రష్యా అధ్యక్ష ఎన్నికలకు కేరళలో పోలింగ్

రష్యా అధ్యక్ష ఎన్నికలకు కేరళలో పోలింగ్

తిరువనంతపురం/మాస్కో: కేరళలో నివసిస్తున్న రష్యా పౌరులు తమ దేశ అధ్యక్ష ఎన్నికల్లో పాల్గొన్నారు. రష్యా అధ్యక్ష ఎన్నికల కోసం నిర్వహించిన పోలింగ్ లో వారు ఓటువేశారు. రష్యా పౌరులతో పాటు కేరళలో పర్యటిస్తున్న రష్యన్  టూరిస్టులు కూడా ఓటు హక్కును ఉపయోగించుకున్నారు. తిరువనంతపురంలోని రష్యన్  హౌస్, ఆనరరీ కాన్సులేట్  ఆఫ్​  రష్యన్  ఫెడరేషన్ లో ఈ ఎన్నికల కోసం అధికారులు ఏర్పాట్లు చేశారు. రష్యా అధ్యక్ష ఎన్నికల కోసం కేరళలో పోలింగ్ ఏర్పాట్లు చేయడం ఇది మూడోసారని తిరువనంతపురంలోని రష్యా ఆనరరీ కాన్సుల్, రష్యన్ హౌస్  డైరెక్టర్  రతీశ్  నాయర్ తెలిపారు. ఈ పోలింగ్​లో పాల్గొన్న రష్యన్లకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. 

కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవడానికి నిర్వహిస్తున్న ఎన్నికల్లో వారు ఎంతో ఉత్సాహంగా పాల్గొని తమ ఓటుహక్కు వినియోగించుకున్నారని చెప్పారు. అలాగే, రష్యన్  ఫెడరేషన్  సెంట్రల్  ఎలక్షన్  కమిషన్ లో భాగం అయినందుకు సంతోషంగా ఉందన్నారు. తమ కోసం ఏర్పాట్లు చేసిన రష్యా కాన్సులేట్ తో పాటు దేశంలోని కాన్సులేట్ జనరల్ కూ రష్యన్లు థ్యాంక్స్  చెప్పారు. ఎక్కడ ఉన్నా ఓటు వేయడం తమ బాధ్యత అని ఉలియా అనే రష్యన్  పౌరురాలు తెలిపింది. 

చెన్నై నుంచి ఈ అవకాశం కల్పించిన ఇండియాలోని కాన్సులేట్  జనరల్ కు ఆమె కృతజ్ఞతలు తెలిపింది. కాగా, ఈ నెల 15 నుంచి 17 వరకు రష్యా అధ్యక్ష ఎన్నికల పోలింగ్  నిర్వహిస్తున్నారు. ఈ ఎన్నికల్లో ప్రెసిడెంట్ వ్లాదిమిర్  పుతిన్ పై ముగ్గురు అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. లిబరల్  డెమోక్రటిక్  పార్టీ నుంచి లియోనిడ్  స్లట్ స్కై, న్యూ పీపుల్  పార్టీ నుంచి వ్లాదిస్లావ్  దావన్ కోవ్, కమ్యూనిస్ట్  పార్టీ నుంచి నికోలే ఖరిత్ నోవ్  పోటీ చేస్తున్నారు.