పుల్వామాపై పాలిటిక్స్

పుల్వామాపై పాలిటిక్స్

ఆ దాడితో ఎవరికి ప్రయోజనమన్న రాహుల్  ఇందిర, రాజీవ్​ హత్యలతో లాభపడిందెవరో చెప్పాలన్న బీజేపీ

న్యూఢిల్లీ‘పుల్వామా’ ఘటన పొలిటికల్​ రంగు పూసుకుంది. దాడి జరిగి ఏడాదైన సందర్భంగా అధికార బీజేపీ, ప్రతిపక్షాలు ‘పుల్వామా’పై శుక్రవారం మాటల దాడికి దిగాయి. పుల్వామా ఘటనతో ఎవరు ఎక్కువగా ప్రయోజనం పొందారంటూ కాంగ్రెస్ ఎంపీ రాహుల్​ గాంధీ వివాదాస్పద కామెంట్స్ చేశారు. దీనిపై అధికార బీజేపీ నేతలు విరుచుకుపడ్డారు. దేశమంతా అమరవీరుల త్యాగాలను గుర్తుచేసుకుంటుంటే.. రాహుల్​ మాత్రం వారిని అవమానించడం సిగ్గుచేటని మండిపడ్డారు. ప్రభుత్వాన్నే కాదు.. సైనికులను టార్గెట్​ చేసుకుని రాహుల్​ విమర్శిస్తున్నారని ఆరోపించారు. అమరులను అవమానించడం కాంగ్రెస్ కు కొత్తకాదని అన్నారు. రాహుల్​ గాంధీ లష్కరే తోయిబా, జైషే మహ్మద్​ సానుభూతిపరుడని విమర్శలు గుప్పించారు.

హామీల అమలు ఎన్నడు?

బీజేపీ ప్రభుత్వం తన ఓటు బ్యాంకు సెక్యూరిటీ కోసమే తప్ప నేషనల్​ సెక్యూరిటీ గురించి ఆలోచించదని కాంగ్రెస్ పార్టీ విమర్శించింది. పుల్వామా అమరవీరుల కుటుంబాల్లో ఒకరికి గవర్నమెంట్ జాబ్, రూ.25 లక్షల పరిహారం ఇస్తామన్న హామీ ఇప్పటికీ నిలబెట్టుకోలేదని ఆరోపించింది. ‘ప్రచారానికి రూ.4500 కోట్లు, ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్​షాలకు ఎస్పీజీ సెక్యూరిటీ కోసం రూ.1.5 కోట్లు ఖర్చు పెట్టేందుకు ప్రభుత్వం దగ్గర డబ్బులు ఉంటాయి,​ కానీ పుల్వామా అమరవీరుల కుటుంబాలకు ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు మాత్రం డబ్బుల్లేవా? అని కాంగ్రెస్ నిలదీసింది. పుల్వామా దాడిలో కన్నుమూసిన జవాన్లకు పార్టీలకు అతీతంగా నేతలు నివాళులు అర్పించారు. దేశంకోసం నేలకొరిగిన సైనికులను ప్రజలు ఎన్నటికీ మరిచిపోలేరని సీపీఎం పేర్కొంది. అయితే, దాడికి సంబంధించి ఏర్పాటు చేసిన విచారణ కమిటీ ఏం తేల్చింది? కట్టుదిట్టమైన సెక్యూరిటీ ఉండే ఏరియాలోకి 80 కిలోల ఆర్డీఎక్స్ ను టెర్రరిస్టులు ఎలా తీసుకురాగలిగారో తేల్చాలని డిమాండ్​ చేసింది. పుల్వామా దాడికి బాధ్యత ఎవరిదని, ఎవరి వైఫల్యం వల్ల ఈ దాడి జరిగిందని ప్రశ్నించింది. ప్రాణత్యాగం చేసిన సోల్జర్లను గుర్తుంచుకోవాల్సిందే కానీ ఆ దాడిని ఆపడంలో చోటుచేసుకున్న  ఫెయిల్యూర్​ను మాత్రమే తాను ప్రశ్నిస్తున్నానని సీపీఎం పొలిట్​బ్యూరో సభ్యులు మొహ్మద్​ సలీమ్​అన్నారు.

పుల్వామాలో ఏంజరిగింది?

పుల్వామా దాడి జరిగి ఏడాది గడిచింది. గతేడాది ఫిబ్రవరి 14న టెర్రరిస్టులు జరిపిన ఈ దాడిలో 40 మంది సైనికులు చనిపోయారు. కాశ్మీర్​లోని పుల్వామా దగ్గర్లో సైనికులు ప్రయాణిస్తున్న వాహనాన్ని జైషే మొహమ్మద్​ టెర్రరిస్ట్ తన జీప్ తో ఢీ కొట్టి, తనను తాను పేల్చేసుకున్నడు. భారీ పేలుడు సంభవించడంతో 40 మంది సీఆర్​పీఎఫ్ జవాన్లతో ప్రయాణిస్తున్న ఆర్మీ వెహికిల్​ తునాతునకలుగా మారిపోయింది. సైనికుల మృతదేహాలు ఛిద్రమయ్యాయి.

ప్రముఖుల నివాళి

ఈ దారుణం జరిగి ఏడాది గడిచిన సందర్భంగా దేశం అమరవీరులను తలుచుకుంది. పుల్వామా అమరులకు ప్రధాని నరేంద్ర మోడీ సహా ప్రముఖులు నివాళులు అర్పించారు. కేంద్ర మంత్రులు రాజ్​నాథ్​ సింగ్, స్మృతి ఇరానీ, హర్దీప్​ పూరి, ఢిల్లీ సీఎం అరవింద్​ కేజ్రీవాల్, కాంగ్రెస్ నేత రాహుల్​ గాంధీ తదితరులు నివాళులు అర్పించారు.

అమరులను దేశం మరవదు: మోడీ

‘పుల్వామాలో గతేడాది జరిగిన టెర్రర్​ అటాక్​లో అమరులైన సైనికులకు నివాళులు అర్పిస్తున్నా.. వాళ్లు దేశ సేవకే జీవితాన్ని అంకితంచేసి, దేశ రక్షణలో ప్రాణత్యాగంచేసిన అసాధారణ వ్యక్తులు. వారి త్యాగాన్ని దేశం ఎన్నటికీ మరువదు’ అని ప్రధాని ట్వీట్​ చేశారు.

మెమోరియల్​ అక్కర్లే: మొహ్మద్​ సలీమ్

‘మన అసమర్థతను గుర్తుచేసే పుల్వామా ఘటనకు  స్మారకం అవసరంలేదు. 80 కేజీల ఆర్‌‌డీఎక్స్  ఇంటర్నేషనల్​ బోర్డర్​ దాటి కట్టుదిట్టమైన మిలట్రీ జోన్‌‌లోకి ఎలా వచ్చిందనేది తెలియాల్సి ఉంది’

అమరవీరులకు సెల్యూట్: రణదీప్​ సింగ్​ సూర్జేవాలా

‘అమరవీరుల త్యాగాలకు సెల్యూట్​. అయితే చాలాప్రశ్నలకు సమాధానాల్లేవు. పుల్వామా ఎటాక్​పై ఏర్పాటుచేసిన కమిటీ రిపోర్ట్​ను బహిరంగ పరచడంలో ప్రభుత్వం ఎందుకు డౌట్​పడుతోంది?  ఆర్డీఎక్స్, ఐఈడీలను టెర్రరిస్టులు ఎలా తీసుకొచ్చారు?’

ఏడాది గడిచింది.. రిపోర్ట్​ ఏది?: సీతారాం ఏచూరి

ఏడాది గడిచినా పుల్వామా ఎటాక్​పై నియమించిన కమిటీ రిపోర్ట్​ ఎక్కడుంది? అంతమంది చనిపోవడానికి బాధ్యులెవరు? పుల్వామా అమరులపేరుతో మోడీ, బీజేపీ నేరుగానే  ఓట్లడిగారు?  అటాక్​ నుంచి బయటపడ్డవాళ్ల కోసం ఏం చేశారు?.  దేశంకోసం ప్రాణాలు ధారపోసిన సోల్జర్ల కుటుంబాలకు ఏం చేశారు?

టెర్రరిజంపై ఒక్కటిగా పోరాడుతం: రాజ్​నాథ్​ సింగ్

‘పుల్వామా దాడిలో అమరులైన సోల్జర్ల త్యాగాన్ని దేశం ఎన్నటికీ మరువదు. టెర్రరిజంపై పోరులో దేశం మొత్తానిదీ ఒకే మాట.. ఇలాంటి దాడులను నిరోధించడానికి, టెర్రరిస్టులపై పోరుకు ప్రభుత్వం కట్టుబడి ఉంది’

టెర్రరిజాన్ని వేళ్లతో సహా తొలగించాలి: జేపీ నడ్డా

‘పుల్వామా అమరులను దేశం ఎన్నటికీ మరువదు.. టెర్రరిజాన్ని అంతంచేయాలంటే దానిని కూకటివేళ్లతో తొలగించాలి.

ఇదీ రాహుల్ ట్వీట్‌‌

‘పుల్వామా ఎటాక్​లో ప్రాణాలు కోల్పోయిన 40 మంది సీఆర్పీఎఫ్​ అమరవీరులను ఇవాళ మనం గుర్తుచేసుకుంటున్నాం. ఈ సందర్భంగా మనం అడగాల్సిన ప్రశ్నలు.. 1. ఈ ఎటాక్​తో ఎవరికి ఎక్కువ ప్రయోజనం కలిగింది? 2.  దాడిపై జరిపించిన ఎంక్వైరీలో ఏంతేలింది? 3.  దాడికి కారణమైన సెక్యూరిటీ లోపాలకు బీజేపీ సర్కార్​లో ఎవరు బాధ్యత వహిస్తున్నారు?’.

ఇదీ మీనాక్షీ కౌంటర్

ఇందిరా గాంధీ, రాజీవ్​ గాంధీల హత్యలతో లాభపడిందెవరో మొదట మీరు చెప్పండి.. అంటూ రాహుల్​ గాంధీని బీజేపీ నేత మీనాక్షీ లేఖి ట్విట్టర్లో ప్రశ్నించారు. పుల్వామా దాడి నుంచి ఎక్కువగా ప్రయోజనం పొందిందెవరు అంటూ రాహుల్​ చేసిన ట్వీట్​కు లేఖి కౌంటర్​ ఇచ్చారు. ‘పుల్వామా అటాక్ ను ఉద్దేశించి రాహుల్​ వాడిన పదాలు అత్యంత ఘోరమైనవి’ అని ఆమె మండిపడ్డారు.

మరిన్ని వార్తల కోసం