కార్మికులకు ఇచ్చిన హామీలు నెరవేరుస్తాం : పొంగులేటి శ్రీనివాస రెడ్డి

కార్మికులకు ఇచ్చిన హామీలు నెరవేరుస్తాం  : పొంగులేటి శ్రీనివాస రెడ్డి

మణుగూరు, వెలుగు: సింగరేణి కార్మికులు మళ్లీ టీబీజీకేఎస్ మాయ మాటలు నమ్మి మోసపోయి గోసపడొద్దని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సూచించారు. సిగరేణి గుర్తింపు ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం మణుగూరు సింగరేణి ఓపెన్ కాస్ట్ మైన్ లో ఏర్పాటు చేసిన ఫిట్ మీటింగ్ లో ఆయన మాట్లాడారు. ఓటమి భయంతో గత ప్రభుత్వం సింగరేణి ఎన్నికలను వాయిదా వేస్తూ కార్మికుల హక్కులను కాలరాసిందన్నారు. కానీ ప్రజా ప్రభుత్వం ఏర్పడిందని, సీఎం రేవంత్ రెడ్డి సహకారంతో సింగరేణి కార్మికులకు ఇచ్చిన హామీలను నెరవేర్చుతామని చెప్పారు. 

ఐదు సంవత్సరాల్లో సింగరేణి మైన్స్ కనుమరుగైపోతూ కార్మికుల సంఖ్య తగ్గుతూ వచ్చిందన్నారు. కాంగ్రెస్ పార్టీ, ఐఎన్టీయూసీ మేనిఫెస్టోలో పెట్టిన విధంగా 2 లక్షల ఉద్యోగాల భర్తీలో భాగంగా సింగరేణి ఉద్యోగాలను కూడా భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. కార్మికుల సొంతింటి కల నెరవేర్చడం కోసం 250 గజాల స్థలాన్ని ఇస్తూ 20 లక్షల వడ్డీ లేని రుణాలను మంజూరు చేస్తామన్నారు. కార్మికుల సమస్యలు తీరాలంటే అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘమైన ఐఎన్టీయూసీ వల్ల మాత్రమే సాధ్యమవుతుందని చెప్పారు. కారుణ్య నియామకాలతో పాటు మెడికల్ అన్ ఫిట్ జాబ్స్ వచ్చేలా కృషి చేస్తామన్నారు. 

అసెంబ్లీ ఎన్నికల్లో కమ్యూనిస్టు పార్టీలతో పొత్తులు పెట్టుకున్నామని, అదే సంస్కృతిని సింగరేణి సంస్థలో కొనసాగిద్దామని కోరినా వారు తిరస్కరించారని తెలిపారు. ప్రభుత్వ సహాయం లేకుండా ఆ సంఘాల వల్ల కార్మికులకు ఎటువంటి న్యాయం జరగదనేది గుర్తుంచుకోవాలన్నారు. కార్యక్రమంలో పినపాక నియోజకవర్గ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, డీసీసీబీ డైరెక్టర్ తుళ్లూరి బ్రహ్మయ్య, ఐఎన్టీయూసీ లీడర్లు త్యాగరాజు, సోమరాజు, నామ వెంకటేశ్వరరావు, సామా శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

సత్తుపల్లిలో... 

సత్తుపల్లి, వెలుగు  : ఐఎన్టీయూసీ ఆధ్వర్యంలో స్థానిక ఎమ్ఆర్ గార్డెన్​లో ఏర్పాటు చేసిన సమావేశానికి స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ తో కలిసి మంత్రి పొంగులేటి మాట్లాడారు. సింగరేణి ఎన్నికలు జరగకుండా కోర్టులో స్టే తెచ్చుకొని కాలం వెల్లతీసినవారిని మళ్లీ నమ్మొద్దని సూచించారు. ఎమ్మెల్యే రాఘమయి మాట్లాడుతూ సింగరేణి ఆవిర్భవ దినోత్సవ సందర్భంగా  డిసెంబర్23 న సెలవు ప్రకటించే విధంగా ఆదేశాలు ఇస్తామని చెప్పారు. 

సింగరేణి కార్మికుల కోసం మూడు సూపర్ స్పెషాలిటీ హాస్పిటళ్లు నిర్మిస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ తోట సుజల రాణి, కౌన్సిలర్లు పద్మ జ్యోతి, గ్రాండ్ మౌలాళి, దూడిపాళ్ల రాంబాబు, ఐఎన్​టీయూసీ కొత్తగూడెం ఏరియా వైస్ చైర్మన్ ఆల్బర్ట్, జిల్లా కాంగ్రెస్​ నాయకులు మట్ట దయానంద్, నరుకుళ్ల అప్పారావు, రావి నాగేశ్వర రావు, రజాక్, పోట్రు రామరావు, రాఘవులు పాల్గొన్నారు.