దానిమ్మ ధరలు తగ్గాయి..కారణం ఇదే

దానిమ్మ ధరలు తగ్గాయి..కారణం ఇదే

హైదరాబాద్లో దానిమ్మ పండ్ల ధరలు భారీగా పడిపోయాయి.  రెండు వారాల క్రితం ఒక్కో దానిమ్మ పండు రూ. 30 పలకగా..ప్రస్తుతం రూ. 10 నుంచి 15 రూపాయల వరకు విక్రయిస్తుండటం గమనార్హం. కొన్ని ప్రాంతాల్లో అయితే చిన్న సైజు దానిమ్మ పండును రూ. 5కే వ్యాపారులు విక్రయిస్తున్నారు. 

హైదరాబాద్ కు దానిమ్మ పండ్లు మహారాష్ట్ర, కర్ణాటక, ఏపీల నుంచి సరఫరా అవుతాయి. మహారాష్ట్రలోని జల్నా, సాంగ్లీ, షోలాపూర్, ఔరంగబాద్, పూణే, అహ్మద్ నగర్, వాషిలలో ఈ పండ్లు విస్తారంగా పండుతాయి.  అలాగే కోలార్, చిక్కబల్లాపూర్, బెంగుళూరు రూరల్, బెలగావి, బాగల్ కోట్ లలో అధిక మొత్తంలో పండిస్తారు. ఈ ప్రాంతాల్లోని రైతులు దానిమ్మ పండ్లను హైదరాబాద్ లోని బాటసింగారం మార్కెట్ కు తరలిస్తారు. 

మహారాష్ట్ర, కర్ణాటక, ఏపీల్లో దానిమ్మ పంటలు బాగా పండటంతో ధరలు తగ్గాయని వ్యాపారులు చెబుతున్నారు. రానున్న రోజుల్లో మరింతగా దానిమ్మ ధరలు పడిపోతాయని తెలిపారు. సాధారణంగా జులైలో దానిమ్మ పండ్లు మార్కెట్లకు రైతులు సరఫరా చేస్తారు. ఆగస్టు మొదటి వారం నుంచి దానిమ్మ పండ్ల సరఫరా విపరీతంగా పెరుగుతుంది. మూడు నెలల వరకు అంటే డిసెంబర్ వరకు కూడా దానిమ్మ పండ్ల ధరలు సామాన్యుడికి అందుబాటులో ఉండే అవకాశం ఉంది.