కలుషితమవుతున్న జలాలు.. తగ్గిపోతున్న ఆక్సిజన్​ లెవల్స్​

కలుషితమవుతున్న జలాలు.. తగ్గిపోతున్న ఆక్సిజన్​ లెవల్స్​
  • పొల్యూషన్​ బారిన రాష్ట్రంలోని 9  నదులు 
  • అత్యంత కలుషిత రివర్​గా మూసీ 
  • రెండు, మూడు, నాలుగు స్థానాల్లో గోదావరి, మానేరు, నక్కవాగు
  • కిన్నెరసాని, మంజీరా, మున్నేరు,  కరకవాగు, కృష్ణా నీళ్లూ కలుషితం
  • రివర్​ వాటర్ క్వాలిటీ రిపోర్టులో సీపీసీబీ వెల్లడి

కరీంనగర్, వెలుగు: ఇష్టారాజ్యంగా చెత్తాచెదారం, వ్యర్థాలు వదలడంతో రాష్ట్రంలోని ప్రధాన నదులు కాలుష్యం బారినపడుతున్నాయి. నదీ జలాల్లో ఏటేటా ఆక్సిజన్  లెవల్స్ తగ్గిపోతున్నాయి. ఫలితంగా అందులోని జీవరాశులు మృత్యువాతపడుతున్నాయి. నదీ తీర ప్రాంతాలు కంపుకొడుతున్నాయి. రాష్ట్రంలోని 12 నదుల్లో 9 నదుల నీళ్లు కాలుష్యం బారినపడినట్లు.. వీటిలో బయోకెమికల్ ఆక్సిజన్ డిమాండ్ (బీవోడీ)  పెరుగుతున్నట్లు సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు (సీపీసీబీ) వెల్లడించింది.

పొల్యూషన్ బారినపడిన నదుల్లో ఉమ్మడి కరీంనగర్ జిల్లా మీదుగా ప్రవహించే గోదావరి, మానేరుతోపాటు ఇతర జిల్లాల్లో ప్రవహించే మూసీ, కరకవాగు, కిన్నెరసాని, కృష్ణా, మంజీర, మున్నేరు, నక్కవాగు ఉన్నాయి. ‌రాష్ట్రంలోని 12 నదుల నీటి నాణ్యతను 49 వేర్వేరు ప్రాంతాల్లో పరిశీలించిన సీపీసీబీ.. ఇటీవల ‘‘పొల్యూటెడ్ రివర్ స్ట్రెచెస్ ఫర్ రీస్టోరేషన్ ఆఫ్ వాటర్ క్వాలిటీ– 2022’’ పేరిట రిపోర్ట్​ను విడుదల చేసింది. రాష్ట్రంలో నదీ జలాల క్వాలిటీని పరిశీలించేందుకు గండిపేట, నాగోల్, ప్రతాప్ సింగారం, కాసానిగూడ(మూసీ), వాడపల్లి (కృష్ణా), గౌడిచెర్ల (మంజీర), గండిలచ్చపేట, సేవాలాల్ తండా (నక్కవాగు), పాల్వంచ (కరకవాగు, కిన్నెరసాని), కరీంనగర్ మున్సిపల్ డంప్ సైట్, సోమన్‌‌పల్లి (మానేరు), మంచిర్యాల, బాసర(గోదావరి) తదితర చోట్ల ఏర్పాటు చేసిన నేషనల్ వాటర్ క్వాలిటీ మానిటరింగ్ ప్రోగ్రాం(ఎన్ డబ్ల్యూఎంపీ) స్టేషన్ల ద్వారా ఈ డేటాను తీసుకుంది. 

ఐదు ప్రయార్టీలుగా నదుల జాబితా..! 

లీటర్ నీటిలో బయోకెమికల్ ఆక్సిజన్ డిమాండ్ (బీవోడీ) 3 మిల్లీగ్రాముల కంటే మించి ఉంటే వాటిని కలుషిత జలాలుగా నిర్ధారిస్తారు. నదీ జలాల్లో బయో కెమికల్ ఆక్సిజన్ డిమాండ్ ను బట్టి దేశంలోని నదులను సీపీసీబీ ఐదు ప్రయార్టీలుగా విభజించింది. ఇందులో బీవోడీ ఒక లీటర్ నీటిలో 30 మిల్లీగ్రాముల కంటే ఎక్కువగా ఉంటే.. ఆ నదిని ఫస్ట్ ప్రయార్టీలో, బీవోడీ 20 నుంచి 30 మధ్య ఉంటే రెండో ప్రయార్టీలో, 10 నుంచి 20 మధ్య ఉంటే మూడో ప్రయార్టీలో, 6 నుంచి 10 మధ్య ఉంటే ఫోర్త్ ప్రయార్టీలో, 3 నుంచి 6 మధ్య ఉంటే ఫిఫ్త్​ ప్రయార్టీలో చేరుస్తారు.

3లోపు ఉంటే కలుషిత నది జాబితాలోకి రాదు. నీటి నాణ్యతను ఇలా చూసినప్పుడు కలుషితమైన నదుల జాబితాలో 66 బీవోడీతో అత్యంత కలుషితమైన నదిగా మూసీ నమోదు కాగా..  24  బీవోడీతో సెకండ్ ప్రయార్టీలో గోదావరి నది చేరింది. 16 బీవోడీతో మానేరు, 11 బీవోడీతో నక్కవాగు థర్డ్ ప్రయార్టీలో చేరాయి. ఫిఫ్త్​ ప్రయార్టీలో కిన్నెరసాని(6.0), మంజీరా(6.0), మున్నేరు(6.0),  కరకవాగు(4.0), కృష్ణా(3.2) నదులు ఉన్నాయి. ఐదు ప్రయార్టీల్లో మన తొమ్మిది నదులు ఉండటంతో.. అవి కాలుష్యం బారినపడినట్లు స్పష్టమవుతున్నది. 

మురికి కూపంలా మూసీ

అనంతగిరి కొండల్లో పుట్టిన మూసీ నది 95 కి.మీ. ప్రవహించి బాపూఘాట్‌‌‌‌ వద్ద హైదరాబాద్ సిటీలోకి ప్రవేశిస్తుంది. అక్కడి నుంచి ప్రతాప్ సింగారం వరకు సిటీలో 44 కి.మీ. మేర ప్రవహిస్తుంది. ఇండస్ట్రీలు, షాపులు, ఇండ్ల నుంచి విడుదలయ్యే వ్యర్థ జలాలు నదిలో కలవడంతో మూసీ మురికి కూపంగా మారిపోతున్నది. మూసీ నది ప్రవహించే మూసారాంబాగ్ బ్రిడ్జి ఏరియాలో అత్యధికంగా లీటర్ నీటిలో 66 బయోకెమికల్​ ఆక్సిజన్​ డిమాండ్​ (బీవోడీ) నమోదవ్వగా.. నల్గొండ జిల్లాలోని కాసానిగూడ బ్రిడ్జి వద్ద తక్కువగా 5.6 బీవోడీ నమోదైంది.

సిటీ శివారులోని ఫార్మా, బల్క్ డ్రగ్,  కెమికల్ ఇండస్ట్రీల నుంచి మూసీ నదిలోకి వదులుతున్న వ్యర్థాల వల్లే ఈ స్థాయిలో కలుషితం అవుతున్నట్లు తెలుస్తున్నది. సిటీ వ్యర్థాలతో భయంకరమైన కాలుష్యాన్ని మోసుకెళ్తున్న మూసీ నది దిగువన ఉన్న నల్గొండ జిల్లాలో రైతులు పండించే పంటలను, తాగే నీళ్లను కలుషితం చేస్తున్నది.

డంపింగ్ యార్డుతో మానేరు కలుషితం

మూసీ నదిలాగే వ్యర్థాల కారణంగా మానేరు నదీ జలాలు కలుషితమవుతున్నాయి. కరీంనగర్ మున్సిపాలిటీ సుమారు 40 ఏండ్ల కిందటి నుంచే నదీ తీరంలో డంపింగ్ యార్డును ఏర్పాటు చేసింది. సిటీలో సేకరించిన చెత్త ఇప్పుడు గుట్టలుగా పేరుకుపోయింది. కార్పొరేషన్ తోపాటు చికెన్ సెంటర్లు, హోటళ్లు, ప్రైవేట్ ఆస్పత్రులు, మెకానిక్ షాపులు, ఇతర వాణిజ్య సంస్థల నిర్వాహకులు వ్యర్థాలను మానేరులోనే వేస్తున్నారు. వర్షాలు కురిసినప్పుడు చెత్తాచెదారమంతా నదీజలాల్లో కలిసిపోయి.. నది మొత్తం కలుషితమవుతున్నది.

డంపింగ్ యార్డు నిర్వహణపై ఫిర్యాదులు అందడంతో యార్డును అక్కడి నుంచి తరలించాలని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్(ఎన్జీటీ) ప్రభుత్వాన్ని గతంలో ఆదేశించింది. కానీ ఇప్పటి వరకు ఆ ప్రక్రియ మొదలుకాలేదు. ఎన్ డబ్ల్యూఎంపీ స్టేషన్ లెక్కల ప్రకారం.. కరీంనగర్ నుంచి సోమన్ పల్లి మధ్య మానేరు నదీ జలాల్లో 100 మిల్లీ లీటర్లకు 920 ఎంపీఎన్ కోలిఫాం ఉన్నట్లు గతంలో వెల్లడైంది. 

గోదావరిలోకి ఎన్టీపీసీ, సింగరేణి వ్యర్థాలు

మన రాష్ట్రంలో బాసర నుంచి భద్రాచలం వరకు ప్రవహిస్తున్న గోదావరి నదిని సింగరేణి మైనింగ్, పేపర్ ఫ్యాక్టరీలు, సిమెంట్‌‌, సిరామిక్‌‌ ఇండస్ట్రీలు, థర్మల్‌‌ పవర్ ప్లాంట్ల నుంచి వచ్చే బూడిద, కెమికల్స్, ఇతర వ్యర్థాలు కలుషితం చేస్తున్నాయి. గోదావరి నదికి ఇరువైపులా విస్తరించి ఉన్న ధర్మపురి, లక్సెట్టి పేట, మంచిర్యాల, రామగుండం, గోదావరిఖని, మంథని తదితర పట్టణాలకు సంబంధించిన డ్రైనేజీ కాల్వల వద్ద సీవరేజ్ వాటర్ ట్రీట్ మెంట్ ప్లాంట్లు నెలకొల్పకపోవడంతో నేరుగా మురుగునీరంతా గోదావరిలో కలుస్తున్నది.

మణుగూరు టౌన్ సమీపంలోని భద్రాద్రి థర్మల్ విద్యుత్తు కేంద్రంలో యాష్ పౌండ్ నిండిన సందర్భాల్లో బూడిద వ్యర్థాలను తరచూ రాత్రి వేళల్లో జెన్ కో యాజమాన్యం గోదావరిలోకి వదులుతున్నది. దీంతో గోదావరి జలాలు బూడిదలా మారిపోతున్నాయి.  గోదావరి నది ప్రవహించే రామగుండం, మంథని ఏరియాల్లో అత్యధికంగా 24 బీవోడీ నమోదు కాగా.. తక్కువగా ములుగు జిల్లా కమలాపూర్ లోని రేయాన్స్ ఫ్యాక్టరీ ఏరియాలో 4 బీవోడీ నమోదైంది.

బీవోడీ ఎక్కువైతే..

నీటిలో ఆక్సిజన్ లెవల్స్ ను అంచనా వేసే కొలతనే బయోకెమికల్ ఆక్సిజన్ డిమాండ్ (బీవోడీ) అంటారు. బీవోడీ ఎక్కువగా ఉన్నప్పుడు నీటిలో ఆక్సిజన్ లెవల్స్ తగ్గుతాయి. నీటినే ఆవాసంగా చేసుకుని బతికే అనేక జాతుల చేపలు, మొక్కలు, కొన్ని రకాల పక్షులు నీళ్లలో ఆక్సిజన్ లెవల్స్ తగ్గితే జీవించలేవు. బీవోడీ అత్యధికంగా ఉన్న ఏరియాల్లో మురుగు ఏర్పడి దుర్వాసన కూడా వస్తుంది. రాష్ట్రంలోని వివిధ కెమికల్ ఇండస్ట్రీలు, షాపులు, ఇండ్ల నుంచి వెలువడే వ్యర్థాలతోపాటు పంటల సాగుకు వాడే యూరియా,  పెస్టిసైడ్స్ అవశేషాలతో కూడా నీళ్లలో కోలిఫాం,  నైట్రేట్ లెవల్స్ పెరుగుతున్నట్లు పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మూసీ నది ప్రవహించే హైదరాబాద్ నాగోల్ ఏరియాలో లీటర్ నీటిలో బీవోడీ 29 మిల్లీగ్రామ్స్, 100 మిల్లీలీటర్ల నీటిలో​ కోలిఫాం1,600 ఎంపీఎన్ ఉన్నట్లు నిరుడు రాష్ట్ర పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నిర్వహించిన స్టడీలో కూడా తేలింది.

నదీ జలాలను పరిరక్షించాలి.. 

బల్క్ డ్రగ్ ఇండస్ట్రీలు, మెడికల్ వ్యర్థాలతో మూసీ నది కలుషితమవు తున్నది. పటాన్ చెరులోని ఇండస్ట్రీల నుంచి నేరుగా పైపు లైన్లు వేసి మూసిలో వ్యర్థాలను కలుపుతున్నారు. మూసీ కాలుష్యం ఫలితంగా ఆ నదీ తీర ప్రాంతంలోని ప్రజలు అనేక రోగాల బారినపడుతున్నారు. మూసీలాగే  మైనింగ్, ఇండస్ట్రీల కారణంగా గోదావరి జలాలు పొల్యూట్​ అవుతున్నాయి.  మానేరు ఒడ్డునే డంపింగ్ యార్డు ఏర్పాటు చేయడంతో వర్షాలుపడితే వ్యర్థాలన్నీ నేరుగా నదిలో కలుస్తున్నాయి. నదీ జలాలు కలుషితం కాకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టాలి.  - పిట్టల శ్రీశైలం, సామాజిక కార్యకర్త

జలచరాలకు ముప్పు.. 

నదీ జలాల్లో ఆక్సిజన్ లెవల్స్ తగ్గినట్లు సీపీసీబీ రిపోర్టులో వెల్లడి కావడం ఆందోళన కలిగించే అంశం. నీటిలో బీవోడీ పెరిగితే.. నదుల్లో బతికే రకరకాల జీవరాశుల మనుగడకు క్రమంగా ముప్పు వాటిల్లే ప్రమాదముంది. ఇండస్ట్రీల నుంచి వచ్చే వ్యర్థాలతోపాటు వ్యవసాయంలో వాడుతున్న పురుగు మందుల అవశేషాలు కూడా నీటి ప్రవాహాల ద్వారా నదుల్లోకి చేరుతున్నాయి. ఇవన్నీ జలచరాలకు హానీ కలిగించేవే. బయోడైవర్సిటీని కాపాడేందుకు నదీ కాలుష్యాన్ని తగ్గించే చర్యలు చేపట్టాలి.  - ప్రొఫెసర్ దొంతి నర్సింహారెడ్డి, పర్యావరణ వేత్త