స్థానిక సంగ్రామంలో యువ నాయకత్వం అనివార్యం

స్థానిక సంగ్రామంలో  యువ నాయకత్వం అనివార్యం

రాబోయే  స్థానిక సంస్థలల్లో  పౌరసత్వ  రాజకీయాల  ఆవశ్యకత  ఉంది.  ప్రస్తుత సమాజంలో సమగ్రమైన, అర్థవంతమైన మార్పు రావాలంటే యువ నాయకత్వం అత్యవసరం అనే నినాదం సర్వత్రా బలంగా వినిపిస్తోంది.  ముఖ్యంగా  స్థానిక సంస్థల ఎన్నికల్లో యువకులు ముందుండి నాయకత్వం వహిస్తే, వారసత్వ రాజకీయాలకు స్వస్తి పలకవచ్చని,  అదేవిధంగా  పౌరసత్వ రాజకీయాలకు బాటలు వేయవచ్చని విద్యార్థులు, యువత,  మేధావులు అభిప్రాయపడుతున్నారు. 

యువతరం ఆలోచనలు, ఆకాంక్షలు,  నూతన దృక్పథం.. సమాజంలో  ఒక కొత్త శకానికి నాంది పలకగలవు.  భారతదేశ రాజకీయ చరిత్రను పరిశీలిస్తే సుదీర్ఘకాలంగా వారసత్వ రాజకీయాల ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది.   కుటుంబ నేపథ్యం, పేరు ప్రఖ్యాతులు  రాజకీయ ప్రవేశానికి, నిలదొక్కుకోవడానికి  ప్రధాన కారణమయ్యాయి.  ఈ వారసత్వ  సంస్కృతి ఒకవైపు అనుభవాన్ని అందిస్తుందని  చెప్పినప్పటికీ, మరోవైపు యువ, ప్రతిభావంతులైన నాయకులకు అవకాశాలను దూరం చేసింది. పాత తరం ఆలోచనలు, వాడుకలోలేని పద్ధతులు కొనసాగడానికి దారితీసింది.

వృత్తిగా మారిన రాజకీయాలు 

1950–-60లలో  స్వాతంత్య్రం అనంతర భారతదేశ నిర్మాణం జరుగుతున్నప్పుడు, రాజకీయాలకు ఒక ఉన్నతమైన స్థానం ఉండేది. అయితే, కాలక్రమేణా రాజకీయాలు వృత్తిగా మారిపోయాయి.  పలుచోట్ల  వారసత్వ రాజకీయాలకు అడ్డూ అదుపూ లేకుండా పోయింది. 1970---–80ల తర్వాత ఈ ధోరణి  మరింత పెరిగింది. ఇది కేవలం జాతీయ స్థాయిలోనే కాకుండా,  స్థానిక సంస్థలు,  పంచాయతీలు, మున్సిపాలిటీలదాకా పాతుకుపోయింది. ఈ వారసత్వ రాజకీయాలు ప్రజల ఆకాంక్షలకు, వాస్తవ సమస్యలకు మధ్య అంతరాన్ని సృష్టించి, జవాబుదారీతనాన్ని తగ్గించాయి. ఈ సంప్రదాయ రాజకీయాల నుంచి బయటపడాలి. రాజకీయాలు కేవలం ఎన్నికలకే  పరిమితం కాకుండా, ప్రతి పౌరుడి సమస్య, అవసరం, అభిప్రాయం పరిపాలనలో ప్రతిబింబించాలి. దీనికి యువ నాయకత్వం కీలక పాత్ర పోషించాలి.  స్థానిక సంస్థలైన పంచాయతీలు, మున్సిపాలిటీలు ప్రజలకు అత్యంత చేరువలో ఉండే ప్రభుత్వ వ్యవస్థలు.  ఇక్కడి నుంచే  నిజమైన మార్పుకు  బీజం పడుతుంది. యువ నాయకులు ఈ స్థాయిలో అధికారాన్ని చేపట్టినప్పుడు, స్థానిక సమస్యలను మరింత సమర్థవంతంగా అర్థం చేసుకోగలరు. వారిలో ఆదర్శవాదం, నిబద్ధత ఎక్కువగా ఉంటాయి. 

స్థానిక స్వపరిపాలనలో నవశకం

యువ నాయకత్వం స్థానిక సంస్థలకు కొత్త ఊపిరి పోస్తుంది. ఆధునిక సమాజం ఎదుర్కొంటున్న అనేక సవాళ్లకు వీరు పరిష్కారాలు చూపగలరు. నూతన ఆలోచనలు, ఆవిష్కరణలతో నేటి యువతరం సాంకేతిక పరిజ్ఞానంలో, ప్రపంచ పరిజ్ఞానంలో ముందుంటుంది. పట్టణీకరణ, పర్యావరణ సమస్యలు, డిజిటల్ అక్షరాస్యత వంటి అంశాలపై వారికి స్పష్టమైన అవగాహన ఉంది.  

జవాబుదారీతనం పెరుగుతుంది

 నూతన ఆలోచనలు స్థానిక సమస్యలకు వినూత్న పరిష్కారాలను అందిస్తాయి.  ఉదాహరణకు 2010 తర్వాత  మొబైల్ ఫోన్లు, ఇంటర్నెట్ విస్తృతంగా అందుబాటులోకి వచ్చాక, యువత  సామాజిక  మాధ్యమాలను  ప్రజలతో  నేరుగా సంభాషించడానికి, సమస్యలను వెలుగులోకి తీసుకురావడానికి సమర్థవంతంగా ఉపయోగిస్తున్నారు.  యువ నాయకులు పారదర్శకతకు, జవాబుదారీతనానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు.  డిజిటల్ ప్లాట్​ఫాంలను  ఉపయోగించి  నిర్ణయ ప్రక్రియలను ప్రజలకు అందుబాటులోకి  తేవడం ద్వారా  అవినీతిని అరికట్టి, జవాబుదారీతనాన్ని పెంచగలరు. యువ నాయకులు సామాజిక న్యాయం, సమ్మిళితత్వం పట్ల ఎక్కువ సుముఖత చూపుతారు. సమాజంలోని  అణగారినవర్గాలు,  మహిళలు, దళితులు, గిరిజనులు, ఇతర మైనారిటీల సమస్యలను అర్థం చేసుకుని, వారి గొంతులను బలంగా వినిపించగలరు. భవిష్యత్తు తరాలపై  బాధ్యతతో  సుస్థిర అభివృద్ధి కూడిన ఆలోచన యువతలో బలంగా ఉంటుంది.  పర్యావరణ పరిరక్షణ, సుస్థిరమైన వనరుల వినియోగం, దీర్ఘకాలిక ప్రణాళికలు వంటి అంశాలపై యువ నాయకులు దృష్టి సారిస్తారు.

మార్పు దిశగా అడుగులు

భారతదేశంలో స్థానికసంస్థల బలోపేతానికి, తద్వారా యువ నాయకత్వానికి అవకాశాలు కల్పించిన ముఖ్యమైన మైలురాయి 1992లో తీసుకొచ్చిన 73వ, 74వ రాజ్యాంగ సవరణలు. ఈ సవరణలు పంచాయతీరాజ్ సంస్థలకు,  పట్టణ స్థానిక సంస్థలకు రాజ్యాంగబద్ధతను కల్పించాయి.  స్థానిక  ప్రభుత్వాలకు ఆర్థిక,  పరిపాలనా అధికారాలను బదలాయించాయి.  మహిళలకు, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు రిజర్వేషన్లు కల్పించడం ద్వారా  గతంలో రాజకీయాలకు దూరంగా ఉన్న వర్గాలకు కూడా ప్రాతినిధ్యం కల్పించడమైంది.  ఈ సంస్కరణలు యువతకు కూడా రాజకీయాల్లో ప్రవేశించడానికి మార్గాన్ని సుగమం చేశాయి.  గత  దశాబ్ద కాలంలో ముఖ్యంగా 2014 తర్వాత  భారతదేశంలో డిజిటల్ ఇండియా, స్కిల్ ఇండియా వంటి కార్యక్రమాలు యువతను మరింత చైతన్యవంతం చేశాయి. సామాజిక మాధ్యమాల విస్తరణ, ఇంటర్నెట్ వ్యాప్తితో యువత ప్రపంచ పరిజ్ఞానాన్ని సులభంగా అందిపుచ్చుకోగలుగుతోంది.  వివిధ సామాజిక ఉద్యమాలలో,  పౌర సమాజ చర్చలలో యువతరం క్రియాశీలకంగా పాల్గొనడం కూడా గమనించదగ్గ పరిణామం.  ప్రజా భాగస్వామ్యంలో  గణనీయమైన  మార్పుకు ఇది ఓ సూచిక. 

రాజకీయపార్టీలు యువతను ప్రోత్సహించాలి

2011నాటి లోక్​పాల్ ఉద్యమం, నిర్భయ ఘటన తర్వాత జరిగిన నిరసనలు, పర్యావరణ  పరిరక్షణ  ఉద్యమాలు  ఇవన్నీ యువత సామాజిక స్పృహకు 
నిదర్శనం.  యువకులు కేవలం ఓటర్లుగానే కాకుండా, క్రియాశీల భాగస్వాములుగా  మారాలనే కోరికను ఇది తెలియజేస్తుంది.  వారసత్వ రాజకీయాల సంకెళ్ళను తెంచుకొని, నిజమైన పౌరసత్వ రాజకీయాలను  స్థాపించాలంటే  స్థానిక సంస్థల ఎన్నికల్లో యువ నాయకత్వాన్ని అన్ని రాజకీయ పార్టీలు చిత్తశుద్ధితో  
ప్రోత్సహించడం అత్యవసరం.  దీనికి రాజకీయ పార్టీలు కూడా తమ వైఖరిని మార్చుకోవాలి.  యువతకు కేవలం ఎన్నికల సమయంలోనే కాకుండా దీర్ఘకాలికంగా శిక్షణ, మార్గదర్శకత్వం అందించాలి. పౌర సమాజ సంస్థలు, విద్యాసంస్థలు కూడా యువతలో నాయకత్వ లక్షణాలను పెంపొందించడానికి కృషి చేయాలి.  యువతర నాయకత్వం కేవలం ఎన్నికల సంఖ్యలను పెంచడం కాదు, అది సమాజంలో నూతన శక్తిని, నూతన ఆశను  నింపుతుంది. సుస్థిరమైన, సమ్మిళితమైన, పారదర్శకమైన సమాజాన్ని నిర్మించడంలో యువత కీలకపాత్ర పోషిస్తుంది. ఇది కేవలం ఒక ఆకాంక్ష మాత్రమే కాదు, మన ప్రజాస్వామ్య 
వ్యవస్థ పరిపూర్ణతకు ఆవశ్యకత.

- డా. రావుల కృష్ణ,
అసిస్టెంట్ ప్రొఫెసర్,
హైద్రాబాద్ సెంట్రల్​ యూనివర్సిటీ