జనగామలో రాఖీ రాజకీయం.. పల్లా నివాసానికి క్యూ కట్టిన మహిళా ప్రజాప్రతినిధులు

జనగామలో రాఖీ రాజకీయం.. పల్లా నివాసానికి క్యూ కట్టిన మహిళా ప్రజాప్రతినిధులు

జనగామ జిల్లా రాజకీయాలు సర్వత్రా ఆసక్తి రేపుతున్నాయి. జనగామలో ఈసారి రాఖీ వేడుకలు రక్ష బంధన్ పాలిటిక్స్ గా మారాయి. జనగామ ప్రధాన కూడళ్లలో రక్ష బంధన్ శుభాకాంక్షలు తెలుపుతూ.. ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డికి సంబంధించిన ఫ్లెక్సీలు వెలిశాయి. ఎమ్మెల్సీ పల్లాకు సపోర్టు చేస్తూ.. జనగామ పట్టణంలోని పలు వీధుల్లో ఫ్లెక్సీలు కనిపిస్తున్నాయి. 

ఎమ్మెల్సీ పల్లాకు రాఖీ శుభాకాంక్షలు తెలిపేందుకు జనగామ నియోజకవర్గంలోని మహిళా ప్రజాప్రతినిధులు హైదరాబాద్  కు క్యూ కట్టారు. హైదరాబాద్ లోని పల్లా నివాసానికి వెళ్లి ఆయనకు రాఖీలు కట్టారు. అంతేకాదు.. పలువురు కౌన్సిలర్లు పల్లా నివాసంలో ఏర్పాటు చేసిన విందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వయంగా పల్లానే మహిళా ప్రజాప్రతినిధులకు వంటకాలు వడ్డించారు. దీనికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు జనగామ నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారాయి. సోషల్ మీడియాలోనూ ఫొటోలు వైరల్ గా మారాయి.

మరోవైపు... జనగామ టికెట్ ను బీఆర్ఎస్ అధినేత పెండింగ్ లో పెట్టారు. సిట్టింగ్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డికి ఇవ్వలేదు. దీంతో టికెట్ రేసులో ఎమ్మెల్సీలు పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డి ఉన్నారు. ఈ ఇద్దరిలో ఎవరికి టికెట్ దక్కుతుందనేది ఇప్పుడు ఆసక్తిని పెంచుతోంది. పల్లాకే ఎక్కువగా అవకాశాలు ఉన్నాయంటున్నారు. మరోవైపు.. టికెట్ రాకపోయేసరికి ఎమ్మెల్యే ముత్తిరెడ్డి బలప్రదర్శన చేస్తున్నారు. తనకు ఎందుకు టికెట్ ఇవ్వడం లేదని బీఆర్ఎస్ అధిష్టానాన్ని ప్రశ్నిస్తున్నారు. వేచిచూసే ధోరణిలోనే ఉన్నారు. చివరి నిమిషంలో అయినా తనకే టికెట్ దక్కుతుందని నమ్మకంగా ఉన్నారు.