డిగ్రీ పూర్తి చేయని స్మృతి ఇరానీ..ఆస్తుల వివరాలు

డిగ్రీ పూర్తి చేయని స్మృతి ఇరానీ..ఆస్తుల వివరాలు

అమేథీ: మధ్యప్రదేశ్ సీఎం కమల్ నాథ్ సన్నిహితుడి ఇంట్లో ఐటీ దాడుల్లో రూ.280 కోట్లు పట్టుబడితే కాంగ్రెస్ ప్రెసిడెంట్ రాహుల్ గాంధీ ఎందుకు మౌనంగా ఉన్నారని కేంద్రమంత్రి స్మృతి ఇరానీ ప్రశ్నించారు. కాంగ్రెస్ నాయకులు ప్రజాధనం లూటీ చేస్తున్నారని ఆరోపించారు. ప్రజలు అభివృద్ధికి మరోసారి ఓటేస్తారని, మోడీ మళ్లీ ప్రధాని అవుతారని ఆమె ధీమా వ్యక్తం చేశారు. గురువారం అమేథీ లోక్ సభ స్థానంలో బీజేపీ అభ్యర్థిగా ఆమె నామినేషన్ దాఖలు చేశారు. అంతకు ముందు రాహుల్ గాంధీ నామినేషన్ వేసేందుకు రోడ్ షో నిర్వహించిన రూట్ లోనే ఆమె రోడ్ షో నిర్వహించారు. స్మృతి ఇరానీతో పాటు రోడ్ షోలో ఆమె భర్త జుబిన్, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ పాల్గొన్నారు. రోడ్ షోకు పెద్దఎత్తున బీజేపీ కార్యకర్తలు తరలివచ్చారు. స్మృతి ఇరానీ నాలుగు సెట్ల నామినేషన్ పత్రాలను సమర్పించారు. 2014 ఎన్ని కల్లో అమేథీ నుంచి పోటీ చేసిన స్మృతి ఇరానీ లక్ష ఓట్ల తేడాతో రాహుల్ గాంధీ చేతిలో ఓడిపోయారు. మరోసారి రాహుల్  గాంధీతో  పోటీ పడుతున్నారు.

ఆస్తులు రూ. 4.71 కోట్లు

తన ఆస్తుల విలువ రూ.4.71 కోట్లని స్మృతి ఇరానీ ఎన్నికల అఫిడవిట్ లో ప్రకటించారు. చరాస్తులు రూ.1.75 కోట్లు, స్థిరాస్తులు రూ. 2.96 కోట్లుగా ఆమె వెల్లడించారు. రూ. 1.45 కోట్లు విలువైన వ్యవసాయ భూమి, ఒకటిన్నర కోట్ల విలువైన రెసిడెన్షియల్ భవనం ఉన్నట్లు పేర్కొన్నారు. బ్యాంకుల్లో రూ. 89 లక్షలు, చేతిలో రూ. 6.24 లక్షలు, నేషనల్ సేవింగ్స్ స్కీమ్, పోస్టల్ ఇన్సూరె న్స్ లో రూ. 18 లక్షలు, ఇతర పెట్టుబడులు రూ. 1.05 లక్షలు ఉన్నట్లు పేర్కొన్నారు. రూ. 13.14 లక్షలు విలువైన వాహనాలు, రూ.21 లక్షలు విలువైన నగలు ఉన్నాయని, తనపై ఎలాంటి కేసులు, అప్పులు లేవని వెల్లడించారు. 1991లో టెన్త్, 1993 లో ఇంటర్, 1994లో ఢిల్లీ యూనివర్సిటీలో దూరవిద్య ద్వారా బీకాం (పార్ట్ 1) పూర్తి చేసినట్లు పేర్కొన్నారు .

2004 ఎన్నికల సమయంలో ఢిల్లీ చాందినీ చౌక్‌ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన స్మృతి ఇరానీ తాను 1996లో ఢిల్లీ యూనివర్సిటీ నుంచి బీఏ పట్టా పొందినట్టు అఫిడవిట్ లో పేర్కొన్నారు. ఆ సమయంలో బీఏ పట్టా పొందినట్టు తప్పుడు వివరాలు పొందుపర్చారని విపక్షాలు ఆరోపించాయి. 2014లో అమేథీ నుంచి బరిలో నిలిచిన సమయంలో బీకామ్‌ కోసం 1994లో ఢిల్లీ యూనివర్సిటీ దూర్య విద్యలో ప్రవేశం పొందినట్టు సమాచారం ఇచ్చారు. దీంతో గత కొన్ని సంవత్సరాలుగా విపక్షాలు స్మృతిపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నాయి. అయితే తాజా ఆఫిడవిట్‌లో మాత్రం 2014లో మాదిరి తాను దూరవిద్యలో బీకామ్‌కు కోర్సు చేసాను కానీ అది పూర్తి చేయలేదని అఫిడవిట్ లో పేర్కొన్నారు.