మక్తల్, వెలుగు : రాష్ట్రంలో బెదిరింపు రాజకీయాలు నడుస్తున్నాయని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి విమర్శించారు. ఇటీవల ఆత్మహత్య చేసుకున్న నారాయణపేట జిల్లా మక్తల్ మున్సిపాలిటీ పరిధిలోని ఆరో వార్డు అభ్యర్థి మహదేవప్ప కుటుంబ సభ్యులను బుధవారం కిషన్‌రెడ్డితో పాటు ఎంపీ డీకే.అరుణ పరామర్శించారు. ఈ సందర్భంగా మహదేవప్ప భార్య సత్యమ్మకు పార్టీ తరఫున రూ. 10 లక్షల చెక్కును అందజేశారు.
అనంతరం కిషన్‌రెడ్డి మాట్లాడుతూ... మహదేవప్ప ఫ్యామిలీకి బీజేపీ అన్ని విధాలుగా ఉండగా ఉంటుందన్నారు. మహదేవప్ప ఆత్మహత్య గురించి తాను పార్లమెంట్‌లో మాట్లాడానని, దీంతో ప్రధాని మోదీ స్పందించి మృతుడి ఫ్యామిలీను పరామర్శించాలని ఆదేశించారన్నారు. రాజకీయాల్లో బెదిరింపులు దిగడం మంచిది కాదన్నారు. మహదేవప్ప ఆత్మహత్యపై పోలీసులు నిష్పక్షపాతంగా దర్యాప్తు చేపట్టాలని, నిందితులను గుర్తించి చట్టరీత్యా శిక్షించాలని డిమాండ్ చేశారు. కిషన్‌రెడ్డి వెంట నాయకులు నాగురావు నామాజీ, కొండయ్య, రతంగ్ పాండురెడ్డి, బలరామిరెడ్డి, రాజశేఖర్‌రెడ్డి, జయానంద్‌రెడ్డి, చిట్యాల లక్ష్మణ్, రాజు ఉన్నారు.
