సాగర్ బీఆర్ఎస్​లో హీటెక్కుతున్న రాజకీయం

సాగర్ బీఆర్ఎస్​లో  హీటెక్కుతున్న రాజకీయం
  •     ఎమ్మెల్యే భగత్ కు వ్యతిరేకంగా ఏకతాటిపైకి అసమ్మతి నేతలు
  •     నామినేషన్లు ముగిసే వరకు వదిలే ప్రసక్తే లేదని స్పష్టీకరణ
  •     ఇంకోవైపు బీజేపీ హైకమాండ్​తో మంతనాలు 

నల్గొండ, వెలుగు : నాగార్జునసాగర్​ బీఆర్​ఎస్​లో పొలిటికల్​హీట్​పెరుగుతోంది. సిట్టింగ్​ఎమ్మెల్యే నోముల భగత్​కు వ్యతిరేకంగా టికెట్​ కోసం ప్రయత్నించిన లీడర్లు ఇంకా ఆశగానే ఎదురుచూస్తున్నారు. పార్టీ బీఫామ్ చేతికి అందే వరకూ ఎలాంటి మార్పులైనా జరగొచ్చని టికెట్​ కోసం ప్రయత్నిస్తూనే ఉన్నారు. విద్యావేత్త అల్లు అర్జున్​ మామ కంచర్ల చంద్రశేఖర్​రెడ్డి ఓవైపు, మన్నెం రంజిత్​ యాద వ్​ మరోవైపు నియోజకవర్గంలోని అసంతృప్తులతో చర్చలు కొనసాగిస్తూనే ఉన్నారు. ఉమ్మడి జిల్లాలోని ఆయా నియోజకవర్గాల్లో అసంతృప్తులను హైకమాండ్​ బుజ్జిగిస్తుంటే సాగర్​లో మాత్రం అలాంటి పరిస్థితులు కనిపించడం లేదు. మంత్రి జగదీశ్​రెడ్డి ప్రధాన అనుచరుడు ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డికి ఎమ్మెల్యే భగత్​తో ఉన్న విభేదాలు ఇంకా పూర్తిస్థాయిలో సమసిపోలేదు. కోటిరెడ్డి సొంత మండలం తిరుమలగిరి చెందిన పలువురు ముఖ్యనేతలు కాంగ్రెస్​లో చేరినా ఆపే ప్రయత్నాలు చేయట్లేదు. ఇక నిడమనూరు మండలంలో ఒకప్పటి జానారె డ్డి సన్నిహితుడు చేకూరి హనుమంతరావు కొడుకు వంశీ కాంగ్రెస్​లో చేరడం మరింత ఆందోళనకు గురిచేస్తోంది. 

స్పెషల్​ క్యాంపులు

భగత్​ను ఎమ్మెల్యే అభ్యర్థిగా హైకమాండ్​ ప్రకటించినప్పటికీ ఆశావహులు మాత్రం ప్రత్యేక క్యాంపులు పెడుతున్నారు. బుధవారం కంచర్ల చంద్రశేఖర్​ రెడ్డి ఎమ్మెల్యే వ్యతిరేక వర్గంతో గుర్రంపోడులో చర్చలు జరిపారు. గుర్రంపోడు జడ్పీటీసీ భర్త గాలి రవితో భేటీ అయ్యారు. పార్టీ వర్కింగ్​ ప్రెసిడెంట్​ కేటీఆర్​ నుంచి చంద్రశేఖర్​ రెడ్డికి పిలుపు వచ్చిందని తెలిసినప్పటికీ ఆయన నియోజకవర్గంలో అసమ్మతి నేతలతో సంప్రదింపులు జరుపుతున్నారు. ఇంకోవైపు మన్నెం రంజిత్​ యాదవ్​ నియోజకవర్గంలో జరిగే ఫంక్షన్లలో పాల్గొంటున్నారు. దసరా పండుగ నేపథ్యంలో విగ్రహాలకు విరాళలు ఇవ్వడంతో పాటు, యువ ఓటర్లు, స్థానిక ప్రజాప్రతినిధులతో చర్చలు జరుపుతున్నారు. 

ALSO READ: మానకొండూర్​లో బీఆర్ఎస్‌‌‌‌కు షాక్

అసమ్మతి నేతలపై బీజేపీ ఫోకస్​

బీఆర్ఎస్​ అభ్యర్థి విషయంలో హైకమాండ్​ మనసు మారని పక్షంలో ఆశా వహులు తలోదారి చూసుకోవాలనే ఆలోచనలో ఉన్నారు. ఇప్పటికే పలువురు ముఖ్యనేతలు బీజేపీ హైకమాండ్​తో టచ్​లో ఉన్నట్టు తెలిసింది. ఇప్పటికే సాగర్​ బీజేపీ టికెట్​ కోసం జిల్లా అధ్యక్షుడు శ్రీధర్​రెడ్డి భార్య కంకణాల నివేధిత రెడ్డి, రిక్కల ఇంద్రసేనా రెడ్డి మధ్య పోటీ ఉంది. ఈ క్రమంలో బీఆర్​ఎస్​ అసమ్మతి నేతలు కంచర్ల చంద్రశేఖ ర్​రెడ్డి, మన్నెం రంజిత్​ యాదవ్​పైన బీజేపీ హైకమాండ్​ దృష్టి సారించినట్టు తెలిసింది. బీజేపీ అభ్యర్థులను ఈ నెల 15 తర్వాత ప్రకటించే అవకాశం ఉంది. కుదిరితే ఈ రెండు, మూడు రోజుల్లో..  లేదంటే నామినేషన్ల టైం వరకు బీఆర్​ఎస్ అసమ్మతి నేతలు బీజేపీలోకి వెళ్లేందుకు కూడా వెనకాడేది లేదని తమ అనుచరులతో స్పష్టం చేసినట్టు సమాచారం.