ఏ ఫర్ అఖిలేశ్.. బీ ఫర్ బాబాసాహెబ్! .. యూపీలో సమాజ్ వాదీ పార్టీ ఆధ్వర్యంలో బడులు

ఏ ఫర్ అఖిలేశ్.. బీ ఫర్ బాబాసాహెబ్! .. యూపీలో సమాజ్ వాదీ పార్టీ ఆధ్వర్యంలో బడులు
  • రాజకీయ నేతల పేర్లతో  పిల్లలకు పాఠాలు 

సహారన్ పూర్: ఉత్తరప్రదేశ్‌‌‌‌లో సమాజ్‌‌‌‌వాదీ పార్టీ ఆధ్వర్యంలో నడుపుతున్న స్కూళ్లలో ఆంగ్ల అక్షరాలకు బదులు పిల్లలకు రాజకీయ నాయకుల పేర్లతో పాఠాలు నేర్పిస్తున్నారు. ఇది ఆ రాష్ట్రంలో రాజకీయ వివాదానికి దారితీసింది. ఆ రాష్ట్రంలో ఎక్కడైతే ప్రభుత్వ స్కూళ్లు మూతపడ్డాయో అక్కడ సమాజ్‌‌‌‌వాదీ పార్టీ ఆధ్వర్యంలో పీడీఏ.. పిఛ్డే (వెనకబడిన), దళిత్, అల్పసంఖ్యాక్(మైనార్టీ) పేరుతో స్కూళ్లు ప్రారంభిస్తున్నారు. ఇటీవల ఆ పార్టీ నాయకుడు ఫరాజ్ ఆలం గడా సహారన్‌‌‌‌పూర్‌‌‌‌లోని తన ఇంట్లో పీడీఏ పాఠశాలను ప్రారంభించారు. ఈ పాఠశాలలో విద్యార్థులకు ఏ ఫర్ ఆపిల్, బీ ఫర్ బాల్ వంటి పాఠాలకు బదులుగా.. ఏ ఫర్ అఖిలేశ్ యాదవ్ (సమాజ్‌‌‌‌వాదీ పార్టీ అధ్యక్షుడు), బీ ఫర్ బాబాసాహెబ్ అంబేద్కర్ (భారత రాజ్యాంగ నిర్మాత), సీ ఫర్ చౌధరీ చరణ్ సింగ్ (మాజీ ప్రధాని), డీ ఫర్ డింపుల్ యాదవ్ (అఖిలేశ్ భార్య, లోక్‌‌‌‌సభ సభ్యురాలు), ఎం ఫర్ ములాయం సింగ్ యాదవ్ (సమాజ్‌‌‌‌వాదీ పార్టీ వ్యవస్థాపకుడు) అంటూ నేర్పిస్తున్నారు.

 అయితే, ఈ విధమైన బోధన విద్యార్థుల్లో రాజకీయ చైతన్యాన్ని పెంపొందిస్తుందని ఫరాజ్ ఆలం పేర్కొంటున్నాడు. ఈ అంశం ఆ రాష్ట్రంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. పిల్లల మనసుల్లో రాజకీయ భావజాలాన్ని నింపే ప్రయత్నంగా, ఓటు బ్యాంకు రాజకీయాలకు ఉపయోగించుకునే చర్యగా విమర్శకులు ఆరోపిస్తున్నారు. సమాజ్‌‌‌‌వాదీ పార్టీ చిన్న పిల్లలను రాజకీయ శిక్షణ కోసం ఉపయోగిస్తోందని, ఇది విద్యా వ్యవస్థను దుర్వినియోగం చేసే చర్య అని బీజేపీ మద్దతుదారులు విమర్శిస్తున్నారు.