కామారెడ్డి జిల్లాలో వేడెక్కిన రాజకీయం

కామారెడ్డి జిల్లాలో వేడెక్కిన రాజకీయం
  •  ముందస్తు ముచ్చటతో వేడెక్కిన కామారెడ్డి 
  • అధికార పార్టీకి ఇబ్బందిగా మారనున్న సాగునీటి సమస్య 
  • జిల్లా కేంద్రంలో మాస్టర్​ప్లాన్​తో పెరిగిన వ్యతిరేకత 
  • పోరాటాలు, యాత్రలతో ముందున్న కాంగ్రెస్​, బీజేపీలు 
  • రెండు పార్టీలకు ఇబ్బందిగా మారిన గ్రూపు రాజకీయాలు

కామారెడ్డి, వెలుగు : ముందస్తు ఎన్నికలు వస్తాయనే ప్రచారంతో కామారెడ్డి జిల్లాలో రాజకీయం వేడెక్కింది. అధికార పార్టీ అయిన బీఆర్​ఎస్​ అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలు, ఆత్మీయ సమ్మేళనాలతో ఓటర్లను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తుంటే...ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ప్రతిపక్షాలు ముందుకు వెళ్తున్నాయి. మాస్టర్​ప్లాన్​, ఇతర సమస్యలపై ఆందోళనలు, నిరసనలు, ధర్నాలు, నిరాహార దీక్షలతో కామారెడ్డి జిల్లాను తమ ఖాతాలో వేసుకునేందుకు సిద్ధమవుతున్నాయి. గతంలో హామీ ఇచ్చిన ప్రకారం సాగునీటి సమస్యను పరిష్కరించకపోవడంతో రైతన్నలు అధికార పార్టీపై అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తోంది.   

ముందుకెళ్లని కాళేశ్వరం 22 ప్యాకేజీ పనులు

జిల్లాను సాగు నీటి సమస్య వేధిస్తున్నది. బోరుబావుల ఆధారంగా ఇక్కడ వ్యవసాయం చేస్తుంటారు.   కామారెడ్డి, ఎల్లారెడ్డి నియోజకవర్గాలతో పాటు, బాన్స్​వాడ నియోజకవర్గంలోని కొన్ని ప్రాంతాల్లో 3.50 లక్షల ఎకరాలకు సాగునీళ్లందించేందుకు కాళేశ్వరం ప్రాజెక్టు 22వ ప్యాకేజీని ప్రతిపాదించారు. గత కాంగ్రెస్​ ప్రభుత్వ హయాంలో శాంక్షన్​అయిన ఈ పనులు కొంతవరకే పూర్తయ్యాయి. ఏడాదిలోనే  మిగిలిన పనులు పూర్తి చేయిస్తామని 2018 ఎన్నికల టైంలో  సీఎం కేసీఆర్​హామీ ఇచ్చినా ఇప్పటికీ నెరవేరలేదు. భూ సేకరణ కూడా పూర్తి కాలేదు. జుక్కల్​నియోజకవర్గానికి సంబంధించి లెండి ప్రాజెక్టు సమస్య కూడా ఉంది. ఎల్లారెడ్డి, కామారెడ్డి, జుక్కల్​ నియోజకవర్గాల్లో పోడు భూముల ఇష్యూ కూడా అధికార పార్టీకి ఇబ్బందులు తెచ్చిపెట్టే అవకాశం ఉంది.   

కామారెడ్డిలో స్పీడ్​ పెంచిన పార్టీలు  

కామారెడ్డి నియోజకవర్గంలో బీజేపీ దూకుడు పెంచింది. ఇక్కడ బలంగా ఉన్న బీఆర్ఎస్, కాంగ్రెస్​ పార్టీలకు చెక్ పెట్టి గెలుపే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. స్థానిక సమస్యలకు ఎక్కువ ప్రాధాన్యతనిస్తోంది. ధరణితో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై పార్టీ నియోజకవర్గ ఇన్​చార్జి కాటిపల్లి వెంకటరమణారెడ్డి మూడు రోజుల పాటు ఆమరణ దీక్ష చేపట్టారు. కామారెడ్డి టౌన్ ​ముసాయిదా మాస్టర్​ ప్లాన్​కు వ్యతిరేకంగా రైతులతో కలిసి  బీజేపీ ఉద్యమించింది. అయితే బీజేపీలో రెండు గ్రూపులు ఉండడం అధిష్టానానికి సమస్యగా మారింది. ఇక్కడి నుంచి  గత ఎన్నికల్లో పోటీ చేసిన కాటిపల్లి వెంకటరమణారెడ్డితో పాటు ఎంజీ వేణుగోపాల్​ గౌడ్​వచ్చే ఎన్నికల్లో టికెట్ కోసం ఆశపడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ ​పూర్వ వైభవం కోసం ప్రయత్నిస్తోంది. కొద్ది రోజులుగా ఆ పార్టీ కార్యక్రమాలను విస్తృతం చేసింది. ఇందులో భాగంగా మాజీ మంత్రి షబ్బీర్​అలీ పర్యటనలతో బిజీగా గడుపుతున్నారు. ఈయన మరో సారి కాంగ్రెస్ ​నుంచి బరిలో ఉంటారని తెలుస్తోంది. పార్టీలో ఆయనకు పోటీ లేకపోవడమే దీనికి కారణం. అయితే గత అసెంబ్లీ ఎన్నికల టైంలో చాలా మంది ద్వితీయ శ్రేణి లీడర్లు కాంగ్రెస్​ను వదిలి వెళ్లారు. ఇప్పుడు కేడర్ ​మధ్య కో అర్డినేషన్​ సమస్య ఉంది. ఇక ప్రస్తుత ఎమ్మెల్యే, విప్ ​గంప గోవర్ధన్ ​మళ్లీ బీఆర్​ఎస్​ టికెట్​తనకే వస్తుందన్న ధీమాతో ఉన్నారు. ఇక్కడ పార్టీకి ఉన్న పట్టు, సీనియర్​ఎమ్మెల్యేగా పేరు, అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలు తనను వచ్చే ఎన్నికల్లో గెలిపిస్తాయని నమ్మకంగా ఉన్నారు. ఆత్మీయ సమ్మేళనాలతో కేడర్​లో జోష్ ​పెంచుతుండగా మరోవైపు పార్టీ శ్రేణుల్లో అసంతృప్తి సమస్య వేధిస్తోంది.

జుక్కల్​లో పాగా కోసం..  

మహారాష్ర్ట, కర్నాటక బార్డర్​లో ఉండే జుక్కల్ ​నియోజకవర్గంలో ఈసారి పాగా వేయాలని బీజేపీ తహతహలాడుతోంది. పల్లె గోస, బీజేపీ భరోసా కార్యక్రమాలను ప్రతి ఊరిలో నిర్వహించారు. నెల రోజులుగా పార్టీ జిల్లా ప్రెసిడెంట్, మాజీ ఎమ్మెల్యే అరుణతార ఇంటింటికీ తిరిగి ప్రచారం చేస్తున్నారు. ఇక్కడ బీజేపీ ఒక్క అడుగు ముందుండగా కాంగ్రెస్​ కూడా ఢీ అంటే ఢీ అంటోంది. ఇటీవల ఆ పార్టీ జాతీయ నేత రాహుల్​గాంధీ ఈ నియోజక వర్గంలో యాత్ర చేశారు. రాష్ర్టంలో పాదయాత్ర ముగింపు సభను కూడా ఇదే నియోజక వర్గంలో నిర్వహించారు. దీంతో కాంగ్రెస్​ కేడర్​లో ఉత్సాహం పెరిగింది. ఈ పార్టీ నుంచి మాజీ ఎమ్మెల్యే ఎస్.గంగారాం టికెట్​తనకే వస్తుందని చెబుతున్నారు. మరో వైపు నిజామాబాద్ ​మాజీ డీసీసీ ప్రెసిడెంట్​గడుగు గంగాధర్​ కూడా అప్పుడప్పుడు పర్యటిస్తున్నారు. భారత్​ జోడో యాత్ర తర్వాత వచ్చిన సంకేతాలతో ఎన్ఆర్ఐ లక్ష్మీకాంత్​రావు కూడా  కాంగ్రెస్​తరపున పోటీకి సన్నద్ధమవుతున్నారు. పలువురు ద్వితీయ శ్రేణి లీడర్లతో ఆయన సంప్రదింపులు జరుపుతున్నారు. దీంతో పార్టీలో కొంత గందరగోళం నెలకొంది. వరుస విజయాలతో జోష్​ మీదున్న బీఆర్ఎస్​ మళ్లీ తామే గెలుస్తామన్న నమ్మకంతో ఉంది. కేసీఆర్, ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలు కలిసి వస్తాయని భావిస్తున్నారు. సిట్టింగ్​ఎమ్మెల్యే హన్మంతుషిండే తనకే టికెట్ వస్తుందని అంటున్నారు. పార్టీలో అసమ్మతి సమస్య వేధిస్తోంది. మహ్మద్​నగర్​ను మండల కేంద్రం చేయలేదని ఆ ఏరియా లీడర్లు ఎమ్మెల్యేపై అసంతృప్తితో ఉన్నారు.   

బాన్సువాడలో పోచారానికి చెక్​ పెట్టేందుకు..

బాన్సువాడలో వరుస విజయాలు సాధిస్తున్న స్పీకర్​ పోచారం శ్రీనివాస్​రెడ్డికి చెక్​పెట్టాలని బీజేపీ, కాంగ్రెస్​ ప్రయత్నిస్తున్నాయి. బీజేపీ తరపున పోటీ చేయాలనే ఉద్దేశంతో కాంగ్రెస్​కు చెందిన మల్యాద్రిరెడ్డి కాషాయ పార్టీలో చేరారు. నియోజకవర్గంలో పాదయాత్రలు చేస్తూ, గ్రామాల్లో తిరుగుతూ పార్టీని పటిష్టం చేసే పనిలో ఉన్నారు. సమస్యలపై ఆందోళన కార్యక్రమాలతో ప్రజలకు దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. పార్టీకి పూర్తి స్థాయి కేడర్​ లేకపోవడంతో లోటుగా చెప్పొచ్చు. మరోవైపు ప్రజల సమస్యలపై పోరాటాలతో పాటు పార్టీ పోగ్రామ్స్​ నిర్వహిస్తూ కాంగ్రెస్ ​తన ఉనికిని చాటుతోంది. గత ఎన్నికల్లో  పోటీ చేసిన కాసుల బాల్​రాజు మళ్లీ టికెట్​ఆశిస్తున్నారు. ప్రతిపక్షాల నుంచి గట్టి అభ్యర్థి లేరని, ఈసారి కూడా తను గెలవడం ఖాయమని పోచారం శ్రీనివాస్​రెడ్డి ధీమాగా ఉన్నారు. పోచారం మొదటి నుంచి నియోజకవర్గంలో  ఎక్కువగానే పర్యటిస్తుంటారు. డెవలప్​మెంట్ ​కోసం తెచ్చిన ఫండ్స్​, డబుల్​ బెడ్​రూం ఇండ్ల నిర్మాణం వంటివి మెజారిటీ తెచ్చిపెడతాయంటున్నారు. ఇక స్పీకర్​ కొడుకు, డీసీసీబీ చైర్మన్​పోచారం భాస్కర్​రెడ్డి దూకుడు ఆయనకు కొంత ఇబ్బందికరంగా మారే ప్రమాదం ఉంది. భాస్కర్​రెడ్డి కూడా ఎమ్మెల్యేగా పోటీ చేయాలనే అలోచనతో ఉన్నారని తెలుస్తున్నా, అలాంటిదేమీ లేదని ఎమ్మెల్యే అనుచరులు కొట్టిపారేస్తున్నారు.  

బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం 

అనుకూల అంశాలు  

  •      ప్రజలకు అందుబాటులో ఉండటం.  నిరంతరం గ్రామాల్లో పర్యటించటం
  •      మిగతా నియోజక వర్గాల కంటే ఎక్కువ ఫండ్స్​ తీసుకురావడం 
  •      అత్యధికంగా డబుల్​బెడ్​ రూం ఇండ్ల     నిర్మాణం. పంపిణీ
  •     సొంత స్థలం ఉన్న వారికి గతంలోనే ఇంటి నిర్మాణానికి అవకాశం కల్పించడం 
  •      డెవలప్​మెంట్​ వర్క్స్​ను పర్యవేక్షించడం 

ప్రతికూల ఆంశాలు

  •    కుటుంబసభ్యుల ఆధిపత్యం పెరగడం 
  •   కొడుకుకు డీసీసీబీ చైర్మన్​ పదవి, బంధువులకు కూడా పదవులు కట్టబెట్టారని  ద్వితీయ శ్రేణి లీడర్లలో అసంతృప్తి 
  •   అక్కడక్కడా డెవలప్​మెంట్​ పనుల్లో  నాణ్యతాలోపాలు
  •   పార్టీ లీడర్ల అక్రమ ఇసుక దందా  

కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్​

అనుకూల ఆంశాలు

  •      వరుస విజయాలు..గ్రామాల్లో పట్టు  
  •      డెవలప్​మెంట్​వర్క్స్, తమ వల్లే జిల్లా వచ్చిందనే ప్రచారం  
  •      జిల్లాకు మెడికల్ కాలేజీ మంజూరు  

ప్రతికూల ఆంశాలు

  • ఉద్యమ సమయంలో పని చేసిన కేడర్​ను దూరం పెట్టడం
  • అనుచరుల వ్యవహార శైలి  
  • సాగు నీటి సమస్య. గెలిచిన ఏడాదిలో పనులు  చేస్తామని చెప్పి చేయకపోవడం 
  • కామారెడ్డి ముసాయిదా 
  • మాస్టర్​ ప్లాన్​పై వ్యతిరేకత 
  • డబుల్ బెడ్​ రూం ఇండ్ల పంపిణీ చేయకపోవడం 

ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురేందర్​

అనుకూల ఆంశాలు

  •      ప్రభుత్వ సంక్షేమ పథకాలు,  డెవలప్​మెంట్​ పనులు
  •      గతంలో అగిన పనులు చేయించడం 
  •      గాంధారిలో రోడ్డు పనులు. ఎల్లారెడ్డి పెద్ద చెరువు వద్ద బ్రిడ్జిల నిర్మాణం 
  •     ఎమ్మెల్యే సామాజిక వర్గం ఓట్లు ఎక్కువగా ఉండడం

ప్రతికూల ఆంశాలు

  •      గత ఎన్నికల్లో గెలుపు కోసం పని చేసిన వారిని పట్టించుకోకపోవడం 
  •      ఫస్ట్ నుంచి పార్టీ కోసం పని చేసిన వారిని, 
  •     ద్వితీయ శ్రేణి లీడర్లను పక్కనబెట్టడం 
  •      ఫోన్లు ఎత్తడం లేదనే ఆరోపణలు 
  •      డబుల్​ ఇండ్ల నిర్మాణం చేపట్టకపోవడం 
  •      పోడు భూముల సమస్య
  •      కాళేశ్వరం 22వ ప్యాకేజీ పనులు పూర్తి కాకపోవడం 
  •      గతంలో హామీ ఇచ్చినట్టు పోచారం ప్రాజెక్టు ఎత్తు పెంపునకు ప్రయత్నించకపోవడం


జుక్కల్​ ఎమ్మెల్యే హన్మంతు షిండే

అనుకూల ఆంశాలు

  •     ఎవరి మనస్సు నొప్పించకపోవడం
  •      ప్రజలతో సత్సంబంధాలు
  •     3 మండలాలకు సాగునీళ్లందించేందుకు రూ.450 కోట్లతో నాగమడుగు ఎత్తిపోతల స్కీమ్​ శాంక్షన్​ చేయించడం 

ప్రతికూల ఆంశాలు

  •     డబుల్​ఇండ్ల నిర్మాణాలు పూర్తి చేయలేకపోవడం 
  •      రెండు మండలాలకు సాగు నీరందించే లెండి ప్రాజెక్టు పనులు చేయించకపోవడం
  •      పోడు భూముల పట్టాల సమస్య 
  •     మహ్మద్​నగర్​ను మండల కేంద్రం చేయించలేకపోవడం 
  •      గ్రామాలకు సరైన రోడ్లు, రవాణా వసతులు లేకపోవడం