చేర్యాల చైర్ పర్సన్, వైస్ చైర్మన్పై అవిశ్వాస రాజకీయం

చేర్యాల  చైర్ పర్సన్, వైస్ చైర్మన్పై అవిశ్వాస రాజకీయం
  •     ఇయ్యాల కలెక్టర్​కు నోటీసు ఇచ్చేందుకు కౌన్సిలర్ల సన్నాహాలు
  •     ఒక్కటైన బీఆర్ఎస్, కాంగ్రెస్ కౌన్సిలర్లు

సిద్దిపేట/చేర్యాల, వెలుగు :  చేర్యాల బల్దియాలో అవిశ్వాస రాజకీయం ఊపందుకుంది. చైర్ పర్సన్, వైస్ చైర్మన్ ను వ్యతిరేకిస్తున్న కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానానికి రెడీ అయ్యారు. గురువారం జిల్లా కలెక్టర్​ను కలసి చేర్యాల చైర్ పర్సన్, వైస్ చైర్మన్లపై అవిశ్వాస నోటీసు ఇవ్వనున్నట్లు సమాచారం. ఇద్దరినీ పదవుల నుంచి దించేసేందుకు బీఆర్ఎస్, కాంగ్రెస్​పార్టీలకు చెందిన 10 మంది కౌన్సిలర్లు ఏకమయ్యారు. నోటీసు ఇవ్వగానే అటు నుంచి అటే క్యాంపునకు వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.

2020 జనవరిలో కొత్తగా ఏర్పడిన చేర్యాల మున్సిపాలిటీకి ఎన్నికలు జరిగాయి. 12 స్థానాల్లో బీఆర్ఎస్ నుంచి 5 మంది, కాంగ్రెస్ నుంచి 5 మంది, ఇద్దరు ఇండిపెండెంట్లు గెలుపొందారు. ఎవరికీ మెజార్టీ రాకపోవడంతో బీఆర్ఎస్ ఇద్దరు ఇండిపెండెంట్లతో కలిసి చైర్మన్, వైస్ చైర్మన్ పదవులు కైవసం చేసుకుంది. చైర్మన్ పదవి మహిళలకు రిజర్వ్ కావడంతో స్వరూపా శ్రీధర్ రెడ్డికి పదవి ఇచ్చారు.  ఇండిపెండెంట్ గా గెలిచిన నిమ్మ రాజీవ్ రెడ్డిని వైస్ చైర్మన్ చేశారు.

ఇండిపెండెంట్ గా గెలిచిన జుబేదా ఖతూన్ కు కొంత కాలం తర్వాత కీలక పదవిని ఇస్తామని అప్పటి ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి హామీ ఇచ్చారు. తర్వాత పట్టించుకోలేదు. పైగా ఒకే సామాజిక వర్గానికి చైర్మన్, వైస్ చైర్మన్ పదవులు దక్కడం  కౌన్సిలర్లలో ఒకింత అసంతృప్తికి కారణమైంది. ఈ ఏడాది మొదట్లోనే కౌన్సిలర్లు అవిశ్వాసానికి సన్నాహాలు చేసినా,  అప్పటి ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి జోక్యంతో వెనక్కి తగ్గారు. ఇప్పుడు అవిశ్వాసానికి సన్నాహాలు మొదలు పెట్టారు. ముందు నోటీసు ఇచ్చి, తర్వాత చైర్ పర్సన్, వైస్ చైర్మన్ పదవులపై నిర్ణయం తీసుకోవాలని చూస్తున్నారు.