మెదక్ జిల్లాలో చెరువులు నిండినయ్..సంతోషం వ్యక్తంచేస్తున్న రైతులు, మత్స్యకారులు

మెదక్ జిల్లాలో చెరువులు నిండినయ్..సంతోషం వ్యక్తంచేస్తున్న రైతులు, మత్స్యకారులు
  • చేపల పెంపకానికి అనుకూల వాతవారణం
  • తెగిపోయిన కట్టలకు రిపేర్ ​పనులు

మెదక్/సిద్దిపేట/సంగారెడ్డి, వెలుగు: జూన్, జులైలో వర్షాభావ పరిస్థితుల కారణంగా చెరువులు వెలవెలబోగా, నాలుగైదు రోజులుగా కురుస్తున్న వర్షాలతో ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా చెరువులు నిండుకుండల్లా మారాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 662 చెరువులు పూర్తిగా నిండి అలుగు పారుతున్నాయి. వెయ్యికి పైగా చెరువులు 100 శాతం నిండాయి. చేపల పెంపకానికి అనుకూల వాతావరణం నెలకొంది. ప్రభుత్వం మత్స్య సహకార సంఘాలకు ఉచితంగా చేప పిల్లలు పంపిణీ చేసేందుకు టెండర్లు పిలవగా, ఫిషరీస్ డిపార్ట్ మెంట్ అధికారులు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. వందలాది చెరువులు జలకళను సంతరించుకోవడంతో వాటి ఆయకట్టు పరిధిలోని రైతులు, మత్స్య కారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 

మెదక్ జిల్లాలో..

జిల్లాలోని 21 మండలాల పరిధిలో మొత్తం 2,632 చెరువులు ఉన్నాయి. ఇటీవల కురిసిన వర్షాలకు  634 చెరువుల్లో 25 శాతం,  502 చెరువులో 50 శాతం, 625 చెరువుల్లో 75 శాతం, 598 చెరువుల్లో 100 శాతం నీరు చేరింది. జిల్లా వ్యాప్తంగా 273 చెరువులు అలుగు పారుతున్నాయి. సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా మొత్తం 2,280 చెరువులు ఉన్నాయి. అందులో 561 చెరువుల్లో 25 శాతం, 618 చెరువుల్లో 50 శాతం, 658 చెరువుల్లో 75 శాతం, 337 చెరువుల్లో 100 శాతం నీరు చేరింది. 106 చెరువులు అలుగు పారుతున్నాయి. 

సంగారెడ్డి జిల్లాలో..

జిల్లా వ్యాప్తంగా మైనర్ ఇరిగేషన్ చెరువులు మొత్తం 411 ఉండగా వాటిలో 75 శాతం చెరువులు పూర్తిగా నిండాయి. 283 చెరువులు అలుగు పారుతున్నాయి. మరో 128  చెరువులు 80 శాతం నిండాయి. ఇందులో 2 పెద్ద చెరువుల వెనక భాగం కట్టలు తెగిపోగా 8 చిన్న చెరువుల కట్టలు తెగిపోయి పంట పొలాల్లోకి నీరు చేరాయి. పుల్కల్ మండలం ఇసోజుపేట వద్ద సెంగుడు కాల్వకు గండి పడితే ఆదివారం మంత్రి దామోదర సందర్శించి రిపేర్ పనులు చేయించారు. భారీ వర్షాలు కురుస్తున్న క్రమంలో ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు అప్రమత్తమై చెరువుల వద్ద  బందోబస్తు ఏర్పాటు చేయించారు.