జగిత్యాల జిల్లాలో పెరిగిన పొలిటికల్​ హీట్​

జగిత్యాల జిల్లాలో పెరిగిన పొలిటికల్​ హీట్​

జగిత్యాల, వెలుగు: జగిత్యాల జిల్లాలో బీఆర్ఎస్​ఎమ్మెల్యేలు ఇంట, బయట వ్యతిరేకత ఎదుర్కొంటున్నారు. మంత్రి కొప్పుల ఈశ్వర్​గ్రాఫ్​ పడిపోయినట్లు సర్వేల్లో తేలడంతో ఈసారి ఆయనకు టికెట్ అనుమానమేనని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. జగిత్యాలలో భోగ శ్రావణి ఉదంతంతో సంజయ్ పై బీసీ లీడర్లు గుర్రుగా ఉండగా, రైతుల నుంచి వ్యతిరేకత ఎదుర్కొంటున్న విద్యాసాగర్​రావు ఈసారి తాను తప్పుకొని తనయుడిని రంగంలోకి దించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో బీఆర్​ఎస్​కు తామే ప్రత్యామ్నాయమంటూ బీజేపీ లీడర్లు జనాల్లోకి వెళ్తుండగా, సీనియర్​ లీడర్, ఎమ్మెల్సీ జీవన్​రెడ్డి ఆధ్వర్యంలో పూర్వవైభవం కోసం కాంగ్రెస్ పోరాడుతోంది.

ధర్మపురిలో మంత్రి కొప్పులకు కష్టకాలం​

ధర్మపురి నియోజకవర్గంలో బీఆర్ఎస్ నుంచి పోటీచేసిన కొప్పుల ఈశ్వర్ గత ఎన్నికల్లో అతి తక్కువ ఓట్లతో గట్టెక్కారు. ప్రస్తుతం ఆ పార్టీలో కొప్పులకు పోటీగా టికెట్ ఆశించే స్థాయి లీడర్లు కూడా లేరు. కానీ కొప్పుల పేరుతో ఆయన అనుచరులు చేసే ఆగడాలు, భూ దందాలు, సెటిల్ మెంట్లు, అక్రమ కేసులతో మంత్రిపై వ్యతిరేకత పెరిగింది. పార్టీ హైకమాండ్​ పలుమార్లు చేయించిన సర్వేల్లో ఈ విషయం బయటపడింది. దీంతో నాలుగేండ్ల తర్వాత ఇటీవల నష్టనివారణ చర్యలు ప్రారంభించినా ఫలితం కనిపించడ లేదు. ఈ క్రమంలో ప్రభుత్వ విప్ బాల్క సుమన్ ను ధర్మపురి లేదంటే చొప్పదండి నుంచి బరిలో దించే అవకాశముందని పార్టీ శ్రేణుల్లో చర్చ జరుగుతోంది. గత ఎన్నికల్లో కాంగ్రెస్​ నుంచి పోటీ చేసిన అడ్లూరి లక్ష్మణ్​కుమార్​స్వల్ప తేడాతో ఓటమి చెందారు. ఈసారి ఆయన బరిలో ఉంటే  సింపతీ కలిసివస్తుందని భావిస్తున్నారు. ధర్మపురి నుంచి గత ఎన్నికల్లో పోటీ చేసి మూడో స్థానంలో నిలిచిన బీజేపీ అభ్యర్థి కన్నం అంజయ్య మరోసారి టికెట్​ ఆశిస్తున్నారు. కానీ ఆయన ఇప్పటికీ నియోజకవర్గంపై పెద్దగా పట్టు సాధించకపోవడం మైనస్​గా మారింది. 

కోరుట్ల ఎమ్మెల్యేపై వ్యతిరేకత.. 

కోరుట్ల ఎమ్మెల్యే, బీఆర్ఎస్​ జిల్లా అధ్యక్షుడు కల్వకుంట్ల విద్యాసాగర్​రావుపై గత ఎన్నికలతో పోలిస్తే జనాల్లో వ్యతిరేకత పెరిగింది. క్యాడర్​ను చెప్పుచేతుల్లో ఉంచుకునే ప్రయత్నం చేయడం.. ప్రశ్నించిన ప్రజాప్రతినిధులు,  నేతలను, ఆఖరికి రైతు సంఘం నాయకులపైనా ఉక్కుపాదం మోపి అణచివేస్తున్నారనే ఆరోపణలున్నాయి. అభివృద్ధి, నిధుల విడుదల తదితర అంశాలపై నోరెత్తినవారిపై కక్ష సాధింపునకు పాల్పడుతున్నారని ఆ పార్టీ ప్రజా ప్రతినిధులు సైతం విమర్శిస్తున్నారు. ఎమ్మెల్యే ఒంటెత్తు పోకడ నచ్చకే ఇటీవల ఆ పార్టీకి చెందిన మెట్​పల్లి జడ్పీటీసీ సభ్యురాలు కాటిపెల్లి రాధ శ్రీనివాస్​రెడ్డి బీఆర్ఎస్​ను వీడిన విషయం తెలిసిందే. మరోవైపు విద్యాసాగర్​రావు రాజకీయ వారసుడిగా తన కొడుకు డాక్టర్ సంజయ్​కుమార్​ను వచ్చే ఎన్నికల్లో బరిలోకి దింపే ప్రయత్నాలు చేస్తుండడం ఆసక్తి రేపుతోంది. కోరుట్ల నియోజకవర్గం నుంచి కాంగ్రెస్​అభ్యర్థిగా పోటీ చేసి రెండో స్థానంతో సరి పెట్టుకున్న జువ్వాడి నర్సింగారావు ఈసారి ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. పార్టీ కేడర్​ను కలుపుకపోతూ ప్రజలతో మమేకమవుతున్నారు. కానీ కాంగ్రెస్​ పార్టీ సీనియర్​లీడర్​ కొమురెడ్డి రామ్​లు, ఆయన భార్య, మాజీ ఎమ్మెల్యే జ్యోతక్క నుంచి నర్సింగరావుకు అంతగా మద్దతు లభించడం లేదు. దీంతో ఈ సారి ఎన్నికల్లో ఆయన చెమటోడ్చక తప్పేలా లేదు. గత ఎన్నికల్లో కోరుట్ల నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన డాక్టర్​ జేఎన్. వెంకట్​కు ఈసారి వర్గ పోరు తప్పేలా లేదు. ఇదే సెగ్మెంట్​నుంచి సురభి నవీన్ రావు ఇటీవల బీజేపీలో చేరడంతో ఆయనకే వచ్చే ఎన్నికల్లో టికెట్​రానుందనే ప్రచారం జరుగుతోంది. దీనికితోడు నవీన్​రావు, ఆయన తండ్రి భూంరావు నియోజకవర్గమంతా విస్తృతంగా పర్యటిస్తూ కేడర్​తో సత్సంబంధాలు పెంచుకుంటున్నారు. 

జగిత్యాల కంచుకోటపై కాంగ్రెస్ కన్ను

అభివృద్ధి పనుల్లో ఫర్వాలేదనిపించినా స్థానిక పరిస్థితులు మాత్రం జగిత్యాల ఎమ్మెల్యే ఎం.సంజయ్​కుమార్​కు అనుకూలంగా కనిపించడం లేదు. ఇటీవల మున్సిపల్​మాజీ చైర్​పర్సన్​బోగ శ్రావణి ఎమ్మెల్యేపై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ పదవికి రాజీనామా చేయడం సంజయ్​ఇమేజ్ ను కొంతవరకు దెబ్బతీసినట్లయింది. మరోవైపు పార్టీ స్థానిక నాయకుల్లో కొందరు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, మరికొందరు మంత్రి కొప్పుల ఈశ్వర్, ఇంకొందరు ఎమ్మెల్సీ రమణ, పార్టీ జిల్లా అధ్యక్షుడు విద్యాసాగర్​రావుతో సన్నిహితంగా మెలుగుతూ సంజయ్​ను పట్టించుకోవడం లేదనే విమర్శలున్నాయి. గత ఎన్నికల్లో టీఆర్ఎస్​ చేతిలో 60 వేల ఓట్ల భారీ తేడాతో ఓడిన జీవన్ రెడ్డి అనంతరం గ్రాడ్యుయేట్​ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచారు. స్థానికంగా ప్రజలకు అందుబాటులో ఉంటూ నిత్యం ఏదో ఒక కార్యక్రమంలో పాలుపంచుకునే ఆయన వచ్చే ఎన్నికల్లో అసెంబ్లీ బరిలో ఉంటానని ప్రకటించారు. జగిత్యాల బీజేపీ అభ్యర్థిగా పోటీచేసి మూడో స్థానంతో సరిపెట్టుకున్న ముదుగంటి రవీందర్​రెడ్డి పార్టీలోని తనవారితో కలిసి వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటూ నియోజకవర్గంపై పట్టు సాధించేందుకు శ్రమిస్తున్నారు. కానీ ఇటీవల పార్టీలో చేరిన డాక్టర్​ ఎడమల శైలేందర్​రెడ్డి, రైతు నాయకుడు పన్నాల తిరుపతిరెడ్డి వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొనే వచ్చినట్లు వారి అనుచరులు చెప్తున్నారు. ఇటీవల జగిత్యాల మున్సిపల్​చైర్​పర్సన్​ పదవికి రాజీనామా చేసిన బోగ శ్రావణి సైతం త్వరలో బీజేపీలో చేరతారనే ప్రచారం మొదలైంది.

కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్​రావు

అనుకూల అంశాలు

  •     హ్యాట్రిక్​ విజయాలు
  •     కోరుట్ల, మెట్​పల్లి రెవెన్యూ డివిజన్​ ఏర్పాటు, కోరుట్లలో వంద పడకల ఆసుపత్రి నిర్మాణానికి హామీ

ప్రతికూల అంశాలు  

  •     నియోజకవర్గంలో మెట్​పల్లికి అధిక ప్రాధాన్యం ఇవ్వడం
  •     గతంలో ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడం
  •     రైతులు, మైనారిటీల్లో వ్యతిరేకత 


ధర్మపురి ఎమ్మెల్యే కొప్పుల ఈశ్వర్​

అనుకూల అంశాలు

  •     సౌమ్యునిగా పేరు
  •    నియోజకవర్గంలో దళితుల ఓట్లు ఎక్కువగా ఉండడం
  •     ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన అనుభవం
  •     గతంలో ఇచ్చిన హామీ మేరకు ఎండపల్లి, బుగ్గారం మండలాల ఏర్పాటు

ప్రతికూల అంశాలు 

  •     ఆశించిన స్థాయిలో అభివృద్ధి జరగకపోవడం
  •     నర్సన్న ఆలయానికి ఫండ్స్​ తేలేకపోవడం
  •     అనుచరులపై అవినీతి ఆరోపణలు