పొలిటికల్ వార్.. నేడే నితీశ్ రాజీనామా..! మరోసారి బీజేపీతో పొత్తు..!

పొలిటికల్ వార్.. నేడే నితీశ్ రాజీనామా..! మరోసారి బీజేపీతో పొత్తు..!

లోక్ సభ ఎన్నికలకు ముందు బిహార్‌లో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. వారసత్వ రాజకీయాలపై ఆ రాష్ట్ర సీఎం నితీశ్ కుమార్ చేసిన వ్యాఖ్యలతో.. మహాకూటమి చీలిపోయే అవకాశముందంటూ ఇటీవల వార్తలు వచ్చాయి. వేగంగా మారుతున్న రాజకీయ పరిణామాల క్రమంలో.. ఈ రోజు సీఎం పదవికి నితీశ్ రాజీనామా చేసే అవకాశం ఉందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ రోజు నితీశ్.. జేడీ(యూ) ఎమ్మెల్యేలను పాట్నాకు పిలిపించడంతో ఈ తరహా ప్రచారానికి పునాది పడింది.

నితీశ్ రాజీనామా అనంతరం బీజేపీ మద్ధతుతో కొత్త ప్రభుత్వ ఏర్పాటు చేయనున్నారని సమాచారం. ఒక్క మాటలో చెప్పాలంటే.. ఇదే గనక జరిగితే.. ఆర్జేడీ, జేడీ(యూ), కాంగ్రెస్ పార్టీల సంకీర్ణ ప్రభుత్వానికి నేటితో తెరపడుతుంది. అంతకుముందు జనవరి 26న ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా కీలక సమావేశం నిర్వహించారు. ఇకపోతే నేడు సీఎల్పీ నేత షకీల్ అహ్మద్ ఖాన్.. బీహార్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో పూర్ణియాలో భేటీ కానున్నారు. మరోవైపు ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్‌ను కలుస్తున్నారు. ఏదేమైనా కొత్త ప్రభుత్వ ఏర్పాటు నేపథ్యంలో పార్టీ నాయకత్వం భేటీ ఏర్పాటు చేసినట్టు ప్రచారం సాగుతోంది.

2022లో నితీశ్.. బీజేపీతో పొత్తుకు స్వస్తి పలికారు. ఆ తర్వాతే కాంగ్రెస్, ఆర్జేడీతో కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అయితే కొద్దికాలంగా నితీశ్.. మిత్రపక్షాలపై అసంతృప్తిగా ఉన్నట్టు సమాచారం. నితీశ్ కు రాజకీయ గురువైన మాజీ సీఎం కర్పూరీ ఠాకూర్ కు ఇటీవల కేంద్రం భారతరత్న ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత నిర్వహించిన కర్పూరీ శతజయంతి వేడుకల్లో సీఎం నితీశ్ వారసత్వ రాజకీయాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఇది సంకీర్ణ కూటమి కూలిపోతుందనే వార్తలకు ఆజ్యం పోసింది. దీంతో నితీశ్ మరోసారి బీజేపీతో పొత్తు పెట్టుకుని, కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటుచేస్తారని విశ్వసనీయ వర్గాల సమాచారం.