పథకాల అమలులో ప్రజల మన్ననలు పొందాం : పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

పథకాల అమలులో ప్రజల మన్ననలు పొందాం : పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

ఇల్లెందు/సత్తుపల్లి/దమ్మపేట/పాల్వంచ, వెలుగు: గత ప్రభుత్వాన్ని మరిచేలా పథకాలు అమలు చేస్తూ ప్రజల మన్ననలు పొందామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు.  గురువారం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పలుచోట్ల ఏర్పాటు చేసిన నియోజకవర్గ సన్నాహక సమావేశాల్లో ఆయన మాట్లాడారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్​ఎన్నికల సమయంలో రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని  నెరవేరుస్తోందని తెలిపారు.  పార్లమెంట్ ఎన్నికల్లో అధిష్టానం ఎవ్వరికి టికెట్ ​కేటాయించినా భారీ మెజార్టీతో గెలిపించాలని కార్యకర్తలకు, ప్రజలకు పిలుపునిచ్చారు.

అనవసరంగా నోళ్లుపారేసుకుంటున్నవారికి గెలిచి వాళ్ల నోళ్లు మూయిస్తామని చెప్పారు. గత ప్రభుత్వం చేసిన అప్పులను, తప్పులను ఒప్పుకోవడం లేదని, వాటన్నిటినీ ప్రజలకు తెలియజేస్తామన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు​ సందర్శనకు సీఎం రేవంత్ రెడ్డి తీసుకుపోతా అంటే కేసీఆర్ ఎందుకు రాలేదని ప్రశ్నించారు. పదేళ్లు నిరంతరాయంగా దోపిడీకి పాల్పడి ధనిక రాష్ట్రాన్ని అప్పులు పాలుజేసిన కల్వకుంట్ల కుటుంబాన్ని రాజకీయంగా ఉరితీయాలన్నారు.  ఉమ్మడి ఖమ్మం జిల్లా పేద ప్రజలకు సరిపడా ఇందిరమ్మ  ఇండ్లు ఇస్తానని చెప్పారు. 

సత్తుపల్లి పరిధిలో మిషన్ భగీరథ నీటి సరఫరా విషయంలో అధికారుల నిర్లక్ష్యం పై అసహనం వ్యక్తం చేశారు. సింగరేణి  డీఎంఎఫ్​టీ నిధులతో సత్తుపల్లి నియోజక వర్గ అభివృద్ధికి కృషి చేయాలని అధికారులను కోరారు. మార్చి 4న సత్తుపల్లిలో కలెక్టర్, జిల్లా ఫారెస్ట్, రెవెన్యూ అధికారులతో పోడు భూముల సమస్య పై జిల్లా స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు.

ప్రభుత్వ భూమి అంగుళం కబ్జా చేసిన ఊపేక్షించేది లేదని హెచ్చరించారు. ఇప్పటికి 17 కోట్ల మంది ఆడబిడ్డలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని అందించిన ఘనత కాంగ్రెస్ కే దక్కుతుందన్నారు. పాల్వంచలో పార్టీ నాయకులు, కార్యకర్తలు మంత్రికి ఘన స్వాగతం పలికారు. ఆయన వెంట  ఎమ్మెల్యే కోరం కనకయ్యతోపాటు పలువురు రాష్ట్ర, జిల్లా నాయకులు, అధికారులు ఉన్నారు.

కాంగ్రెస్​లో చేరిన జడ్పీ చైర్మన్​

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : చుంచుపల్లి మండలంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్​క్యాంప్​ ఆఫీస్​లో గురువారం ఏర్పాటు చేసిన ప్రోగ్రాంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా బీఆర్ఎస్​ మాజీ అధ్యక్షుడు, జడ్పీ చైర్మన్​ కంచర్ల చంద్రశేఖర్​ కాంగ్రెస్​ పార్టీలో చేరారు. ఆయనకు మంత్రి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. బీఆర్​ఎస్​కు చెందిన పలువురు మున్సిపల్​ కౌన్సిలర్లు, ఎంపీటీసీలు, మాజీ సర్పంచ్​లు కాంగ్రెస్​లో చేరడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.