సిటీ కాలుష్యానికి కారకులెవరు? : - డా. సజ్జల జీవానంద రెడ్డి

సిటీ కాలుష్యానికి కారకులెవరు? : - డా. సజ్జల జీవానంద రెడ్డి

దేశ రాజధాని ఢిల్లీ కాలుష్యంతో నిత్యం యుద్ధం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇది ఒక్క ఢిల్లీకి సంబంధించిన సమస్యే కాదు. మెట్రో నగరాల్లో వాయు కాలుష్యం క్రమంగా పెరుగుతూ వస్తున్నది. దీంతో గ్రేటర్​హైదరాబాద్ ప్రజలూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.  దేశంలో ఢిల్లీ, కోల్ కతా, ముంబై తర్వాత అత్యధిక కాలుష్యం ఉన్న నాలుగో నగరం హైదరాబాదే అని ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (ఏక్యూఐ) ప్రకటించింది. దక్షిణాదిలో భాగ్యనగరమే అత్యంత కాలుష్య నగరంగా నిలిచింది. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి తాజా లెక్కల ప్రకారం.. సిటీలోని సనత్‌‌నగర్‌‌లో అత్యధికంగా గాలి కలుషితమైనట్లు తేలింది. ఈ పరిస్థితికి కాలుష్య కారకాలతోపాటు హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌‌మెంట్ అథారిటీ(హెచ్​ఎండీఏ), గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ), మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ & అర్బన్ డెవలప్‌‌మెంట్ డిపార్ట్‌‌మెంట్ (ఎంఏ&యూడీ), తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి, ట్రాఫిక్ పోలీసు విభాగం, రవాణా శాఖలు కూడా కారణమే!

మాస్టర్​ప్లాన్​ సరిగా లేక..

ఒక నగరం విస్తరణా క్రమంలో సరైన మాస్టర్​ప్లాన్​లేకపోతే.. అనేక సమస్యలు తలెత్తుతాయి. హైదరాబాద్​కు సంబంధించి హెచ్‌‌ఎండీఏ రూపొందించిన మాస్టర్‌‌ ప్లాన్స్​నాసిరకంగా ఉండటం వల్లే.. ఈరోజు రోడ్లపై రద్దీ, నీటి వనరులు, పచ్చదనం ధ్వంసమై కాలుష్యం పెరుగుతున్నది. నేను హుడా/హెచ్‌‌ఎండీఏ నిర్వహించిన వాటాదారుల సమావేశంలో పాల్గొన్నాను. క్వాలిటీ మాస్టర్ ప్లాన్‌‌లు ఉండేవి కాదు. ఉదాహరణకు, మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ హైదరాబాద్(ఎంసీహెచ్) మాస్టర్ ప్లాన్ విషయంలో రెసిడెన్షియల్ జోన్‌‌లను వాణిజ్య జోన్‌‌లకు అనుమతించింది. దీని ఫలితంగా ఇరుకైన రోడ్లలో ట్రాఫిక్ రద్దీ పెరిగింది. అటు శబ్ద, వాయు కాలుష్యం పెరిగి పిల్లలు, వృద్ధులను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నది. నేటి కాలుష్యంలో జీహెచ్ఎంసీకి భాగం ఉన్నది. హైదరాబాద్‌‌లో ఉత్పత్తయ్యే వ్యర్థాల నిర్వహణ సరిగా లేదు. ఇది అదనపు వాయు కాలుష్యానికి కారణమవుతున్నది. చాలా చోట్ల పార్కుల ఖాళీ స్థలంలోనే వ్యర్థాలను డంప్​చేస్తున్నది. కొన్ని చోట్ల పారిశుద్ధ్య కార్మికులు చెత్తను కాల్చివేస్తున్నారు. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ & అర్బన్ డెవలప్‌‌మెంట్ డిపార్ట్‌‌మెంట్ కూడా పట్టణ అభివృద్ధికి సరైన చర్యలు తీసుకోవడం లేదు. కొన్ని సంవత్సరాల క్రితం సంజీవయ్య పార్క్ నుంచి జలవిహార్ మధ్య బీచ్ వాలీబాల్‌‌ను ఏర్పాటు చేశారు. అందుకోసం సాగర్​ను కొంత భాగం పూడ్చారు. పర్యావరణవేత్తలు నిర్వాహకులతో మాట్లాడి మూసివేయించారు. లేదంటే తీవ్ర వాయు కాలుష్యానికి అది మరో అడ్డాగా మారేది. ఇటీవల కారు రేసులను ప్రారంభించగా, అది తీవ్ర ట్రాఫిక్ జామ్‌‌లకు, తద్వారా కాలుష్యానికి కారణమైంది. ఇలాంటి ఈవెంట్స్​సిటీ బయట పెట్టాలి. 

ప్రభుత్వ విధానాలు మారాలి

సిటీలో ఎక్కడ చూసినా నిత్యం రోడ్లు తవ్వడం, పూడ్చడం కనిపిస్తుంటుంది. తవ్వడం, పూడ్చడం ద్వారా దుమ్ము, దూళి కణాలు గాలిలో కలిసి వాయుకాలుష్యం పెరుగుతున్నది. రోడ్ల నాణ్యత, నిర్వహణపై ప్రభుత్వానికి ఒక విధానం లేదు. పాదచారులు నడిచే ఫుట్‌‌పాత్‌‌లపై వ్యాపారాలు నడుస్తుంటాయి. రోడ్లపైనే కారు పార్కింగులు ఉంటున్నాయి. దీంతో ట్రాఫిక్​ రద్దీ పెరుగుతున్నది. ట్రాఫిక్ పోలీసులు సాంప్రదాయ చలానా- సంస్కృతి కొనసాగిస్తున్నారు కానీ.. ట్రాఫిక్​ను ఆశించిన స్థాయిలో నియంత్రించడం లేదు. గల్లీ నాయకుల ఓటు బ్యాంకు రాజకీయాలతో సిటీలో చెరువులు, డ్రెయిన్లు కబ్జాలకు గురవుతున్నాయి. ఫుట్​పాత్​లు, రోడ్లపై మతపరమైన నిర్మాణాలు యథేచ్ఛగా కొనసాగుతున్నాయి. ఫలితంగా నగర జీవన విధానం అస్థవ్యస్థమవుతున్నది. ప్రభుత్వం రోడ్లు, వంతెనలు నిర్మిస్తున్నది కానీ.. ప్రజా రవాణాను ప్రోత్సహించడం లేదు. ఆర్టీసీ బస్సుల సంఖ్య బాగా తగ్గింది. ఎంఎంటీఎస్​ను సరిగా వాడుకోవడం లేదు. దీంతో సిటీలో ఏటా వ్యక్తిగత వాహనాల సంఖ్య పెరుగుతూ వస్తున్నది. ఫలితంగా ట్రాఫిక్​రద్దీ, వాయు కాలుష్యం తగ్గకపోగా, పెరుగుతున్నది. వాహనాల్లో పోస్తున్న ఇంధనం కూడా కొన్ని చోట్ల కల్తీ అవుతున్నది. దీంతో పొల్యూషన్​ఎక్కువవుతున్నది. 15 ఏండ్లు పైబడిన వాహనాల వినియోగంపైనా ప్రభుత్వం సరిగా దృష్టి పెట్టడం లేదు. ఇలా అనేక కారణాలతో భాగ్యనగరం.. కాలుష్య కోరల్లో చిక్కుకుంటున్నది. ప్రభుత్వం ఇప్పటికైనా నివారణ చర్యలకు ఉపక్రమించాలి. లేదంటే హైదరాబాద్​మరో ఢిల్లీగా మారేందుకు ఎక్కువ కాలం పట్టకపోవచ్చు.

- డా. సజ్జల జీవానంద రెడ్డి, యూఎన్, మాజీ చీఫ్​ టెక్నికల్​అడ్వయిజర్