- రూ.270 కోట్లు పెండింగ్ పెట్టిన గత సర్కారు
- వెంటనే విడుదల చేయాలని నేత కార్మికుల దీక్షలు
- ఇష్యూను రాజకీయంగా వాడుకునేందుకు ప్రతిపక్షాల ప్రయత్నాలు
- తాజాగా కార్మికుడి మృతితో నేతల నడుమ మాటల యుద్ధం
- కాంగ్రెస్ వచ్చాక మళ్లీ ఆత్మహత్యలు మొదలయ్యాయన్న కేటీఆర్
- కార్మికులకు మద్దతుగా ఈ నెల 10న దీక్ష చేస్తానన్న బండి సంజయ్
- తప్పు మీరు చేసి నెపం మా మీద వేస్తారా?: ఆది శ్రీనివాస్
- కార్మిక క్షేత్రంలో హీటెక్కిన రాజకీయాలు
రాజన్న సిరిసిల్ల, వెలుగు: సిరిసిల్ల నేత కార్మికులకు చెల్లించాల్సిన బకాయిలపై రాజకీయ రగడ మొదలైంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం పెండింగ్ పెట్టిన బతుకమ్మ చీరల బకాయిలు రూ.270 కోట్లను వెంటనే విడుదల చేయాలంటూ సిరిసిల్ల వస్త్ర వ్యాపార సంఘాలు ఇటీవల దీక్షలు చేపట్టగా బీఆర్ఎస్, బీజేపీలు మద్దతు ప్రకటించాయి. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఈ వివాదాన్ని రాజకీయంగా వాడుకు నేందుకు ప్రతిపక్ష పార్టీలు ప్రయత్నిస్తుండగా, కాంగ్రెస్ నేతల కౌంటర్లతో కార్మిక క్షేత్రంలో పాలిటిక్స్ హీటెక్కాయి. ఈ క్రమంలో ఆర్థిక సమస్యలతో సిరిసిల్ల రాజీవ్ నగర్‌కు చెందిన పవర్‌లూం కార్మికుడు సిరిపురం లక్ష్మీనారాయణ శనివారం ఆత్మహత్య చేసుకోవడంతో అధికార, ప్రతిపక్ష నేతల నడుమ మాటల యుద్ధం మరింత ముదిరింది.
మాటల తూటాలు..
పవర్‌లూం కార్మికుడు సిరిపురం లక్ష్మీనారాయణ శని వారం ఆత్మహత్య చేసుకోవడంతో అధికార, ప్రతిపక్ష నేతల నడుమ డైలాగ్‌వార్ మొదలైంది. కార్మికుడు చనిపోయిన విషయం తెలిసిన వెంటనే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రంగంలోకి దిగారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించి పార్టీ నుంచి రూ. 50వేలు సాయం అందించారు. బతుకమ్మ చీరల బకాయిలు ఇవ్వకుండా కాంగ్రెస్ రాజకీయం చేస్తోందని విమర్శించారు.
తెలంగాణ రాకముందు సిరిసి ల్లలో నేతన్నల ఆత్మహత్యలుండేవని, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక మళ్లీ ఆత్మహత్యలు మొదలయ్యాయన్నారు. సిరిసిల్ల నేత కార్మికుల కోసం తమ ప్రభుత్వం తెచ్చిన బతుకమ్మ చీరల ఆర్డర్లను కాంగ్రెస్ పునరుద్ధరించాలని, లేదంటే కార్మికులతో కలిసి ఆందోళనను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. బీజేపీ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ సైతం శనివారమే సిరిసిల్ల నేత కార్మికుని కుటుంబాన్ని పరిశీలించి లక్ష సాయం అందజేశారు.
రాష్ట్ర ప్రభుత్వం వెంటనే నేతకార్మికులకు రావాల్సిన బతుకమ్మ చీరల బకాయిలు చెల్లించాలని, కొత్త ఆర్డర్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఒకవేళ సర్కారు స్పందించకపోతే ఈ నెల 10న కార్మికులకు మద్దతుగా సిరిసిల్లలో దీక్ష చేపట్టనున్నట్లు హెచ్చరించారు. కేటీఆర్, సంజయ్ విమర్శలకు తాజాగా ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కౌంటర్ ఇచ్చారు. ‘తప్పు మీరు చేసి నెపం మా మీద వేస్తరా?’ అంటూ ఫైర్ అయ్యారు. ‘గతేడాది బతుకమ్మ చీరలు పంచి, ఎన్నికల్లో లబ్ధి పొందారు.
కానీ నేత కార్మికులకు రూ. 270 కోట్ల బకాయిలు ఇవ్వలేదు. ఈ పాపం బీఆర్ఎస్ పెద్దలదే. ఇప్పుడేమో మాదే తప్పు అన్నట్లుగా మాట్లాడుతున్నారు. బతుకమ్మ చీరల బకాయిలు ఎందుకు ఇవ్వలేదో కేటీఆర్ సమాధానం చెప్పాలి. నేత కార్మికులకు బీజేపీ ఎంపీ బండి సంజయ్ చేసిందేమీ లేదు. ఆయన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నప్పుడు మెగా పవర్‌లూం క్లస్టర్ వరంగల్‌కు తరలిపోతున్నా నోరు మెదపలేదు. ఇప్పుడు ఎన్నికల కోసం విమర్శలు చేస్తున్నారు.’ అంటూ ఆది శ్రీనివాస్ ఫైర్ అయ్యారు. కాగా, రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో సిరిసిల్ల నేత కార్మికుల ఓట్లు కీలకం కావడంతో నేతల మధ్య విమర్శలు, ప్రతివిమర్శలు ఇప్పట్లో ఆగేలా లేవు.
ఇదీ ఇష్యూ..
సిరిసిల్ల కార్మికులతో గతేడాది బతుకమ్మ చీరలు నేయించిన అప్పటి బీఆర్ఎస్ సర్కారు నేతన్నలకు రూ.270 కోట్లు బకాయి పడింది. గత ఫిబ్రవరి నెలలోనే ఆర్డర్లు ఇచ్చిన ప్రభుత్వం, సెప్టెంబర్చివరి కల్లా చీరలు పంపిణీ చేయించింది. మంత్రులు, ఎమ్మెల్యేలతో చీరలు పంచి అసెంబ్లీ ఎన్నికల్లో లబ్ధిపొందిన బీఆర్ఎస్ పెద్దలు బకాయిలను మాత్రం విడుదల చేయలేదు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి రావడం, బకాయిలపై ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో కొద్దిరోజులుగా నేత కార్మికులు దీక్షలు చేస్తున్నారు.
గత బీఆర్ఎస్ సర్కారు పెండింగ్పెట్టిన బకాయిలు వెంటనే చెల్లించి, కొత్తగా బతుకమ్మ చీరల ఆర్డర్లు ఇచ్చి ఆదుకోవాలని డిమాండ్చేస్తున్నారు. కాగా, దీనిని రాజకీయంగా వాడుకోవాలని మొదట బీఆర్ఎస్ ప్లాన్ చేసింది. కార్మికుల తరుపున తాము దీక్ష చేస్తామంటూ మొదట బీఆర్ఎస్ పిలుపునివ్వగా సిరిసిల్ల నేత కార్మిక సంఘాలు, పాలిస్టర్ వస్ర్త పరిశ్రమ యజమానులు నిరాకరించారు. తర్వాత కొందరు నేత కార్మికులు స్వయంగా దీక్షలకు దిగడంతో బీఆర్ఎస్ నేతలు రోజూ వెళ్లి మద్దతుగా కూర్చుంటున్నారు.