రాష్ట్ర, జాతీయ రాజకీయాలపై కేసీఆర్, పీకే చర్చలు

రాష్ట్ర, జాతీయ రాజకీయాలపై కేసీఆర్, పీకే చర్చలు
  • ప్రశాంత్​ కిశోర్​తో కలిసి వచ్చిన ప్రకాశ్​ రాజ్​

  • పాలనపై ప్రజల ఫీడ్​బ్యాక్​ను సీఎంకు ఇచ్చిన పీకే

  • ఫాం హౌస్​లో కేసీఆర్​, పీకే భేటీ

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: సీఎం కేసీఆర్‌‌‌‌తో వరుసగా రెండురోజులు ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌‌‌‌ కిశోర్‌‌‌‌  భేటీ అయ్యారు. టీఆర్​ఎస్​ పాలనపై ప్రజలు ఏమనుకుంటున్నారనే ఫీడ్​ బ్యాక్​ ఆయన ఇచ్చినట్లు తెలిసింది. మూడు రోజులుగా రాష్ట్రంలో పర్యటిస్తున్న పీకే.. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మల్లన్నసాగర్‌‌‌‌, కొండపోచమ్మసాగర్‌‌‌‌ రిజర్వాయర్లను  శనివారం పరిశీలించారు. అదే రోజు ఎర్రవల్లిలోని ఫాంహౌస్‌‌‌‌లో సినీనటుడు ప్రకాశ్‌‌‌‌రాజ్‌‌‌‌తో కలిసి కేసీఆర్​తో భేటీ అయ్యారు. ఆదివారం విడిగా సీఎంతో సమావేశమయ్యారు. వరుసగా రెండు రోజులు పీకేతో కేసీఆర్‌‌‌‌ లంచ్‌‌‌‌ చేసినట్టుగా టీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ నేతలు చెప్తున్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ పార్టీని గట్టెక్కించడానికి పీకే ఒప్పందం చేసుకున్నారు. ప్రశాంత్‌ కిషోర్‌కు చెందిన ఐప్యాక్‌‌ టీం ఇప్పటికే రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో పర్యటించి, కేసీఆర్ సర్కారుపై ఫీడ్‌‌బ్యాక్‌‌ సేకరించింది. పీకే స్వయంగా కొన్ని చోట్లకు వెళ్లి ప్రభుత్వంపై ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుసుకున్నారు. ఈ వివరాలన్నీ లంచ్‌‌ మీటింగ్‌‌లో కేసీఆర్‌‌కు వివరించినట్టు తెలుస్తోంది. జాతీయ స్థాయిలో ప్రత్యామ్నాయ రాజకీయ వేదిక ఏర్పాటు, కేసీఆర్ ముంబై టూర్‌‌పై వచ్చిన ఫీడ్‌‌బ్యాక్‌‌పైనా చర్చించినట్టు సమాచారం. 

జనంలో తిరిగి ఫీడ్​బ్యాక్.. ​

కేంద్రంలో బీజేపీకి ప్రత్యామ్నాయంగా రాజకీయ కూటమి ఏర్పాటు కోసం పీకే ప్రయత్నిస్తున్నారు. ఈక్రమంలోనే పలు రాష్ట్రాల సీఎంలు, వివిధ పార్టీల అధినేతలను ఆయన కలిసి చర్చలు జరిపారు. ఇదే ఎజెండాతో సీఎం కేసీఆర్‌‌ గత వారం ముంబై వెళ్లారు. మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్‌‌ థాక్రే, ఎన్సీపీ చీఫ్‌‌ శరద్‌‌ పవార్‌‌తో కేసీఆర్​  సమావేశమై ప్రత్యామ్నాయ రాజకీయాలపై చర్చించారు. అప్పుడు కేసీఆర్‌‌ టూర్‌‌లో సినీనటుడు ప్రకాశ్‌‌ రాజ్‌‌ సెంటర్‌‌ ఆఫ్‌‌ అట్రాక్షన్‌‌గా నిలిచారు. బీజేపీకి ప్రత్యామ్నాయ కూటమి ఏర్పాటుకు టీఆర్‌‌ఎస్‌‌ ప్రత్యేకంగా టీమ్​ను ఏర్పాటు చేస్తున్నది. ఈ టీంలో ప్రకాశ్‌‌రాజ్‌‌కు కీలక బాధ్యతలు ఇస్తారని టీఆర్​ఎస్​ నేతలు చెప్తున్నారు. త్వరలో ఖాళీ అయ్యే రాజ్యసభ స్థానం నుంచి ఆయనను పార్లమెంట్‌‌కు పంపుతారని అంటున్నారు. ఈ క్రమంలోనే ప్రకాశ్‌‌ రాజ్‌‌ గజ్వేల్‌‌లో పర్యటించి ఫాం హౌస్‌‌లో కేసీఆర్‌‌ను కలిసినట్లు ప్రచారం జరుగుతున్నది. ప్రకాశ్‌‌రాజ్‌‌ వెంటే గజ్వేల్‌‌కు వెళ్లిన ప్రశాంత్​ కిశోర్​.. మీడియా ఎదుట పడకుండా వివిధ వర్గాల ప్రజలను కలిశారు. కూరగాయల మార్కెట్​, ఎడ్యుకేషనల్​ హబ్​, ఆర్​ అండ్​ బీ కాలనీలో ఇద్దరూ కలియతిరిగారు. కేసీఆర్​ పాలనపై ప్రజల నుంచి అభిప్రాయం సేకరించారు.  

పీకేకు ఎన్డీఏయేతర పార్టీల సమావేశం బాధ్యత

ఎన్డీఏయేతర పార్టీల సీఎంలు, పార్టీ చీఫ్‌‌లతో త్వరలోనే సమావేశం నిర్వహించే ప్రయత్నాల్లో కేసీఆర్ ఉన్నట్టు టీఆర్‌‌ఎస్‌‌ వర్గాలు చెప్తున్నాయి. అసెంబ్లీ బడ్జెట్​ సమావేశాలకు ముందే కేసీఆర్‌‌ ఢిల్లీకి వెళ్లాలని అనుకున్నా.. ఆయా రాష్ట్రాల సీఎంలు, పార్టీ చీఫ్‌‌ల అపాయింట్‌‌మెంట్‌‌ ఖరారు కాకపోవడంతో వాయిదా వేసుకున్నట్టు తెలుస్తున్నది. సీఎంలు, పార్టీ అధ్యక్షులతో మాట్లాడి వారితో సమావేశం ఏర్పాటు చేసే బాధ్యత కూడా ప్రశాంత్​ కిశోర్​కే అప్పగించినట్టు టీఆర్‌ఎస్​ నేతలు చెప్తున్నారు. రిటైర్డ్‌‌ బ్యూరోక్రాట్ల కాన్‌‌క్లేవ్‌‌పైనా పీకే చర్చించినట్టు తెలిసింది. తెలంగాణలో అమలవుతున్న రైతుబంధు, రైతుబీమా, కళ్యాణలక్ష్మీ, ఆసరా పింఛన్‌‌లు, ఇతర స్కీంలపై జాతీయ స్థాయిలో చర్చ జరిగేలా సోషల్‌‌ మీడియా క్యాంపెయిన్‌‌ ఇప్పటికే మొదలుపెట్టారు. మూడేండ్ల వ్యవధిలోనే కాళేశ్వరం కట్టి లక్షలాది ఎకరాలకు నీళ్లు ఇస్తున్నామని చెప్తున్నారు. వీటిని జాతీయ ప్రత్యామ్నాయ కూటమి ఎజెండాలుగా చేయాలని పీకేకు కేసీఆర్‌‌ సూచించినట్టు తెలిసింది. ప్రజలు ఎలాంటి ఫీడ్‌‌బ్యాక్‌‌ ఇచ్చినా ఉన్నది ఉన్నట్టు చెప్పాల్సిందిగా పీకేతో అన్నట్లు సమాచారం. ప్రభుత్వంపై ఏయే వర్గాల్లో వ్యతిరేకత ఉంది.. వాటిని అధిగమించడానికి ఎలాంటి చర్యలు చేపట్టాలనే దానిపైనా చర్చించినట్టుగా తెలిసింది. సోషల్‌‌ మీడియాలో బీజేపీని దీటుగా ఎదుర్కోవడానికి ఎలాంటి ప్రయత్నాలు చేయాలి.. రాష్ట్రంలోని ఏయే ప్రాంతాల్లో టీఆర్‌‌ఎస్‌‌కు ఏ పార్టీల నుంచి గట్టిపోటీ ఉంది.. అనే అంశాలు ప్రస్తావనకు వచ్చినట్టు సమాచారం.

మరిన్ని వార్తల కోసం..

ఉక్రెయిన్పై రష్యా యుద్ధం: లైవ్ అప్ డేట్స్

పోస్ట్ ఆఫీసులో డబ్బులు చోరీ చేసిన దొంగ అరెస్ట్

దమ్మున్న నాయకుడుంటే ఏదీ అసాధ్యం కాదు