తెగిన కుంట.. ప్రవాహంలో కొట్టుకుపోయిన 400 గొర్రెలు

తెగిన కుంట.. ప్రవాహంలో  కొట్టుకుపోయిన 400 గొర్రెలు

అనంతపురం: జిల్లాలో తెల్లవారుజామున కురిసిన భారీ వర్షానికి 400కు పైగా గొర్రెలు నీటిలో కొట్టుకుపోయాయి. సమీపంలోని కుంట తెగడంతో గొర్రెల మందను వాన నీరు ముంచెత్తింది. దీంతో తప్పించుకునేందుకు విశ్వప్రయత్నం చేసిన గొర్రెలు చీకట్లో వాననీటి ప్రవాహం ఉధృతి నుంచి బయటపడలేక చనిపోయాయి. నల్లమడ మండలంలోని చారుపల్లి రెడ్డివారిపల్లెలో జరిగిందీ విషాద ఘటన. 
గ్రామానికి చెందిన రైతు గొర్రెల యజమానితో ఒప్పందం చేసుకుని బాపనయ్య కుంట వద్ద గొర్రెల మందను ఉంచుకుంటున్నాడు. తెల్లవారుజామున 4 గంటల సమయంలో భారీ వర్షాలకు కుంట నిండిపోయి గట్టు తెగింది. దీంతో ఒక్కసారిగా వాననీరంతా గొర్రెల మంద నిల్వ చేసిన ప్రాంతాన్ని చుట్టుముట్టింది. చీకట్లో వాననీరు ముంచెత్తడంతో బయటపడేందుకు గొర్రెలు చాలా ప్రయత్నించాయి. సుమారు  400 గొర్రెలు కుంటనీటి ప్రవాహంలో కొట్టుకుపోయి చనిపోయాయి. దీంతో ఇటు రైతుతోపాటు గొర్రెల యజమాని లబోదిబో మంటూ గ్రామానికి చేరుకున్నాడు. విషయం తెలుసుకున్న పశుసంవర్ధక అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని చనిపోయిన గొర్రెలను పరిశీలించారు. గొర్రెల యజమానితో రైతు పేడ కోసం ఒప్పందం చేసుకుని బాపనయ్యకుంట వద్ద మందను ఏర్పాటు చేసుకున్నాడని గుర్తించారు. నష్టపరిహారం గురించి జిల్లా కలెక్టర్ కు నివేదించనున్నట్లు పశుసంవర్ధక శాఖ వైద్యాధికారులు తెలిపారు.