బీఆర్ఎస్ నుంచి పొంగులేటి, జూపల్లిపై సస్పెండ్

బీఆర్ఎస్ నుంచి పొంగులేటి, జూపల్లిపై సస్పెండ్

మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావుపై బీఆర్ఎస్ అధిష్టానం వేటు వేసింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని ఇద్దరు నేతలను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. పార్టీ నిబంధనలు ఉల్లంఘించారని సస్పెండ్ చేశారు. కొత్తగూడెంలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమంలో సీఎం కేసీఆర్ టార్గెట్ గా ఇద్దరు నాయకులు విమర్శలు చేశారు. 

కొంతకాలంగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు బీఆర్ఎస్ కు దూరంగా ఉంటున్నారు. సమయం, సందర్భం దొరికినప్పుడల్లా కేసీఆర్ ప్రభుత్వ పరిపాలనపై పొంగులేటి విమర్శలు చేస్తున్నారు. ఏప్రిల్ 9వ తేదీన కొత్తగూడెంలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమానికి జూపల్లి ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు. అక్కడ రాష్ట్ర ప్రభుత్వ తీరును తూర్పారపట్టారు. ఉద్యమం కోసం పోరాడిన నాయకులు, కార్యకర్తలపై కేసులు పెడుతారా..? ప్రజాప్రతినిధులకు కనీసం అపాయింట్ మెంట్ కూడా కేసీఆర్ ఇవ్వరా..? తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల పాల్జేశారని, ఇందుకోసమే తెలంగాణ తెచ్చుకున్నామా..? అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు పొంగులేటి, జూపల్లి. 

ఈ ఇద్దరు నాయకులు ఇప్పటి వరకూ బీఆర్ఎస్ కు రాజీనామా చేయలేదు. కానీ, పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. తరచూ ప్రభుత్వ తీరును ఎండగడుతున్నారు. ఏప్రిల్ 9న ప్రభుత్వంపై చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో పొంగులేటి, జూపల్లిపై  బీఆర్ఎస్ అధిష్టానం వేటు వేసింది. 

గత మూడేళ్లుగా తనకు సభ్యత్వం కూడా ఇవ్వలేదని, అధిష్టానాన్ని కలిసే ప్రయత్నం చేసినా అపాయింట్ మెంట్ కూడా ఇవ్వలేదని జూపల్లి కృష్ణారావు మండిపడ్డారు. ఏప్రిల్ 9న జరిగిన సమావేశంలో సీఎం కేసీఆర్ తో పాటు పరిపాలన తీరుపై తీవ్ర విమర్శలు చేశారు ఇద్దరు నాయకులు. 

సాధారణంగా బీఆర్ఎస్ పార్టీ.. తమ నాయకులను పార్టీ నుంచి పెద్దగా సస్పెండ్ చేయదనే ప్రచారం ఉంది. అసంతృప్తిగా ఉన్న నాయకులు వాళ్లంతట వాళ్లే వెళ్లిపోయేలా చేస్తుందనే ఆరోపణ ఉంది. 2018లో ముగ్గురు రెబల్స్ ను సస్పెండ్ చేసింది. ఆ తర్వాత ఇప్పటి వరకూ ఎవర్నీ సస్పెండ్ చేయలేదని తెలుస్తోంది. డీ. శ్రీనివాస్ విషయంలోనూ ఆయనపై బీఆర్ఎస్ అధిష్టానం వేటు వేయలేదు. ఆయనే స్వయంగా రాజీనామా చేసి, పార్టీకి దూరంగా ఉంటూ వచ్చారు. 

మరోవైపు.. ఈ ఇద్దరు నాయకులు ఏ పార్టీలో చేరుతారానేది కూడా ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఏదైనా జాతీయ పార్టీలో చేరుతానని రెండు రోజుల క్రితమే పొంగులేటి ప్రకటించారు. అయితే.. ఆ జాతీయ పార్టీ కాంగ్రెస్సా, లేదా బీజేపీనా అనేది ఆసక్తిగా మారింది. మరి జూపల్లి పయనం ఏటు అన్నది కూడా చర్చనీయాంశంగా మారింది. గతంలో కాంగ్రెస్ లో పని చేశారు. మంత్రిగానూ సేవలందించారు.