కాంగ్రెస్ ఇచ్చిన పొడు పట్టా భూములను కేసీఆర్ ప్రభుత్వం లాక్కుంది : పొంగులేటి శ్రీనివాస రెడ్డి

కాంగ్రెస్ ఇచ్చిన పొడు పట్టా భూములను కేసీఆర్ ప్రభుత్వం లాక్కుంది : పొంగులేటి శ్రీనివాస రెడ్డి

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకల్లో తెలంగాణ ప్రభుత్వంపై మాజీ ఎంపీ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ కో చైర్మన్ పొంగులేటి శ్రీనివాస రెడ్డి మండిపడ్డారు. నీళ్లు, నిధులు, నియామకాల కోసం తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసుకుంటే.. ఒక కల్వకుంట్ల కుటుంబం వారికే ఉద్యోగాలు అందాయన్నారు. పొడు భూములకు పట్టాలు ఇస్తున్నామని చెప్పి.. 4 లక్షల పట్టాలు మాత్రమే ఇచ్చారన్నారు. ఆదివాసీలు, గిరిజనుల పక్షాన కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడు అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. 

కాంగ్రెస్ ప్రభుత్వ హయంలో గిరిజనులకు ఇచ్చిన పొడు పట్టా భూములను కేసీఆర్ ప్రభుత్వం లాక్కుందని ఆరోపించారు పొంగులేటి శ్రీనివాస రెడ్డి. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చి సోనియాగాంధీకి కానుకగా ఇవ్వాలన్నారు. రాబోయే ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కౌలు రైతులకు కూడా రైతుబంధు ఇస్తుందని చెప్పారు. ఆదివాసీ ప్రపంచ దినోత్సవం రోజు గిరిజనులందరూ శపథం చేసి కేసీఆర్ ప్రభుత్వాని పారదోలుదామన్నారు. నేటికీ విద్య, వైద్యానికి ఆదివాసులు దూరంగా ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 

ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ఇల్లందు పట్టణంలో ఆదివాసీ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆదివాసీ జెండా ఆవిష్కరించారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి. అనంతరం కొమురం భీమ్ చిత్రపటానికి పూలమాల వేసి, నివాళులర్పించారు. అనంతరం ఇల్లందు పట్టణంలోని ర్యాలీ నిర్వహించారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదివాసీలతో కలిసి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జెడ్పీ చైర్మన్ కోరం కనకయ్య, నృత్యాలు చేశారు. ఆదివాసీలు కేరింతలు కొడుతూ ఈ ప్రదర్శనలో పాల్గొన్నారు.