చేర్యాలలో చైర్ పర్సన్, కౌన్సిలర్ల మధ్య పెరుగుతున్న దూరం

చేర్యాలలో చైర్ పర్సన్, కౌన్సిలర్ల మధ్య పెరుగుతున్న దూరం
  • జోరుగా విందులు.. అసంతృప్తులతో మంతనాలు

సిద్దిపేట/చేర్యాల,వెలుగు: సిద్దిపేట జిల్లా చేర్యాల మున్సిపాలిటీలో రాజకీయం ముదురుతోంది. కొంత కాలంగా చైర్​ పర్సన్​ను వ్యతిరేకిస్తున్న కౌన్సిలర్లు కొందరు ఇప్పుడు విందు రాజకీయాలకు తెరలేపడంతో ఏం జరగబోతుందా అనే ఆసక్తి నెలకొంది.2020 జనవరిలో కొత్తగా ఏర్పడిన చేర్యాల మున్సిపాలిటీలోని 12 కౌన్సిలర్ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు 5, కాంగ్రెస్ కు5 సీట్లు రాగా ఇద్దరు ఇండిపెండెంట్లు గెలుపొందారు. ఎవరికి మెజార్టీ సీట్లు రాకపోవడంతో బీఆర్ఎస్​ ఇద్దరు ఇండిపెండెంట్లను పార్టీలో చేర్చుకుని చైర్మన్ పదవిని దక్కించుకుంది. మున్సిపల్ చైర్మన్ పదవి మహిళకు రిజర్వ్ కావడంతో స్వరూపా శ్రీధర్ రెడ్డి ఎన్నికయ్యారు. అయితే అధికార పార్టీకి మద్దతు ఇచ్చే విషయంలో ఇండిపెండెంట్ గా గెలిచిన మహిళా అభ్యర్థి  జుబేదా ఖతూన్ కు కొంత కాలం గడిచిన తరువాత కీలక పదవి ఇస్తామని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో పాలకవర్గం ఏర్పడి మూడేండ్లు పూర్తవుతుండటంతో ఈ విషయమై ఇప్పటికే ఆ మహిళా కౌన్సిలర్ భర్త జిల్లా మంత్రి హరీశ్ రావు, ఎమ్మెల్సీలు పోచంపల్లి శ్రీనివాస్​రెడ్డి, పల్లా రాజేశ్వర్​రెడ్డితో పాటు స్థానిక ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డిని కలిసినట్టు తెలుస్తోంది. 

అవిశ్వాస తీర్మానానికి సన్నాహాలు?

ముందస్తు ఒప్పందం ప్రకారం చైర్ పర్సన్ పదవి దక్కకుంటే అవిశ్వాస తీర్మానం పెట్టాలనే దిశగా కొందరు కౌన్సిలర్లు ప్రతిపాదిస్తున్నారు. మున్సిపల్ చట్టం ప్రకారం పాలకవర్గం ఎన్నికైన మూడేండ్ల తర్వాతనే అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాల్సి ఉంటుంది. ఈనెల 27తో చేర్యాల మున్సిపల్ పాలక వర్గం ఏర్పడి మూడేండ్లు పూర్తవుతుంది. ఈ నేపథ్యంలో తమ డిమాండ్ పరిష్కారం కాకపోతే  ప్రతిపక్ష కౌన్సిలర్లతో కలసి అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలనే దిశగా పావులు కదుపుతున్నారు. అవిశ్వాస తీర్మానం సాధ్యం కాకపోతే కౌన్సిల్ సమావేశాలకు తాము వెళ్లబోమని కొందరు కౌన్సిలర్లు బాహాటంగా చెప్పడమే కాకుండా సోషల్ మీడియాలో పోస్టింగ్ లు కూడా పెడుతున్నారు. ఇదిలా వుంటే అసంతృప్త కౌన్సిలర్ల సమావేశాలకు కౌంటర్ గా చైర్ పర్సన్  కొందరు కౌన్సిలర్ల మద్దతు కూడగట్టడానికి  తనదైన రీతిలో పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది.ఈ నేపథ్యంలో మరో ఏడాది వేచి చూడాలా.. లేక ఇప్పుడే కీలక నిర్ణయం తీసుకోవాలా.. అని కొందరు కౌన్సిలర్లు ఊగిసలాడుతున్నట్టు తెలుస్తోంది. 

రహస్య విందులు.. సమావేశాలు 

చైర్ పర్సన్ పదవిని ఆశిస్తున్న కౌన్సిలర్ భర్త కొంత కాలంగా విందులతో రాజకీయ ఒత్తిళ్లను షురూ చేసినట్లు తెలుస్తోంది. దీనికి అధికార పార్టీ కౌన్సిలర్లతోపాటు ప్రతిపక్షానికి చెందిన కౌన్సిలర్లు కొందరు సహకరిస్తున్నట్లు సమాచారం. మున్సిపాలిటీలో అధికార బీఆర్ఎస్ కు బొటాబొటి మెజార్టీ ఉండటంతో ఇద్దరు కౌన్సిలర్లు అటు.. ఇటు మారితే చైర్మన్ పదవి చేజారే పరిస్థితి ఉంది. రెండు రోజుల కింద చేర్యాల పట్టణానికి సమీపంలోని ఒక ఫామ్ హౌజ్ లో అధికార, ప్రతిపక్ష పార్టీలకు చెందిన ఐదుగురు కౌన్సిలర్లు సమావేశమై భవిష్యత్ కార్యాచరణపై చర్చించడం స్థానికంగా చర్చానీయాంశమైంది. 

ఆది నుంచి అసంతృప్తే...

మొదటి నుంచి  చైర్ పర్సన్ కు, కౌన్సిలర్ల మధ్య దూరం ఉండగా అది క్రమంగా పెరుగుతూనే ఉంది. చైర్ పర్సన్ ను వ్యతిరేకిస్తున్న వారంతా ఇప్పుడు ఆమె కుర్చికి ఎసరు తేవాలనే దిశగా ప్రణాళికలు రచిస్తున్నట్లు తెలుస్తోంది. దీనికి తోడు రోజు వారీ పాలనా వ్యవహారాల్లో  చైర్ పర్సన్ భర్త జోక్యాన్ని మెజార్టీ కౌన్సిలర్లు వ్యతిరేకించడం కూడా ఉంది. అలాగే ఒకే సామాజిక వర్గానికి చైర్మన్, వైస్ చైర్మన్ పదవులు దక్కడం కూడా ఒకింత అసంతృప్తికి కారణమైంది.