్నారు.  

పట్టుకోసం విపక్షాల ప్రయత్నం

బాల్కొండ ఎమ్మెల్యే, మంత్రి ప్రశాంత్ రెడ్డికి సీఎం కేసీఆర్ కుటుంబంతో ఉన్న సాన్నిహిత్యం అదనపు బలంగా మారింది.   అయితే రెండో స్థాయి నాయకత్వం ఎదగకుండా చేశారన్న  అసంతృప్తి పార్టీలో  ఉంది. కాంగ్రెస్ నుంచి రెండుసార్లు ఓడిన అనిల్, కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రెసిడెంట్ మానాల మోహన్ రెడ్డి టికెట్ కోసం ప్రయత్నిస్తున్నారు. బీజేపీ లీడర్, మాజీ మంత్రి మహిపాల్​ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే అన్నపూర్ణల కొడుకు  డాక్టర్  మల్లికార్జున్ రెడ్డి  ఆర్మూరు నుంచి అవకాశం లేకుంటే బాల్కొండ నుంచి పోటీకి ఆసక్తి చూపుతున్నారు. వారి కుటుంబానికి రెండుచోట్ల బలం ఉంది. బీజేపీ నుంచి పెద్దోళ్ల గంగారెడ్డి, రుయ్యాడి రాజేశ్వర్ రావు, బీఎస్పీ మాజీ లీడర్ సునీల్ రెడ్డి టికెట్ కోసం ప్రయత్నిస్తున్నారు. 

నిజామాబాద్ ​అర్బన్​ఎమ్మెల్యే గణేశ్​గుప్త 

అనుకూల అంశాలు 

 • వివాదాలకు దూరంగా ఉండడం
 • ప్రధాన పార్టీల నేతలతోనూ  సన్నిహిత సంబంధాలు

ప్రతికూల అంశాలు 

 • ఆర్యవైశ్య సామాజికవర్గానికే ప్రాధాన్యత ఇస్తున్నారని పార్టీలో  అసంతృప్తి  
 • ఉద్యమకారులను పట్టించుకోవడం లేదని సీనియర్ల గుస్సా
 • అండర్ డ్రైనేజ్ కంప్లీట్ చేయలేదని అర్బన్ ఓటర్ల నిరసన
 • డబుల్ బెడ్ రూం ఇండ్లు కంప్లీట్ అయినా పంపిణీ చేయకపోవడం
 • పూర్తికాని రఘునాథ చెరువు సుందరీకరణ పనులు
 • వివాదాస్పదంగా మారిన మాస్టర్ ప్లాన్ 

ఆర్మూర్​ఎమ్మెల్యే జీవన్​రెడ్డి 

అనుకూల అంశాలు  

 • బీజేపీలో వర్గపోరు, కాంగ్రెస్ కు నాయకత్వ లేమి
 • ప్రభుత్వ సంక్షేమ పథకాలు కలిసి వస్తాయనే ఆశ

ప్రతికూల అంశాలు  

 • బీఆర్ఎస్​లో వర్గపోరు
 • పసుపు బోర్డు విషయంలో రాష్ట్రప్రభుత్వ వైఫల్యం 
 • పంటలకు దక్కని  మద్దతు ధర
 • ఎమ్మెల్యే అనుచరుల ఆగడాలు, భూ కబ్జా ఆరోపణలు 
 • సోషల్ మీడియాలో ఎమ్మెల్యేపై పోస్ట్ లు చేసినవారిపై  కేసులు 
 • 2014 లో ఎమ్మెల్యేపై కేసు వేసిన ఇద్దరు దళిత యువకులు యాక్సిడెంట్ లో చనిపోవడం

బోధన్​ ఎమ్మెల్యే షకీల్ ఆమేర్ 

అనుకూల అంశాలు 

 • మైనార్టీల ఓట్ బ్యాంక్ 
 • మనఊరు–మన ఎమ్మెల్యే పేరుతో డోర్ టు డోర్ పాదయాత్ర 

ప్రతికూల అంశాలు                                                                                           

 • అసెంబ్లీ సెగ్మెంట్ లో అందుబాటులో ఉండరనే అపవాదు
 • బోధన్ పట్టణ అభివృద్ధిని నిర్లక్ష్యం చేస్తున్నారనే ఆరోపణలు  
 • బోధన్ షుగర్ ఫ్యాక్టరీ పునరుద్ధరణ హామీ నెరవేర్చకపోవడం
 • అమలుకు నోచుకోని అండర్ డ్రైనేజ్ వర్క్స్
 • ఇసుక, ఇతర అక్రమ దందాల్లో ఎమ్మెల్యే అనుచరుల ఆగడాలు         

బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్​రెడ్డి

అనుకూల అంశాలు  

 • నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండడం
 • ప్రతిపక్ష పార్టీల్లో వర్గపోరు

ప్రతికూల అంశాలు

 • అభివృద్ధి పనుల్లో అవినీతి ఆరోపణలు 
 • సెకండ్ క్యాడర్ ను ఎదగనివ్వలేదని అసంతృప్తి 
 • ప్రజాదరణ ఉన్న ఎంపీ సురేశ్ రెడ్డిని దూరంగా ఉంచడం
 • సొంతూరులో డబుల్ బెడ్ ఇండ్ల కేటాయింపుల్లో అవినీతి ఆరోపణలు

నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్

అనుకూల అంశాలు 

 • ప్రతిపక్షాల్లో వర్గపోరు 
 • మున్నూరు కాపు సామాజిక వర్గం నేత కావడం, ఆ ఓటర్లే ఎక్కువగా ఉండడం 

ప్రతికూల అంశాలు

 • కాళేశ్వరం 21,22 ప్యాకేజీ పనులపై 
 • 11 గ్రామాల్లో వ్యతిరేకత
 • పరిష్కారానికి నోచుకోని పోడు భూముల సమస్య
 • బీబీపూర్ తండా మినహా ఎక్కడా డబుల్ ఇండ్లు పంపిణీ చేయకపోవడం
 • కాళేశ్వరం పైప్ లైన్ ఏర్పాటుకు సంబంధించి రైతులకు నష్టపరిహారం చెల్లించడంలో జాప్యం 

నిజామాబాద్ జిల్లా సమాచారం

జిల్లా జనాభా: 17,03,302 
పోలింగ్ కేంద్రాలు:1,509
మొత్తం ఓటర్లు:12,99,484
పురుషులు:6,14,988
మహిళలు:6,84,461
ఇతరులు:35