కరెంటు బండ్లతో కాలుష్యం తగ్గదట

కరెంటు బండ్లతో కాలుష్యం తగ్గదట

ఎయిర్ పొల్యూషన్ సమస్యకు సమాధానం దొరకాలంటే ముందుగా.. మన భవిష్యత్ ‘ఎనర్జీ’ గురించి చర్చించాల్సి ఉంది. నీతి ఆయోగ్ లెక్కల ప్రకారం.. 2030 నాటికి బొగ్గు ఆధారిత కరెంటు ఉత్పత్తి ప్రస్తుతం ఉన్న 47 శాతం నుంచి 51 శాతానికి పెరగనుంది. ఇందులో ఎక్కువ శాతం పవర్​ను స్టీల్, సిమెంట్ కంపెనీలు వినియోగించనున్నాయి. ప్రస్తుత థర్మల్ పవర్ ప్లాంట్లు తమ కరెంటు ఉత్పత్తి కెపాసిటీని 2047 నాటికి రెట్టింపు చేయనున్నాయి.
కరెంటు ఉత్పత్తిలో కీలకమైన నేలబొగ్గు.. భవిష్యత్​లోనూ హవా కొనసాగిస్తుంది. ఇక్కడే బొగ్గుకు, ఎలక్ట్రిక్ వెహికల్స్​కు లింకు ఉంది. ఈవీలు వాడాలంటే చార్జింగ్ చేయాలి. అందుకు కరెంటు కావాలి. కరెంటు   కావాలంటే పవర్ ప్లాంట్లు మరింత కరెంటు ఉత్పత్తి చేయాలి. ఈ లెక్కన ఈవీలు పెరిగే కొద్దీ, పవర్ వాడకం పెరిగిపోతుంది. ఇలా థర్మల్ ప్లాంట్లలో బొగ్గు వాడకం పెరుగుతుంది. తద్వారా గాలి కాలుష్యం పెరుగుతుంది. ఇన్​డైరెక్ట్​గా కాలుష్యానికి ఈవీలు కారణమవుతాయి. ఈ లెక్కన ఎక్కువగా కాలుష్యం విడుదల చేస్తున్న కోల్ ఆధారిత థర్మల్ పవర్ పాయింట్లపైనే ఎలక్ట్రిక్ వెహికల్స్ కూడా ఆధారపడాల్సి వస్తుంది.

ఈ-వేస్ట్, లో బ్యాటరీ..

ఎయిర్ పొల్యూషన్ తగ్గించే విషయాన్ని మనం పక్కనబెడితే, ఈవీ సెక్టార్ నుంచి ఉత్పత్తి అయ్యే ఎలక్ట్రానిక్ వేస్ట్ కూడా ఎక్కువగానే ఉంటుంది. మార్కెట్ అనలిస్టుల లెక్కల ప్రకారం ఇండియన్ ఎలక్ట్రిక్ కార్ మార్కెట్ 2017 నుంచి 2025 మధ్య 10 రెట్లు పెరగనుంది. అంకెల పరంగా చూసుకుంటే 2017లో రూ.486.2 కోట్ల నుంచి 2025 నాటికి 4,838.3 కోట్లకు చేరనుంది. ఇదే సమయంలో వాడిపడేసిన బ్యాటరీల నిల్వలు కూడా 10 రెట్లు పెరిగే అవకాశం ఉంది. మరోవైపు ఎక్కువ కెపాసిటీ ఉన్న, తేలికైన, సమర్థమైన బ్యాటరీలను తయారు చేసేందుకు కంపెనీలు పోటీ పడుతున్నాయి. చార్జింగ్ ఎక్కువ సేపు వచ్చేలా, వేగంగా చార్జ్ అయ్యేలా, ఎక్కువ పవర్ సేవ్ చేసుకునేలా వాటిని రూపొందిస్తున్నాయి. ఈవీల విషయానికి వస్తే.. ప్రస్తుతం లిథియం–అయాన్ బ్యాటరీలను స్టాండర్డ్​గా ఇండస్ర్టీలు భావిస్తున్నాయి. కానీ ప్రపంచవ్యాప్తంగా చూస్తే లిథియం–అయాన్ బ్యాటరీల కెపాసిటీ చాలా తక్కువ. ఇండియాలో వీటి రీసైక్లింగ్ కెపాసిటీ అతి తక్కువ. ఈ క్రమంలో ‘క్లీన్ ఎయిర్’ను సాధించేందుకు ఈవీలు ఉపయోగపడవని, భవిష్యత్​లో తలెత్తే సమస్యలను విమర్శనాత్మకంగా అంచనా వేయాలని  ఎక్స్​పర్టులు చెబుతున్నారు అలాగే బొగ్గు విషయంలో ‘ఎనర్జీ పాలసీ’ని మార్చాలని చెబుతున్నారు.