
- సమగ్ర విచారణ తర్వాత భూ భారతి పోర్టల్‌లో అప్‌లోడ్ చేయాలి
- భూసమస్యలపై 8.27 లక్షల అప్లికేషన్లు వచ్చాయన్న మంత్రి
హైదరాబాద్, వెలుగు: రెవెన్యూ సదస్సుల్లో స్వీకరించిన ప్రతి దరఖాస్తును సమగ్రంగా పరిశీలించి, అర్హత కలిగిన అన్నింటినీ సానుకూలంగా పరిష్కరించాలని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రతి దరఖాస్తుపై సమగ్ర విచారణ జరిపి, సంబంధిత వ్యక్తులకు నోటీసులు జారీ చేయాలని ఆయన సూచించారు. అవసరమైన డాక్యుమెంట్లు, రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించి, ఆధారాలన్నింటినీ ఒకే డాక్యుమెంట్‌గా భూభారతి పోర్టల్‌లో అప్‌లోడ్ చేయాలని అధికారులకు నిర్దేశించారు.
తిరస్కరించిన దరఖాస్తుల వివరాలను, తిరస్కరణకు గల కారణాలను లిఖితపూర్వకంగా దరఖాస్తుదారులకు ఇవ్వాలని ఆదేశించారు. రెవెన్యూ సదస్సులపై మంగళవారం మంత్రి పొంగులేటి సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలోని 594 మండలాల్లో 10,226 రెవెన్యూ సదస్సులు నిర్వహించామని తెలిపారు. ఈ సదస్సుల ద్వారా మొత్తం 8,27,230 దరఖాస్తులు అందాయని, ఇప్పటివరకు 7,98,528 దరఖాస్తులను భూభారతి పోర్టల్‌లో నమోదు చేశామన్నారు. మిగిలిన దరఖాస్తుల నమోదు ప్రక్రియను ఒకటి, రెండు రోజుల్లో పూర్తిచేస్తామని ఆయన వెల్లడించారు.
రాష్ట్రంలో భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపడమే లక్ష్యంగా భూభారతి చట్టాన్ని తీసుకువచ్చామని తెలిపారు. సర్వే నంబర్లలో లోపాలు, పీపీబీ, ఆర్‌ఓఆర్, నాలా, ఆర్.ఎస్.ఆర్ సవరణ, అప్పీల్స్, కోర్టు కేసులు, పోడు భూములు వంటి 30 రకాల భూ సమస్యలపై 8.27 లక్షల దరఖాస్తులు వచ్చాయని ఆయన వివరించారు. గత ప్రభుత్వం తీసుకువచ్చిన ధరణి వల్ల ఇబ్బందులు పడిన తెలంగాణ ప్రజానీకానికి భూభారతి చట్టం ద్వారా విముక్తి కల్పిస్తామని ప్రకటించారు. మొత్తం రెవెన్యూ యంత్రాంగం సమస్యల పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.