
- రూ. 76 కోట్లతో ఆలయ విస్తరణ పనులు చేపడ్తున్న ప్రభుత్వం
- పనులు పూర్తయ్యే దాకా భీమేశ్వరాలయంలో దర్శనానికి తాత్కాలిక ఏర్పాట్లు
- దీనిని నిరసిస్తూ పట్టణ బంద్‌కు బీజేపీ, బీఆర్‌ఎస్ పిలుపు
- ప్రధాన ఆలయంలో దర్శనాలు కొనసాగిస్తూనే పనులు చేయాలని డిమాండ్
- ప్రతిపక్షాల తీరును ఎండగడ్తూ కాంగ్రెస్కరపత్రాలు పంపిణీ
- పదేండ్లుగా చేయని పనులు తాము చేస్తుంటే మోకాలడ్డుతున్నారని ఫైర్
వేములవాడ, వెలుగు: వేములవాడ రాజన్న ఆలయ విస్తరణ పనులు రాజకీయ దుమారం రేపుతున్నాయి. పదేండ్లుగా పెండింగ్పడ్తూ వస్తున్న విస్తరణ పనులను ఎట్టకేలకు కాంగ్రెస్ప్రభుత్వం ముందరేసుకుంది. ఇటీవల రూ. 76 కోట్లు కేటాయించగా, వచ్చే నెల నుంచి పనుల ప్రారంభానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. పనుల వల్ల భక్తులకు ఇబ్బందులు కలగకుండా.. పక్కనే ఉన్న భీమేశ్వరాలయంలో రాజన్న దర్శనానికి తాత్కాలిక ఏర్పాట్లు చేస్తున్నారు.
దీనిని నిరసిస్తూ, ప్రధాన ఆలయంలోనే దర్శనాలను కొనసాగించాలని డిమాండ్ చేస్తూ బీజేపీ, బీఆర్‌ఎస్‌లీడర్లు ఆందోళనకు పిలుపునిచ్చారు. బుధవారం ఏకంగా పట్టణ బంద్ నిర్వహించారు. దీనికి కౌంటర్‌గా కాంగ్రెస్ లీడర్లు కరపత్రాలు పంపిణీ చేశారు. పదేండ్ల పాటు అధికారంలో ఉండి కూడా బీఆర్‌ఎస్ ఆలయ విస్తరణ చేయలేదని, బీజేపీ కేంద్రం నుంచి ఒక్కపైసా తేలేదని, తీరా ఇప్పుడు వాళ్లు చేయని పనులు తాము చేస్తుంటే అడ్డుతగలడం ఎంతవరకు కరెక్ట్ అని కాంగ్రెస్ప్రశ్నిస్తోంది. ప్రతిపక్షాల తీరుపై పట్టణవాసులు, భక్తుల నుంచి కూడా విస్మయం వ్యక్తమవుతోంది.
45 ఏండ్ల తర్వాత విస్తరణ పనులు..
రాష్ట్రంలో అతిపెద్ద దేవస్థానంగా గుర్తింపు పొందిన వేములవాడ రాజన్న ఆలయంలో 1979లో జరిగిన పనులే తప్ప మళ్లీ ఇప్పటివరకు ఒక్క అభివృద్ధి పని కూడా జరగలేదు. రాజన్న ఆలయానికి భక్తుల సంఖ్య పెరగడం, ఆలయం ఇరుకుగా ఉండడంతో కొన్నేండ్లుగా భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2015 జూన్ 18న కేసీఆర్ సీఎం హోదాలో వేములవాడ రాజన్నను దర్శించుకున్నారు.
ప్రతీ బడ్జెట్‌లో రూ. 100 కోట్ల చొప్పున మొత్తం రూ. 400 కోట్లతో వేములవాడ ఆలయాన్ని అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. తర్వాత వేములవాడ టెంపుల్ డెవలప్‌మెంట్ అథారిటీ (వీటీడీఏ)ని ఏర్పాటు చేసి చేతులు దులుపుకున్నారు తప్ప ఆలయంలో ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టలేదు.
ఈ క్రమంలో భక్తుల ఇబ్బందులను గుర్తించిన కాంగ్రెస్ప్రభుత్వం వేములవాడ ఆలయ విస్తరణ పనులకు ముందుకువచ్చింది. ఇందుకోసం రూ. 76 కోట్లు విడుదల చేసింది. ఈ పనులకు గతేడాది నవంబర్ 20న సీఎం రేవంత్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. వేములవాడ ప్రధాన అర్చకులు, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, దేవాదాయ శాఖ ఆఫీసర్లు.. శృంగేరి పీఠాధిపతులు భారతి తీర్థ మహాస్వామి, విధుశేఖర భారతి తీర్థ స్వామిని కలిసి ఆలయ విస్తరణ కోసం ప్లాన్ రెడీ చేశారు.
ఆలయంలో ప్రధానంగా నిత్య నివేదన మండపం, మహా మండపం, నాగిరెడ్డి మండపం పునర్నిర్మాణం, ఆలయ ప్రాకారాలు, నాలుగు రాజగోపురాలు, కోడెల విశ్రాంతి మందిరం, అభిషేక సంకల్ప మండలం, బ్రాహ్మణసత్రం, కల్యాణ మండపం, అద్దాల మండప నిర్మాణం, వేదాశీర్వచన మండపం, అనుస్థాన మండపం, ధర్మ గుండాన్ని పునఃనిర్మించడంతో పాటు క్యూలైన్లను విస్తరించాలని నిర్ణయించారు.
భీమేశ్వరాలయంలో దర్శన ఏర్పాట్లు
ఆలయ విస్తరణ పనులను జూన్‌లో ప్రారంభించేందుకు ఆఫీసర్లు సిద్ధమయ్యారు. ప్రధాన ఆలయంలో విస్తరణ పనుల కారణంగా భక్తులకు ఇబ్బందులు కలగకూడదనే ఉద్దేశంతో పక్కనే ఉన్న భీమేశ్వర ఆలయంలో దర్శనాలు కల్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రధాన ఆలయంలో నిత్యపూజలు యథావిధిగానే కొనసాగిస్తూ, దర్శనాలను మాత్రం భీమేశ్వరాలయంలో కల్పించనున్నారు.
కానీ అభివృద్ధి పనుల పేరుతో వేములవాడ ఆలయాన్ని మూసివేయాలని కాంగ్రెస్సర్కారు ప్రయత్నిస్తోందని, విగ్రహాలను తొలగించే ప్రయత్నాలు చేస్తోందని బీజేపీ, బీఆర్‌ఎస్ లీడర్లు ఆరోపిస్తున్నారు. ఇందులో భాగంగా రాజన్న ఆలయ పరిరక్షణ సమితి పేరుతో బుధవారం పట్టణ బంద్‌కు పిలుపునిచ్చారు. రాజన్న దర్శనాలను యథావిధిగా కొనసాగిస్తూనే అభివృద్ధి పనులు చేపట్టాలని, ఆలయ విస్తరణ పేరుతో ఎలాంటి విగ్రహాలను తొలగించవద్దని డిమాండ్ చేశారు.
ఆలయ అభివృద్ధి డీపీఆర్‌ను బహిర్గతం చేయాలని, నిధులు ఎక్కడి నుంచి వెచ్చిస్తారో చెప్పాలని డిమాండ్చేస్తున్నారు. అలాగే పట్టణంలోని ప్రముఖులు, కులసంఘాలతో చర్చించి వారి సలహాలు, సూచనలు తీసుకోవాలని, నిధుల వివరాలు వెల్లడించాకే పనులు మొదలు పెట్టాలని చెబుతున్నారు. బీజేపీ, బీఆర్‌ఎస్ లీడర్లు పట్టణ బంద్‌కు పిలుపునివ్వడంతో కాంగ్రెస్ నాయకులు కరపత్రాలతో ప్రచారం మొదలు పెట్టారు.
పదేండ్లు అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్ వేములవాడ అభివృద్ధిని పట్టించుకోలేదని విమర్శిస్తున్నారు. ప్రస్తుతం అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఆలయాన్ని అభివృద్ధి చేస్తామంటే బీజేపీ, బీఆర్‌ఎస్ లీడర్లు అడ్డుకుంటున్నారని, దీనిని ప్రజలు గమనించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. వాళ్లు చేయలేని పనులు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంటే, జీర్ణించుకోలేకే మోకాలడ్డుతున్నారని ఆరోపిస్తున్నారు.
మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకే...: మంత్రి కొండా సురేఖ
భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించే ఉద్దేశంతోనే వేములవాడలో విస్తరణ పనులు చేపడుతున్నామని మంత్రి కొండా సురేఖ చెప్పారు. ఆలయ అభివృద్ధిని నిరసిస్తూ ప్రతిపక్షాలు బంద్‌కు పిలుపునివ్వడంతో ఎండోమెంట్ కమిషనర్, వేములవాడ ఈవోతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. రాజన్న ఆలయం విషయంలో అపోహలు అవసరం లేదన్నారు. అన్నివర్గాల ప్రజలతో చర్చించి ముందుకు వెళ్లాలని, ఎక్కడా అనుమానాలు, ఇబ్బందులకు తావు ఇవ్వొద్దని సూచించారు.
జూన్ 15న ఆలయం మూసివేయడం అవాస్తవం: వినోద్‌రెడ్డి, ఈవో
వేములవాడ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయాన్ని జూన్ 15న మూసి వేస్తామనడం అబద్ధం అని ఈవో వినోద్‌రెడ్డి చెప్పారు. రాజన్న ఆలయ విస్తరణ పనులు అగమాశాస్ర్తం, శృంగేరి పీఠాధిపతుల అనుమతితోనే జరుగుతాయన్నారు. రాజన్న ఆలయంలో అభివృద్ధి పనులు జరిగే క్రమంలో భక్తులకు ఇబ్బందులు కలగకుండా భీమేశ్వర ఆలయంలో దర్శనాలకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. అక్కడ ఏర్పాట్లు పూర్తయ్యాక వేములవాడ అభివృద్ధి పనులు ప్రారంభిస్తామన్నారు. రాజన్న ఆలయంలో పూజలు యథావిధిగా కొనసాగుతాయని చెప్పారు.