నిర్మల్ జిల్లాలో రసవత్తరంగా పాలిటిక్స్​

నిర్మల్ జిల్లాలో రసవత్తరంగా  పాలిటిక్స్​
  • బీఆర్ఎస్​, బీజేపీల మధ్య పోటా పోటీ 
  • రెండు పార్టీల్లోనూ ఆశావహుల సంఖ్య ఎక్కువే..
  • సత్తా చాటాలని కాంగ్రెస్​ ప్రయత్నం  
  • మహేశ్వర్​రెడ్డిపైనే ఆ పార్టీ ఆశలు 
  • వచ్చే ఎన్నికలకు సిద్ధమవుతున్న మూడు పార్టీలు 

నిర్మల్, వెలుగు : నిర్మల్ జిల్లాలో పాలిటిక్స్​ రసవత్తరంగా మారాయి. ఈ జిల్లాలో  మూడు అసెంబ్లీ నియోజకవర్గాలుండగా రాజకీయ కార్యకలాపాలు ఊపందుకుంటున్నాయి. బీఆర్ఎస్​అధికారంలో ఉండడం, నిర్మల్​ఎమ్మెల్యే మంత్రి కావడంతో జిల్లాలో ఆ పార్టీ బలంగానే ఉంది. కానీ, కొంతకాలంగా బీజేపీ బీఆర్ఎస్​కు గట్టి పోటీ ఇస్తోంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్ర  జరిగినప్పటి నుంచి మరింత దూకుడు పెంచింది. కాంగ్రెస్ పార్టీ మాత్రం సత్తా చాటడానికి అపసోపాలు పడుతోంది. అడపాదడపా, చిన్నాచితక కార్యక్రమాలు చేపట్టడానికే పరిమితమైంది. నిన్న మొన్నటి వరకు ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడి పేరును కూడా అధిష్టానం అధికారికంగా వెల్లడించలేదు. మొదట్లో జిల్లాలో ఎవరికీ తెలియని, స్థానికేతరుడైన ప్రకాశ్​రెడ్డి పేరును ప్రకటించారు. రెండు మూడు నెలల తర్వాత ముత్యంరెడ్డి పేరును ఖరారు చేశారు. 

ఆ ముఖ్య లీడర్​ బీజేపీలో చేరితే... 

వచ్చే ఎన్నికల్లో జిల్లాలోని మూడు నియోజకవర్గాల్లోనూ గెలవాలని బీజేపీ పట్టుదలతో ఉంది. అందుకే ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్​​మూడు నియోజకవర్గ కేంద్రాల్లో పర్యటించి కేడర్లో జోష్​ నింపారు. అంతేగాక బూత్ స్థాయి నుంచి పార్టీని పటిష్టపరిచేందుకు కార్యక్రమాలు రూపొందిస్తున్నారు. బీజేపీలో నిర్మల్​నియోజకవర్గం నుంచి మాజీ మున్సిపల్ చైర్మన్ అప్పాల గణేష్ చక్రవర్తి, డాక్టర్స్ సెల్ ఇన్​చార్జి డాక్టర్ మల్లికార్జున్​రెడ్డి, సీనియర్ నాయకులు రావుల రామనాథ్, అయ్యన్న గారి భూమయ్య టికెట్ ఆశిస్తున్నారు. దీంతో పాటు ప్రతిపక్ష పార్టీకి చెందిన ఓ ముఖ్య నేత, ప్రస్తుతం నిర్మల్​లో ఆయనే ఆధారం అనుకుంటున్న నాయకుడు ఆ పార్టీకి  రాజీనామా చేసి బీజేపీలో చేరేందుకు ఆసక్తిగా ఉన్నట్టు తెలుస్తోంది. ఆయనకే టికెట్ ఇస్తానని కన్ఫమ్​చేస్తే  చేరేందుకు సిద్ధంగా ఉన్నట్టు సమాచారం.  

బీజేపీలో టికెట్ల పోటీ 

ముథోల్​సెగ్మెంట్​లో కూడా బీజేపీ టికెట్ కోసం తీవ్ర పోటీ నెలకొంది. ఇటీవల డీసీసీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసి బీజేపీలో చేరిన రామారావు పటేల్, ఆ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మోహన్ రావు పటేల్, పార్టీ జిల్లా అధ్యక్షురాలు రమాదేవి రేసులో ఉన్నారు. వీరంతా పోటాపోటీ కార్యక్రమాలు కొనసాగిస్తూ పట్టు నిలుపుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఎలాగైనా అధిష్టానం దృష్టిలో పడి టికెట్​సాధించేందుకు ప్రతిరోజు ఏదో ప్రోగ్రామ్​చేస్తున్నారు. ముథోల్ లో బీజేపీ బలంగా ఉన్న కారణంగా ఈసారి గెలుపు ఖాయమని భావించిన నేతలు టికెట్ కోసం ఇప్ప టి నుంచే పావులు కదుపుతున్నారు. ఖానాపూర్ నియోజకవర్గంలో బీజేపీ నుంచి మాజీ ఎంపీ రాథోడ్ రమేశ్, పెంబి జడ్పీటీసీ జానకీబాయితో పాటు హరినాయక్, సట్ల అశోక్ టికెట్లు ఆశిస్తున్నారు.  

బీఆర్ఎస్​లో వేణుగోపాలాచారి వర్సెస్​ విఠల్​రెడ్డి 

నిర్మల్ మినహా ముథోల్, ఖానాపూర్ నియోజకవర్గాల్లో బీఆర్ఎస్​ ఎమ్మెల్యేలను అసంతృప్తుల భయం వెంటాడుతోంది. ముథోల్​లో ఎమ్మెల్యే విఠల్ రెడ్డి పై..మాజీ  కేంద్రమంత్రి వేణుగోపాలా చారి వర్గం అసంతృప్తితో ఉంది. వేణుగోపాలాచారికి  ఇటీవల ఐడీసీ కార్పొరేషన్ చైర్మన్ పదవి దక్కడంతో ఆయన మళ్లీ కార్యకలాపాలను ముమ్మరం చేసే అవకాశాలున్నాయంటున్నారు. రాబోయే ఎన్నికల్లో పార్టీ టికెట్ కూడా ఆశిస్తున్నట్టు సమాచారం. ఇప్పటికే ఆయన అనుచరులు వేణుగోపాలా చారి పోటీలో ఉంటారని ప్రచారం చేస్తున్నారు. అలాగే విఠల్​రెడ్డి కూడా తిరిగి తానే పోటీ చేస్తానని చెప్పుకుంటున్నారు.

ఖానాపూర్​ బీఆర్​ఎస్​లో నేనంటే నేను.. 

 ఖానాపూర్ లో బీఆర్ఎస్​తరఫున ఈ సారి చాలా మంది పోటీ  చేసేందుకు ఉత్సాహపడుతున్నారు. ప్రస్తుత ఎమ్మెల్యే రేఖా నాయక్, అవకాశం వస్తే ఆమె భర్త  శ్యాంనాయక్, అలాగే హైదరాబాద్ కు చెందిన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి  శరవణన్, రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమార్ అనుచరుడిగా పేరున్న పూర్ణచందర్ నాయక్​వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆసక్తిగా కనబరుస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో ముథోల్, ఖానాపూర్ నియోజకవర్గాల్లో ఈసారి బీఆర్ఎస్​కు అసమ్మతి పోటు తప్పక పోవచ్చంటున్నారు.

కాంగ్రెస్ కు కష్టకాలమే.. 

మూడు నియోజకవర్గాల్లో ఈసారి కాంగ్రెస్ కు ఎదురీత తప్పదని తెలుస్తోంది. నిర్మల్ లో ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ  చైర్మన్ ఏలేటి మహేశ్వర్ రెడ్డి వన్ మ్యాన్ షో తో పార్టీని ముందుకు తీసుకువెళ్తున్నారు. ఆయన  బీఆర్ఎస్, బీజేపీలను దీటుగా ప్రోగ్రామ్స్​చేస్తున్నారు. అయితే, నియోజకవర్గంలోని చాలా మండలాల్లో కాంగ్రెస్  క్యాడర్ చేజారిపోవడంతో పార్టీ పునర్నిర్మాణం ఆయనకు సవాల్ గా మారింది. ముథోల్ లో ఆ పార్టీకి ఆశించిన స్థాయిలో నాయకత్వం లేకపోవడం పెద్ద లోటుగా చెబుతున్నారు. ఇక్కడి నుంచి పోటీ చేసేందుకు కూడా ఎవరూ ముందుకు వచ్చే పరిస్థితి లేదంటున్నారు. ఖానాపూర్ నియోజకవర్గంలో ఒకరిద్దరు నాయకులు ఈసారి కాంగ్రెస్ టికెట్ ఆశిస్తున్నప్పటికీ వారు అటు బీజేపీ, ఇటు బీఆర్​ఎస్​అభ్యర్థులకు సరిసమానంగా నిలవలేకపోవచ్చం టున్నారు. మొత్తానికి వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్​సత్తా చాటాలంటే మరింతగా శ్రమించక తప్పదు. 

హాట్​సీట్​..నిర్మల్​

నిర్మల్ నియోజకవర్గంలో కాంగ్రెస్​ గట్టి పోటీ ఇచ్చే అవకాశాలున్నాయి. ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్ ఏలేటి మహేశ్వర్ రెడ్డి పలు కార్యక్రమాలు నిర్వహిస్తూ కేడర్ లో ఉత్సాహాన్ని నింపుతున్నారు. ఇక్కడి నుంచి మరే నాయకుడు కాంగ్రెస్ నుంచి టికెట్ ఆశించే అవకాశం లేకపోవడంతో మహేశ్వర్ రెడ్డి పార్టీలో ఉంటే బెర్త్ ఖాయమైనట్టే. బీఆర్ఎస్​ నుంచి మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పోటీలో ఉంటారని చెబుతుండగా, ఈయనకు కూడా పోటీ లేకపోవడం కలిసి వస్తుందంటున్నారు. బీజేపీ నుంచి నలుగురు లీడర్లు టికెట్​ ఆశిస్తున్నారు. కొత్త వ్యక్తులు బీజేపీలో చేరి నిర్మల్​ టికెట్ ​ఆశించే చాన్స్​ ఉందని, దీంతో ఈ స్థానానికి పోటీ పెరుగుతుందన్న ప్రచారం జరుగుతోంది. ముథోల్​ స్థానానికి కూడా బీజేపీలో పోటీ ఉంది. ఇక్కడి నుంచి బరిలో నిలిచేందుకు ముగ్గురు లీడర్లు ఆసక్తిగా ఉన్నారు.  ఖానాపూర్ లో మాజీ ఎంపీ రాథోడ్ రమేశ్​తో పాటు పెంబి జడ్పీటీసీ జానకీ బాయి, హరినాయక్  బీజేపీ టికెట్ కోసం పోటీ పడుతున్నారు.  

నిర్మల్ ఎమ్మెల్యే అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి  (రాష్ట్ర అటవీ శాఖ మంత్రి)...

అనుకూల అంశాలు.. 

  •     వివాదాలకు దూరంగా ఉండడం.. అందరితో కలిసిపోవడం 
  •     నియోజకవర్గంలోనే ఎక్కువ రోజులు గడుపుతూ అభివృద్ధి కార్యక్రమాలతో పాటు ప్రైవేట్ కార్యక్రమాల్లో పాల్గొనడం. 
  •     అన్ని గ్రామాల్లో పెద్ద సంఖ్యలో దేవాలయాలను నిర్మించడం. 
  •     అభివృద్ధి కార్యక్రమాలకు భారీగా నిధులను కేటాయిస్తుండడం 
  •     మంత్రిగా ఉంటూ కూడా ప్రజలకు అన్నివేళలా అందుబాటులో ఉండడం. రాజకీయాలకతీతంగా అందరితో సఖ్యతగా ఉండడం

ప్రతికూల అంశాలు

  •     ఉద్యమకారులను, మొదటి నుంచి బీఆర్​ఎస్​లో కొనసాగిన వారిని దూరం పెట్టడం. 
  •     బంధువులు, అనుచరులపై భూ ఆక్రమణల ఆరోపణలు
  •     సీనియర్ నేతల్లో అసంతృప్తి
  •     పెండింగ్​ స్కీములు

ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖా నాయక్...

అనుకూల అంశాలు..

  •     బలమైన ప్రత్యర్థులు లేకపోవడం
  •     నియోజకవర్గంలో బలమైన కేడర్  

ప్రతికూల అంశాలు..

  •     ఎన్నికల  టైంలో ఇచ్చిన  హామీలు అమలు చేయకపోవడం
  •     సదర్ మాట్ ప్రత్యేక కాల్వ నిర్మాణం విషయంలో స్పందించకపోవడం 
  •     ప్రభుత్వ డిగ్రీ కాలేజీ ఏర్పాటు చేయకపోవడం
  •     అభివృద్ధి పనుల్లో కమిషన్ల వసూళ్ల ఆరోపణలు
  •     మున్సిపాలిటీ పరిధిలో అభివృద్ధి పనులు చేపట్టకపోవడం 
  •     అనుచరుల ఆగడాలు, భూకబ్జాలు, ఇసుక దందా ఆరోపణలు. దూకుడుగా వ్యవహరించడం

 ముథోల్ ఎమ్మెల్యే విఠల్​రెడ్డి  

అనుకూల అంశాలు...

  •     ప్రజల సమస్యలను ఓపికగా వినడం
  •     ప్రజలతో సంబంధాలు పెంచుకునేందుకు ప్రయత్నించడం 
  •     వ్యక్తిగతంగా ఎలాంటి ఆరోపణలు లేకపోవడం

ప్రతికూల అంశాలు

  •     ఇప్పటివరకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు పంపిణీ చేయకపోవడం 
  •     గుండెగాంవ్ ముంపు బాధితులకు పునరావాసం, పరిహారం అందజేయకపోవడం 
  •     గడ్డన్న వాగు ప్రధాన కాలువ చివరి ఆయకట్టు వరకు సాగునీరందించకపోవడం  
  •     నియోజకవ ర్గంలో అవసరమైన చోట వంతెనలు నిర్మించకపోవడం 
  •     బాసర ట్రిపుల్ ఐటీ సమస్యలను పూర్తిగా పరిష్కరించ లేకపోవడం 
  •     బాసర ఆలయ అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ పేరిట రూ.50 కోట్లను పూర్తి స్థాయిలో విడుదల చేయించకపోవడం
  •     భైంసా అల్లర్ల సమయంలో బాధితులను పట్టించుకోలేదన్న ఆరోపణలు