రాజకీయమంతా.. రైతన్న, నేతన్న చుట్టే...

రాజకీయమంతా.. రైతన్న, నేతన్న చుట్టే...
  •     బీజేపీ, బీఆర్‌‌ఎస్‌‌ పోటాపోటీ కార్యక్రమాలు
  •     ఇప్పటికే పొలం బాట పట్టిన మాజీ సీఎం కేసీఆర్‌‌
  •     ఇటీవల రైతు దీక్షకు దిగిన బండి సంజయ్‌‌, 10న నేతన్నలకు మద్దతు దీక్ష

కరీంనగర్, వెలుగు : రైతులు, చేనేత కార్మికులే కేంద్రంగా రాష్ట్ర రాజకీయాలు వేడెక్కుతున్నాయి. మరికొన్ని రోజుల్లో లోక్‌‌సభ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో బీజేపీ, బీఆర్‌‌ఎస్‌‌ పార్టీలు రైతులు, నేత కార్మికులకు సంబంధించిన సమస్యలనే తమ అస్త్రాలుగా మలుచుకుంటున్నాయి. ఎండిన పంటలను పరిశీలించడం, దీక్షలు చేయడం, కలెక్టర్లకు వినతిపత్రాలు ఇవ్వడం వంటి కార్యక్రమాల్లో ఇరు పార్టీల నాయకులు పోటాపోటీగా పనిచేస్తున్నారు. 

పొలం బాట పట్టిన కేసీఆర్‌‌

అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయాక సూర్యాపేట, కరీంనగర్‌‌ బహిరంగ సభల్లో మాట్లాడిన కేసీఆర్‌‌, మార్చి 31న తొలిసారిగా ఫామ్‌‌హౌజ్‌‌ నుంచి ప్రజల్లోకి వచ్చారు. ఇటీవల జనగామ, సూర్యాపేట జిల్లాల్లోని పలు గ్రామాల్లో పర్యటించిన కేసీఆర్‌‌ ఎండిన పంటలను పరిశీంచి, రైతులతో మాట్లాడుతున్నారు. శుక్రవారం కూడా కరీంనగర్, సిరిసిల్ల జిల్లాల్లో తిరిగి ఎండిన పొలాలను, మిడ్‌‌ మానేరును పరిశీలించారు.

 అనంతరం సిరిసిల్లలోని తెలంగాణ భవన్‌‌లో చేనేత కార్మికులతో సమావేశమై వారి ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. మరోవైపు రైతు సమస్యలపై ఇటీవల కరీంనగర్‌‌లో నిరసన దీక్ష చేపట్టిన బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్‌‌కుమార్‌‌, ఈ నెల 10న చేనేత కార్మికుల సమస్యలపై సిరిసిల్లలో దీక్షకు సిద్ధమవుతున్నారు. 

ఆరు గ్యారంటీల నుంచి రైతు, చేనేత సమస్యల వైపు..

అసెంబ్లీ ఎన్నికల తర్వాత కాంగ్రెస్‌‌ ఇచ్చిన ఆరు గ్యారంటీలపైనే ప్రధాన చర్చ జరిగింది. ప్రతిపక్ష పార్టీలు సైతం ఈ గ్యారంటీలనే అస్ర్తాలుగా విమర్శలు చేశారు. అయితే ఈ విషయంలో ప్రజల నుంచి పెద్దగా స్పందన రాలేదు. మూడు నెలల కిందే అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌‌కు ప్రజలు మరికొంత టైం ఇచ్చేందుకు సిద్ధపడ్డారని లీడర్లు గ్రహించారు. దీంతో తమ ఆందోళనను ఆరు గ్యారంటీల పైనుంచి రైతులు, చేనేత కార్మికుల సమస్యల వైపు డైవర్ట్‌‌ చేశారు. ఇందులో భాగంగానే అక్కడక్కడా ఎండిన పంటలను పరిశీలించడం, రైతులు, నేత కార్మికుల సమస్యలపై దీక్షలు చేయడం వంటి కార్యక్రమాలు చేడుతున్నారన్న చర్చ జరుగుతోంది. 

చేనేత సమస్యలపై పోటాపోటీ కార్యక్రమాలు

కరీంనగర్‌‌ లోక్‌‌సభ పరిధిలోని సిరిసిల్లలో చేనేత కార్మికులు అత్యధికంగా ఉండడంతో వారి ఓట్లే లక్ష్యంగా బీఆర్ఎస్, బీజేపీ నాయకులు పావులు కదుపుతున్నారు. వారి సమస్యలపై వేర్వేరుగా ఆందోళనలకు పిలుపునిస్తున్నారు. మాజీ సీఎం కేసీఆర్‌‌ పిలుపు మేరకు శనివారం సిరిసిల్ల జూనియర్‌‌ కాలేజీ గ్రౌండ్‌‌లో బీఆర్‌‌ఎస్‌‌ మద్దతుతో చేనేత కార్మికులు దీక్ష చేపట్టారు. ఈ నెల 10న ఉదయం 10 గంటలకు సిరిసిల్లలో బండి సంజయ్ సైతం దీక్ష చేపట్టేందుకు సిద్ధం అవుతున్నారు.

కార్యక్రమాల్లో కనిపించని రైతులు, రైతు సంఘాల నాయకులు

రైతు దీక్ష పేరిట బీఆర్‌‌ఎస్‌‌ నాయకులు చేపట్టిన దీక్షల్లో ఎక్కడా రైతులు, రైతు సంఘాల నాయకులు మాత్రం కనిపించడం లేదు. కేసీఆర్ శుక్రవారం కరీంనగర్ రూరల్ మండలం ముగ్దుంపూర్‌‌కు వచ్చిన టైంలో ఐదారుగురు రైతులు మినహా మిగతా వాళ్లంతా బీఆర్ఎస్‌‌ లీడర్లేనని పలువురు విమర్శిస్తున్నారు. పైగా ఆ గ్రామానికి చెందిన రైతులు, ప్రజలు కూడా పెద్దగా బయటికి రాలేదు. అయితే బీజేపీ, బీఆర్‌‌ఎస్‌‌ లీడర్ల రైతు రాజకీయంపై కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మంత్రులు సైతం గట్టిగానే స్పందిస్తున్నారు.