రాత్రికి రాత్రి నిర్ణయాలతో లక్ష కోట్లు గోదారి పాలు

రాత్రికి రాత్రి నిర్ణయాలతో లక్ష కోట్లు గోదారి పాలు
  • తుమ్మిడిహెట్టి వద్ద అప్పటికే రూ.11 వేల కోట్లు ఖర్చు పెట్టినా కొనసాగించలే: పొంగులేటి 
  • ఫీజిబిలిటీ కాదన్నా మేడిగడ్డ దగ్గర రీడిజైన్​ చేశారు  
  • గూగుల్ మ్యాపుతో ప్రాజెక్టుకు రూపకల్పన 
  • 25 రోజుల్లో 3 బ్యారేజీల నిర్మాణానికి పూనుకున్నరు
  • తడిబట్టతో గొంతుకోసే బ్యాచ్..  మీ చరిత్ర తీస్తా.. అంటూ హరీశ్​రావుపై మంత్రి ఫైర్  

హైదరాబాద్, వెలుగు: గత బీఆర్ఎస్ ప్రభుత్వం రాత్రికి రాత్రి తీసుకున్న నిర్ణయాలతో రూ. లక్ష కోట్లు గోదావరి పాలయ్యాయని.. కేవలం 25 రోజుల్లోనే మూడు ప్రాజెక్టుల నిర్మాణాలు చేపట్టడం వెనుక భారీగా అవినీతి జరిగిందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆరోపించారు. మాజీ మంత్రి హరీశ్​రావు సీకెంట్ పైల్స్ కు కింగ్ పిన్ అని, మామా, అల్లుడి దురాశే కాళేశ్వరం ప్రాజెక్టు దుస్థితికి కారణమన్నారు.

కాళేశ్వరంపై ఘోష్ కమిషన్ రిపోర్ట్​పై అసెంబ్లీలో చర్చ సందర్భంగా ఈ మేరకు హరీశ్ రావుపై మంత్రి పొంగులేటి ఫైర్ అయ్యారు. ‘‘తడిబట్టతో గొంతు కోసే స్టయిల్ కాదు.. మీరు ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. మాయమాటలు చెప్పే బ్యాచ్​మీది. జ్ఞానం ఉండాలి మాట్లాడడానికి. దానికి పనిష్మెంట్​అనుభవిస్తున్నరు.  సరిపోవడం లేదా. మీ చరిత్ర ఒక్కోటి బయటికి తీస్తే తెలుస్తుంది. మీ పార్టీ ఏంటో, మీ కథ ఏంటో.. గూగుల్ మ్యాపులు తీసి లక్షలాది కోట్ల ప్రాజెక్టులకు డ్రాయింగ్​లు గీయడం ఏందో.. లక్షల కోట్లు ఎట్లా కొల్లగొట్టారో తెలుస్తుంది” అని విమర్శించారు. 

మీస్కెచ్​ఏంటో కమిషన్ చెప్పింది. ఎన్డీఎస్ఏ చెప్పింది. విజిలెన్స్​చెప్పింది.. ఇంకా రాబోయే రోజుల్లో వచ్చే చరిత్ర కూడా ఉంటది’’ అంటూ మండిపడ్డారు. ‘‘సీతారామ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసినప్పుడు కేసీఆర్ పక్కనే ఉన్నారు కదా?’’ అన్న హరీశ్​రావు మాటలపై మంత్రి సీరియస్​అయ్యారు. రాజీవ్ సాగర్,- ఇందిరా సాగర్ ప్రాజెక్టులకు కేసీఆర్ శంకుస్థాపన చేసిన సమయంలో తాను బీఆర్ఎస్ లో లేనని, వైసీపీలో ఎంపీగా ఉన్నానని చెప్పారు. టోటల్ గా ఒకే ఒక్క కాన్సెప్ట్ తో రూ.లక్ష కోట్లు కొల్లగొట్టాలనే ఈ ప్రాజెక్టుకు రూపకల్పన చేశారని కమిషన్ నివేదికలో చెప్పిందన్నారు.  

కమీషన్ల కోసమే కాళేశ్వరం..

తుమ్మిడిహెట్టి వద్ద అప్పటికే రూ.11వేల కోట్లు ఖర్చు పెట్టిన ప్రాజెక్టును కొనసాగించకుండా రాత్రికి రాత్రి నిర్ణయాలు తీసుకుని లక్ష కోట్ల దోపిడీకి తెగబడ్డారే తప్ప ప్రజలకు మేలు చేయాలనే ఆలోచన లేదని పొంగులేటి  విమర్శించారు. ‘‘ప్రాణహిత–చేవెళ్ల కోసం తుమ్మిడిహెట్టి వద్ద ఉమ్మడి రాష్ట్రంలో రూ.5,500 కోట్లు ఖర్చు చేస్తే 2014 తర్వాత బీఆర్ఎస్ వచ్చాక ఆనాటి మంత్రి హరీశ్​, సీఎం కేసీఆర్​రూ.6,100 కోట్లు ఖర్చుపెట్టారు. అప్పటికే రూ. 11 వేల కోట్లు ఖర్చు పెట్టినా ఎందుకు కొనసాగించలేదు?’’ అని ప్రశ్నించారు. 

‘‘ఫీజిబిలిటీ కాకపోయినా.. వాళ్లకు కన్వీనెంట్​గా ఉండాలనే మేడిగడ్డ దగ్గర రీడిజైన్ ప్లాన్ చేశారు’’ అని విమర్శించారు. తుమ్మిడిహెట్టి వద్ద కట్ట వద్దనుకుని 8 నెలలు ఆలోచించిన గత బీఆర్ఎస్ ప్రభుత్వం కేవలం 25 రోజుల్లో మూడు నీటి ప్రాజెక్టుల బ్యారేజీల నిర్మాణానికి పూనుకుందన్నారు. వ్యాప్కోస్ నివేదిక మేరకు 2016 ఫిబ్రవరి17లో డీపీఆర్ కు ఆమోదం రాగా, మార్చి ఒకటో తేదీకే అంటే 12 రోజుల్లోనే టెండర్లు కాల్​ఫర్ చేసి రూ. లక్ష 47 వేల కోట్ల ప్రాజెక్టుకు ఆమోదించడం, టెండర్ పిలవడం వెనుక అవినీతి ఉందన్నారు. తుమ్మిడిహెట్టి ప్రాజెక్టు వదిలేసి, కమీషన్ల కోసమే కాళేశ్వరం  ప్రాజెక్టును ప్రారంభించారని ఆరోపించారు. రాజీవ్ సాగర్, ఇందిరాసాగర్ నిర్మాణ వ్యయం రూ.18 వేల కోట్లకు పెంచి దోచుకున్నారని అన్నారు.  

సీకెంట్​ పైల్​ వాల్​తో కట్టడం వల్లే కుంగింది.. 

రూ. లక్ష కోట్లు గోదావరిలో కొట్టుకుపోవడానికి సీకెంట్ పైల్ వాలే కారణమని మంత్రి పొంగులేటి చెప్పారు. ‘‘మామా అల్లుడి నిర్ణయమే ఈ ప్రాజెక్టు దుస్థితి. మామ చెప్పారు. అల్లుడు చేశారు. దేశంలో మరెక్కడా ఉపయోగించని సీకెంట్ పైల్ టెక్నాలజీతో ప్రాజెక్టు నిర్మాణం జరిగింది. కేవలం గూగుల్ మ్యాప్ ను ముందు పెట్టుకుని ఈ ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు’’ అని ఆరోపించారు. మహా అనుభవజ్ఞుడైన హరీశ్​రావు సీకెంట్ పైల్ కు కింగ్ పిన్ అని, సీకెంట్ పైల్, గూగుల్ మ్యాప్ తో లక్ష కోట్లు గోదావరిలో కొట్టుకుపోయాయన్నారు. 

డయాఫ్రమ్ వాల్ కు 30 శాతం ఖర్చయ్యేదని, కానీ, వంద శాతం ఖర్చుతో సీకెంట్ పైల్ కు వెళ్లారని చెప్పారు. ఈ టెక్నాలజీపై అధికారులు గానీ, నవయుగ, ఎల్ అండ్ టీ వంటి ఏజెన్సీలకు గానీ ఎలాంటి అనుభవం లేదన్నారు. డయాఫ్రమ్ వాల్ కాంక్రీట్ తో కాకుండా సీకెంట్ పైల్ వాల్ టెక్నాలజీతో కట్టడం వల్లే మేడిగడ్డ బ్యారేజీ కుంగిందని మంత్రి స్పష్టం చేశారు. మేడిగడ్డలో కేసీఆర్ ఫామ్ హౌస్ లోని బావి సైజులో రంధ్రం పడిందన్నారు. ఒకే టెక్నాలజీతో కట్టిన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళ బ్యారేజీలు కూడా ఇప్పుడు ప్రమాదంలో పడ్డాయన్నారు.