
- ఫ్యాక్టరీ వద్దకు చేరుకున్న మెషినరీ
- వచ్చే నెల నుంచి ఇన్‌స్టలేషన్ చేసేందుకు ఏర్పాట్లు
- ఈ నెల 19న పనుల పరిశీలనకు రానున్న రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్
వరంగల్, వెలుగు: కాజీపేటలో నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ పనులు స్పీడ్‌గా సాగుతున్నాయి. రెండేండ్ల కింద మొదలైన ఈ పనులను ఈ ఏడాది ఆగస్ట్ నాటికి పూర్తి చేయాలని కేంద్రం టార్గెట్ పెట్టుకుంది. ఇప్పటివరకు 73 శాతం పనులు పూర్తి కాగా.. మిగతా పనులను సైతం త్వరలోనే పూర్తి చేసేందుకు స్పీడప్ చేశారు. ఈ ఫ్యాక్టరీలో జరుగుతున్న పనులను పరిశీలించేందుకు ఈ నెల 19న కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ రానున్నారు.
రూ.680 కోట్లతో ఫ్యాక్టరీ పనులు
కాజీపేట కేంద్రంగా పీరియాడికల్ ఓవర్ హాలింగ్ వర్క్‌షాప్ (పీఓహెచ్) ఏర్పాటు చేయనున్నట్లు 2010లో కేంద్రం ప్రకటించింది. 2016లో పీఓహెచ్‍ను వ్యాగన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్‌గా అప్‌గ్రేడ్ చేశారు. ఈ పనులకు 2023 జులై 8న ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు. దీంతో కాజీపేట అయోధ్యపురంలోని 162 ఎకరాల్లో ఫ్యాక్టరీ నిర్మాణానికి సంబంధించి రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ ఆధ్వర్యంలో టెండర్లు పిలిచారు.
హైదరాబాద్‌కు చెందిన పవర్ మెక్, జపాన్‌కు చెందిన టైకి షా కంపెనీతో కలిసి ‘పవర్ మెక్ టైకిషా జేవీ’ పేరుతో రూ.383 కోట్లతో ఫ్యాక్టరీ నిర్మాణ పనుల కాంట్రాక్ట్ దక్కించుకున్నారు. ఇదిలా ఉండగానే కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలన్న డిమాండ్ పెరగడంతో పాటు రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన హామీ మేరకు కోచ్ ఫ్యాక్టరీని మంజూరు చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం.. ప్రధాని మోదీ, కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చింది. దీంతో ఓవర్ హాలింగ్ వర్క్‌షాప్‌ను ఇంటిగ్రేటెడ్ రైల్వే కోచ్ ఫ్యాక్టరీగా అప్‌గ్రేడ్ చేస్తున్నట్లు 2023 సెప్టెంబర్ 9న నిర్ణయం వెలువడగా... నవంబర్ 28న రైల్వే అధికారులు అఫీషియల్‌గా ప్రకటించారు.
ప్రాజెక్ట్ నిర్మాణ బడ్జెట్‌ను రూ.383 కోట్ల నుంచి రూ.680 కోట్లకు పెంచారు. ప్రతి సంవత్సరం 600 కోచ్‌లు తయారు చేసేలా ఫ్యాక్టరీ నిర్మాణాన్ని ప్రారంభించారు. ఈ కోచ్‌లతో పాటు వందే భారత్, జర్మనీ టెక్నాలజీతో కూడిన లింక్ హాఫ్‌మన్ బుష్ (ఎల్‌హెచ్‌బీ) సబర్మన్ రైళ్లకు ఉపయోగించే ఎలక్ట్రిక్ మల్టిపుల్ యూనిట్ (ఈఎంయూ) వంటి కోచ్‌లను తయారు చేయనున్నారు. మద్రాస్, తదితర కోచ్ ఫ్యాక్టరీలకు సంబంధించిన ఉన్నతాధికారులు కాజీపేటకు వచ్చి నిర్మాణ పనులకు సంబంధించి పలు సూచనలు చేశారు. ఫ్యాక్టరీ నిర్మాణం వల్ల ప్రత్యక్షంగా ఆరు వేల మందికి, పరోక్షంగా మరో ఆరు వేల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు దక్కనున్నాయి.
ఆగస్ట్ టార్గెట్.. డిసెంబర్‌లో పూర్తయ్యే చాన్స్
కాజీపేటలో నిర్మిస్తున్న కోచ్ ఫ్యాక్టరీ పనులను ఈ ఏడాది ఆగస్ట్ నాటికి పూర్తి చేయాలని టార్గెట్‌గా పెట్టుకున్నారు. ఇందులో భాగంగా వ్యాగన్, కోచ్‌ల తయారీ కోసం నిర్మించే నాలుగు భారీ షెడ్ల నిర్మాణం ఇప్పటికే దాదాపు పూర్తయింది. మెయిన్ షెడ్‌లో తయారైన కోచ్‌లు ఇంటర్నల్ ట్రాక్ ద్వారా రెండో షెడ్‌లో ఉన్న పెయింటింగ్ ప్లేస్‌కు చేరుతాయి. అక్కడ మోడ్రన్ టెక్నాలజీ ఆధారంగా తయారు చేసిన రోబోట్లు కోచ్‍లకు అవసరమైన పెయింట్ వేస్తాయి. ఇలాంటి టెక్నాలజీని ఇక్కడే మొదటి సారి వాడుతున్నారు. స్టోర్ వార్డ్‌గా పిలువబడే మూడో షెడ్‌లో వ్యాగన్, కోచ్‌ల తయారీకి అవసరమైన మెటీరియల్‌ను స్టోర్ చేస్తారు. నాలుగో షెడ్‌ను స్క్రాప్ కోసం వాడుకోనున్నారు. మొత్తం పనుల్లో ఇప్పటికే 73 శాతం పూర్తయినట్లు కాంట్రాక్ట్ సంస్థ తెలిపింది.
పెండింగ్‌లో ఇన్‌స్టలేషన్, సివిల్, ఎలక్ట్రికల్ వర్క్స్
కోచ్‌ల తయారీ ఫ్యాక్టరీలో మెషినరీ ఇన్‌స్టలేషన్‌తో పాటు సివిల్, ఎలక్ట్రిక్ వర్క్స్ మాత్రమే పెండింగ్‌లో ఉన్నాయి. అడ్వాన్డ్ టెక్నాలజీతో కూడిన మెషినరీలో 85 శాతం ఇప్పటికే ఫ్యాక్టరీ వద్దకు చేరుకుంది. ఆగస్ట్ నెలలో ఇన్‌స్టలేషన్ పనులు మొదలుపెట్టనున్నారు. మరో 20 శాతం సివిల్, ఎలక్ట్రికల్ వర్క్ చేయాల్సి ఉంది. కాజీపేట రైల్వే స్టేషన్ నుంచి కోచ్ ఫ్యాక్టరీ వరకు వేస్తున్న ట్రాక్ పనులు చివరి దశకు వచ్చాయి. ఇంటర్నల్ రైల్వే లైన్లతోపాటు రోడ్లు, సబ్‌స్టేషన్లు, వేబ్రిడ్జిలు, టెస్ట్ షాప్, ఎలక్ట్రికల్ సబ్‌స్టేషన్ వంటి ఇతరత్రా నిర్మాణ పనులు మధ్యలో ఉన్నాయి. డిసెంబర్ నాటికి పనులు పూర్తవుతాయని కాంట్రాక్ట్ సంస్థ ప్రతినిధులు చెబుతున్నారు. ఈ క్రమంలో పనుల పరిశీలనకు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఈ నెల 19న కోచ్ ఫ్యాక్టరీ వద్దకు రానున్నారు.